Sunday, March 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగజ్వేల్‌ తహసీల్దార్‌ ఇండ్లపై ఏసీబీ పంజా

గజ్వేల్‌ తహసీల్దార్‌ ఇండ్లపై ఏసీబీ పంజా

- Advertisement -

కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఐదు బృందాల తనిఖీ
భారీగా డబ్బు, బంగారం స్వాధీనం
కిందకు విసిరేసిన బ్యాగులో కట్టల కొద్దీ నోట్లు!
సినిమా ఫక్కీలో తప్పించుకునే ప్రయత్నం!
ఐదు చోట్ల ఐదు బృందాలు ఏకకాలంలో సోదాలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్‌ క్రైమ్‌/గజ్వేల్‌ రూరల్‌

అవినీతి తిమింగలాల వేటలో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. గజ్వేల్‌ తహసీల్దార్‌ కమటం శ్రవణ్‌ కుమార్‌ టార్గెట్‌గా కరీంనగర్‌ నగరవ్యాప్తంగా శనివారం ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాలు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు, శ్రవణ్‌ కుమార్‌కు సంబంధించిన కీలక స్థావరాలను జల్లెడ పట్టాయి. శనివారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు ప్రారంభించారు. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు ఐదు ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. శ్రవణ్‌కుమార్‌కు చెందిన ప్రధాన నివాసం నగరంలోని మహారాజా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వెనుక ఉన్న భవనం సహా ఆర్టీసీ కాలనీలోని రెండు వేర్వేరు ఇండ్లు, లక్ష్మీనగర్‌లోని శ్రవణ్‌ కుమార్‌ సోదరి నివాసం, అలాగే ఆయన తండ్రి నివాసంలోనూ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

కిందకు విసిరేసిన బ్యాగులో కట్టల కొద్దీ నోట్లు!
ఈ సోదాల సమయంలో ఆసక్తికరమైన సినిమా తరహా ఉదంతం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తన ఇంటి తలుపు తడుతున్నారని గ్రహించిన శ్రవణ్‌ కుమార్‌, కంగారులో తన వద్ద ఉన్న అక్రమ నగదును దాచేందుకు ప్రయత్నించారు. హిందూపూర్‌ కాలనీలోని తన నివాసం పై అంతస్తు నుండి నోట్ల కట్టలతో ఉన్న ఒక బ్యాగును కిందకు విసిరేసినట్టు సమాచారం. అయితే, అప్పటికే ఇంటిని చుట్టుముట్టిన ఏసీబీ సిబ్బంది ఆ బ్యాగును చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. అందులో భారీగా నగదు లభించడంతో అధికారులే విస్తుపోయారు.

సీజ్‌ చేసిన ఆస్తుల వివరాలు…
సోదాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం అధికారులు భారీ మొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించారు అందులో విసిరేసిన బ్యాగుతో పాటు ఇంట్లోని లాకర్లలో లభించిన కోట్లాది రూపాయల నగదు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను సీజ్‌ చేశారు. కరీంనగర్‌, గజ్వేల్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన భూములు, ప్లాట్లు, భవనాలకు సంబంధించిన కీలక దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధికారులు దష్టి సారించారు.

అవినీతి నెట్‌వర్క్‌పై ఆరా
గజ్వేల్‌ వంటి కీలక ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రవణ్‌ కుమార్‌, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఆయనకు సహకరించిన ఇతర రెవెన్యూ సిబ్బంది లేదా మధ్యవర్తుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగానే ఈ దాడులు జరిగాయి. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు, బంగారం మరియు ఆస్తుల విలువను అధికారికంగా ప్రకటిస్తాం.’ అని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం తనిఖీలు తుది దశకు చేరుకున్నాయి. తహసీల్దార్‌ శ్రవణ్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ ఘటనతో జిల్లాలోని అవినీతి అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -