Thursday, July 24, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చెక్‌పోస్టులకు దూరంగా అక్రమ అడ్డాలపై ఏసీబీ దృష్టి

చెక్‌పోస్టులకు దూరంగా అక్రమ అడ్డాలపై ఏసీబీ దృష్టి

- Advertisement -

– ”కమర్షియల్‌ ట్యాక్స్‌’లో చేతివాటం’ కథనంపై చర్చ
– వ్యాపారవర్గాల హర్షాతిరేకం
– వసూళ్ల దందాలో ప్రయివేటు డ్రైవర్లే కీలకం
– టార్గెట్లు లేవని బుకాయిస్తున్న కొత్తగూడెం డీసీటీవో
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

‘కమర్షియల్‌ ట్యాక్స్‌’లో చేతివాటం శీర్షికన ‘నవతెలంగాణ’లో బుధవారం ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. చెక్‌పోస్టులకు దూరంగా అడ్డాలు ఏర్పాటు చేసుకొని వాహనాల ట్రాఫిక్‌ చెక్‌ (వీటీసీ) పేరుతో తనిఖీలు చేస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారంపై ఏసీబీ దృష్టి సారించింది. చెక్‌పోస్టుల్లో నిరంతరం నిఘా ఉంటుంది కాబట్టి అక్రమ వసూళ్లకు ఆస్కారం ఉండదనే కారణంతో జీఎస్టీ సిబ్బంది వీటికి దూరంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపటం వల్ల ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వీటీసీ ద్వారా వసూలు చేయాలనే టార్గెట్‌పై కొత్తగూడెం డీసీటీవో బుకాయిస్తున్నారు. ‘అలాంటిదేమీ లేదు.. ఎన్నిగంటల పాటు వీటీసీ చేపట్టారనేదే చూస్తారు’ అని చెబుతున్నారు. ఏయే ఏసీటీవో ఎక్కడ వీటీసీ చేపట్టాలనే.. విధుల కేటాయింపు మాత్రం వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం నిర్దేశిస్తుందని చెబుతున్నారు. అయితే ‘నవతెలంగాణ’ కథనంపై వ్యాపారవర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. జీఎస్టీ సిబ్బంది తీరుతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. ఇక ఈ అక్రమ వ్యవహారంలో ప్రయివేటు డ్రైవర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆఫీస్‌ సిబ్బంది బినామీ వెహికల్స్‌ను, వాటి డ్రైవర్లను ఏండ్ల తరబడి కొనసాగిస్తుండటం వెనుక అవినీతి ఆలోచన దాగుందనే చర్చ సాగుతోంది. వీటీసీ పేరుతో కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయాల సిబ్బంది సాగిస్తున్న వసూళ్లపై ఏసీబీ కూడా దృష్టి సారించింది.
వసూళ్ల దందాలో కారు డ్రైవర్లే కీలకం
కమర్షియల్‌ ట్యాక్స్‌ వాహన తనిఖీల్లో చోటుచేసుకుంటున్న వసూళ్ల దందాలో కారు డ్రైవర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొత్తగూడెం సీటీవో-1,2 కార్యాలయాల ప్రయివేటు కారు డ్రైవర్లపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. 15 ఏండ్లుగా సీటీవో కార్యాలయాలకు కార్ల (టీఎస్‌08 యూహెచ్‌ 0512, టీఎస్‌28 టీబీ 1726) కిరాయికి పెడుతున్న వీరిద్దరిపై అనేక ఆరోపణలున్నా సంబంధిత అధికారులు కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. వీరిపై ఏసీబీ దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం. ఐదేండ్లకోసారి కార్ల కిరాయిని రెన్యూవల్‌ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ప్రకటన లేకుండానే గత 15 ఏండ్లుగా ఈ రెండు కార్లు, డ్రైవర్లను కొనసాగిస్తుండటం అవినీతికి నిదర్శనం.
ఖమ్మం సీటీవో-2 ధనలక్ష్మి డీసీకి అటాచ్‌..
ఖమ్మం సీటీవో-2 ధనలక్ష్మిని సైతం అవినీతి ఆరోపణలతో ఇటీవల నిజామాబాద్‌ డీసీ (డిప్యూటీ కమిషనర్‌)కి ఎటాచ్‌ చేశారు. జీఎస్టీ చెల్లింపుల్లో చిన్నచిన్న లోటుపాట్లను అడ్డుపెట్టుకొని వ్యాపారులను బెదిరించినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు రావటంతో సంస్థాగతంగా విచారణ నిర్వహించి నిర్ధారణ కావటంతో డీసీకి అటాచ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి పోస్టూ కేటాయించకపోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా చెకింగ్‌
కమర్షియల్‌ ట్యాక్స్‌ సిబ్బంది వెహికల్‌ ట్రాఫిక్‌ చెకింగ్‌ (వీటీసీ) నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. ఏ చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహించాలని ఆదేశాలున్నాయో అక్కడే వాహనాలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ చెక్‌పోస్టుల వద్ద సోదాలు నిర్వహిస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. కాబట్టి వేర్వేరు ప్రాంతాల్లో వాహనాలను చెక్‌ చేస్తూ వసూలు చేసిన సొమ్మును ఏసీబీ, విజిలెన్స్‌ కంటపడకుండా దారిమళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ముత్తగూడెం చెక్‌పోస్టులో చేయాల్సిన సోదాలను కల్లూరు వద్ద చేపట్టారు. ఓ ఏసీటీవో (అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌) నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతుండగా ఏసీబీ అధికారులు రైడ్‌ చేశారు. ఏసీటీవోతో పాటు డ్రైవర్‌, అటెండర్ల ఫోన్‌పేలు చెక్‌ చేశారు. డ్రైవర్‌, అటెండర్‌ ఫోన్‌పేల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. డబ్బులు కూడా దొరకటంతో అవినీతి జరిగిందని నిర్ధారించుకొని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -