నవతెలంగాణ – జగిత్యాల టౌన్ : జగిత్యాల మున్సిపాలిటీలో ఆకస్మాత్తుగా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో అవినీతి జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో అధికారులు సమగ్రంగా తనిఖీలు చేస్తున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్, ఇంజనీరింగ్ విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సోదాలతో మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మున్సిపల్ కార్యాలయంలో గతంలో ఇదే మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు జరగడం గమనార్హం.





