Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅడుగడుగునా అధికార దుర్వినియోగం

అడుగడుగునా అధికార దుర్వినియోగం

- Advertisement -

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కోడ్‌ ఉల్లంఘించడం దుర్మార్గం
బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు అభినందనలు : మాజీమంత్రి హరీశ్‌రావు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించటం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్‌ వరకూ కాంగ్రెస్‌ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బెదిరించడమే కాకుండా వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయమని తెలిపారు.

ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని వివరించారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌లకు హరీశ్‌రావు అభినందనలు, శుభాకాంక్షలు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -