ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు ఆర్థిక సహాయం
నవతెలంగాణ – అచ్చంపేట
చెరువులలో చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కల్పిస్తుంది. చేపలు పడుతున్న సమయంలో, ఇతర ప్రమాదంలో మత్స్యకారుడు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడుతుంటారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి మత్స్య బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. చేపల వేట పై ఆధారపడి జీవనం గడుపుతున్న మత్స్యకారులకు ప్రమాద బీమా పాలసీ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధిలో 235 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో 17,500 మంది సభ్యులు ఉన్నారు.
జిల్లాలో ఎక్కడైనా మత్సకారులు ప్రమాదంలో చనిపోతే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మహత్య చేసుకుంటే ఎలాంటి ఆర్థిక సహాయం రాదు.
ప్రమాదంలో చనిపోతే.. రూ. 5 లక్షలు ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. 2 లక్షల 50 వేలు, హాస్పిటల్ ఖర్చులకు రూ.25వేలు ఇవ్వడం జరుగుతుంది. సంఘటన జరిగిన 15 రోజులలో జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మరణ ధ్రువీకరణ పత్రం, పోస్టుమార్దమ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాగితం, నామిని ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, సొసైటీ సభ్యుల తీర్మానం కాగితం, దరఖాస్తుతో జత చేయాలి. అధికారులు దరఖాస్తులను పరిశీలించి విచారణ చేసిన రిపోర్టును నివేదికలను బీమా నిధి మంజూరు కోసం పై అధికారులకు నివేదికను పంపిస్తారు మూడు నెలలో బాధితుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి: నరసింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగర్ కర్నూల్
ప్రభుత్వం కల్పించిన ప్రమాద బీమా సౌకర్యాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 235 సొసైటీ సంఘాలు ఉన్నాయి. 17,500 మంది మత్సకారులు ఉన్నారు. ప్రమాదం చనిపోయిన బాధిత కుటుంబానికి బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది.



