Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం కమిషన్‌ను రద్దు చేయండి

కాళేశ్వరం కమిషన్‌ను రద్దు చేయండి

- Advertisement -

కేసీఆర్‌ లాయర్‌ వాదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై నియమితమైన జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో వాదించారు. కమిషన్‌ ముందుగా తనను సాక్షిగా పిలిచిందనీ, ఆ తర్వాత ఆరోపణలపై వివరణ తీసుకోకుండానే బాధ్యుడిగా పేర్కొందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జారీ చేసిన జీఓ 6 ద్వారా జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిషన్‌ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్టును రద్దు చేయాలనీ, కమిషన్‌ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఎస్‌కే జోషి, ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ వేసిన వేరు వేరు పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల డివిజన్‌ బెంచ్‌ విచారించింది. సీనియర్‌ అడ్వొకేట్‌ శేషాద్రినాయుడు వాదిస్తూ, కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చట్టం కింద సెక్షన్‌ 4, 5 ప్రకారం కేసీఆర్‌ను సాక్షిగా విచారణకు హాజరు కావాలని కమిషన్‌ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇతరుల సాక్ష్యాల ఆధారంగా కమిషన్‌ పిటిషనర్లపై తుది నిర్ణయానికి వచ్చే ముందు సెక్షన్‌ 8బి, 8సి ప్రకారం ముందస్తు వివరణ కోసం నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. సాక్షులను క్రాస్‌ ఎగ్జామ్‌ చేసే అవకాశం ఇవ్వలేదన్నారు. నివేదికలో ప్రాజెక్టు డిజైన్‌, టెండర్లు, కాంట్రాక్టర్ల ఎంపిక తదితర అంశాల్లో నాటి సీఎం కేసీఆర్‌ను బాధ్యుడిగా పేర్కొనడం ఏకపక్షమన్నారు. కేసీఆర్‌ వల్ల రూ.7,500 కోట్ల నష్టం జరిగినట్టు కమిషన్‌ ఒక నిర్ణయానికి రావడం చెల్లదని వాదించారు. పిటిషనర్‌పై ఆరోపణలు ఉంటే వాటికి చెందిన ఆధారాలు, సాక్ష్యాలను కమిషన్‌ ఇవ్వాలనీ, వివరణ తీసుకోవాలనీ, ఆరోపణలు చేసిన వారినీ, కేసీఆర్‌, ఇతర పిటిషనర్లు వేర్వేరుగా క్రాస్‌ ఎగ్జామ్‌ చేయాలనీ, ఈ అవకాశాలు కమిషన్‌ ఇవ్వకుండానే తుది రిపోర్టు ఇవ్వడం చెల్లదన్నారు. విచారణ మార్చి 2కు వాయిదా పడింది.

జర్నలిస్ట్‌ పాస్‌పోర్టు రద్దు కరెక్టే
రెండు వేర్వేరు పేర్లతో ఉన్న పాస్‌పోర్టులను చూపించిన ఘటనలో పాస్‌పోర్టు అధికారుల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆమోదించింది. జర్నలిస్టు సయ్యద్‌ అలి హుస్సేన్‌ రిజ్వీ పాస్‌పోర్టు రద్దును గతంలో సింగిల్‌ జడ్జి సమర్ధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జర్నలిస్ట్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌, పిటిషనర్‌ వ్యవహారాన్ని తప్పుపట్టింది. సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఒక పేరుతో ఉన్న పాస్‌పోర్టు కాపీతో పాటు మరో పేరుతో ఉన్న పాస్‌పోర్టును చూపించి రెండూ తనవేనని చెప్పడం ద్వారా అధికారులను తప్పుదారి పట్టించారని బెంచ్‌ తేల్చింది. అప్పీల్‌ను డిస్మిస్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -