Monday, October 20, 2025
E-PAPER
Homeజాతీయంజేఎన్‌యూ విద్యార్థులపై ఏబీవీపీ మూక దాడి

జేఎన్‌యూ విద్యార్థులపై ఏబీవీపీ మూక దాడి

- Advertisement -

నిరసిస్తూ మార్చ్‌ చేపట్టిన జేఎన్‌యూఎస్‌యూ నేతలపై పోలీసుల లాఠీచార్జి
జేఎన్‌యూఎస్‌యూ ఆఫీస్‌ బేరర్లు సహా ఆరుగురు విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల కేసు
ఏబీవీపీ గూండాలపై కేసు నమోదు చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై ఏబీవీపీ గూండాలు దాడి చేశారు. అయితే జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆఫీస్‌ బేరర్లు సహా ఆరుగురు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి సంఘం ఎన్నికలను దెబ్బతీసే లక్ష్యంతో క్యాంపస్‌లో విస్తతంగా దాడి చేసిన ఏబీవీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు నిదీష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి ముంటేహా ఫాతిమా, ఉపాధ్యక్షురాలు మనీషాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కానీ పోలీసులు విద్యార్థులపై దాడి చేసిన ఏబీవీపీ గూండాలపై మాత్రం కేసు నమోదు చేయలేదు. దీనిపై ఢిల్లీ పోలీసులను ఎస్‌ఎఫ్‌ఐ సహా జేఎన్‌యూలోని విద్యార్థి సంఘాలన్నీ నిలదీస్తోన్నాయి. యూనివర్శిటీలో ఏబీవీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ వికాస్‌ పటేల్‌, ఇతరులు హింసకు ప్రేరేపించారు. దీన్ని ప్రశ్నించిన విద్యార్థులపై దాడికి దిగారు.

జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు నిదీష్‌ కుమార్‌ని కొట్టి, ఇతర ఆఫీసు బేరర్లపై కులతత్వ, ఇస్లామోఫోబిక్‌, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఏబీవీపీ గూండాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐతో సహా వామపక్ష విద్యార్థి సంఘాలు శనివారం రాత్రి వసంత్‌ కుంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు శాంతియుతంగా మార్చ్‌ నిర్వహించాయి. యూనివర్శిటీ వెస్ట్‌ గేటు వద్దనే విద్యార్థుల మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నేత సూరజ్‌ ముఖంపై, కడుపుపై తీవ్రంగా కొట్టారు. విద్యార్థినీల దుస్తులను పోలీసులు చింపేశారు. సివిల్‌ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అభిషేక్‌ కుమార్‌, ఉత్సాతో పాటు 28 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు పోలీస్‌ స్టేషన్‌కు సామాజిక న్యాయ మార్చ్‌ నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేశారు.

అయితే, వారిలో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ దాడిలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అభిషేక్‌ కుమార్‌, ఉత్సాతో పాటు మరి కొంతమంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వారిని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను కొట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐతో సహా విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. విద్యార్థినీలపై మగ పోలీసులు దాడి చేశారని, చాలా మంది పోలీసులు యూనిఫాం ధరించకుండా ఉన్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేత గోపిక విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ నేత అభిషేక్‌ కుమార్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని, ఆయన ప్రైవేట్‌ పార్ట్స్‌తో సహా ఇతర భాగాల్లో గాయాల పాలయ్యాయని తెలిపారు. జనరల్‌ బాడీ మీటింగ్‌లను అడ్డుకుంటూ జేఎన్‌యూఎస్‌యూ కౌన్సిలర్లు, ఆఫీస్‌ బేరర్లపై దాడి చేస్తున్న ఏబీవీపీ గూండాలపై 48 గంటలు గడిచినా ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం దారుణమన్నారు. విద్యార్థులను వేధించినప్పుడు మౌనంగా ఉన్న పోలీసులు ఇప్పుడు శాంతియుత నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేశారని విమర్శించారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ విశ్వవిద్యాలయం విద్యార్థులచే నిర్మించబడిందని, విద్యార్థులచే నిలబెట్టబడిందని పోలీసులకు ఆమె గుర్తు చేశారు. విద్యార్థులు ఇప్పుడు, ఎప్పటికీ ఏదీ మర్చిపోకూడదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -