ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు
ఒక వైపు సోదాలు.. మరోవైపు కొనసాగిన వసూళ్లు
ఏఎమ్‌వీఐ, ఐదుగురు ఏజెంట్లపై కేసు నమోదు
నవతెలంగాణ-భిక్కనూర్/కామారెడ్డి
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన గల ఆర్టీఏ చెక్‌పోస్టుపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. లారీల డ్రైవర్‌ల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏసీబీ సోదాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు సోదాలు జరుగుతుండగా.. మరో వైపు డబ్బుల వసూళ్లలో భాగంగా చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో డ్రైవర్‌లు డబ్బులు వేసుకుంటూ వెళ్లడం గమనార్హం. ఈ దాడుల్లో ఏఎంవీఐ సామ్ రీచర్డ్ సన్ వద్ద లెక్కల్లో చూపని రూ.16వేలు, ప్రయివేట్ ఏజెంట్ శివకుమార్ వద్ద రూ.29వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.24వేలను కార్యాలయ ఫైల్ ఫోల్డర్‌లో దాచిపెట్టినట్టు గుర్తించారు. ఆర్టిఏ చెక్‌పాయింట్ వద్ద డ్రైవర్లు నిత్యం నగదు చెల్లించడం.. కొంతకాలంగా సాగుతున్న దోపిడీపై అందిన సమాచారంతో మేరకు ఆకస్మిక దాడులు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో లారీ డ్రైవర్లు చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేసిన నగదు రూ.23వేలుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లెక్కలో చూపని రూ.52వేలు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఏఎంవీఐ, ఐదుగురు ప్రయివేట్ ఏజెంట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని, తెలంగాణ సోషల్ మీడియా.. వాట్సాప్ నెంబర్ 9440446106కి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు పేసూచించారు. ఈ దాడుల సమయంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెక్ పోస్ట్ తలుపులు, కిటికీలు మూసేసి సోదాలు నిర్వహించారు.
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ రైడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES