నియామక ప్రక్రియలో సంస్కరణలు తేవాలి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు
వ్యతిరేకంగా ఢిల్లీలో అభ్యర్థుల ఆందోళన
వేల సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, టీచర్లు
న్యూఢిల్లీ : వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ)కి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. జవాబుదారీతనం పెరగాలనీ, నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎస్సెస్సీ అభ్యర్థులు నిరసనలకు దిగారు. ఛాత్ర మహా ఆందోళన్ బ్యానర్ కింద రామ్‌లీల మైదాన్ వద్ద ఈ ఆందోళన జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నిరసనప్రదర్శనలకు హాజరైన అభ్యర్థులు.. నియామకాల్లో ఎస్సెస్సీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జవాబుదారీ తనం పెరగాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో మార్పులు తేవాలన్నారు. వ్యవస్థలో అనేక లోపాలున్నాయనీ, వాటిని సరిదిద్దాలని చెప్పారు.
ప్రతి ఏడాదీ ఎస్సెస్సీ భర్తీ చేసే పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అయితే పేపర్ లీక్‌లు, పరీక్షల వాయిదాలు, ప్రశ్న పత్రాల్లో లోపాలతో అభ్యర్థుల నుంచి ఇప్పటికే తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఇప్పుడీ నిరసనప్రదర్శనలతో అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన, లోపాలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎస్సెస్సీపై పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియపై అభ్యర్థులు అసంతృప్తిని తెలియజేశారు. ఒక వ్యవస్థాగతమైన సంస్కరణకు, మెరుగైన పర్యవేక్షణ, ప్రశ్నపత్ర లోపాలు, కీలక సమస్యలకు సమాధానాలు, మెరిట్ ప్రచురణలో జాప్యం వంటి ఫిర్యాదుల పరిష్కరణకు వారు డిమాండ్ చేశారు. అర్థవంతమైన మార్పును తప్పక తీసుకురావాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు.
డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆందోళనాకారులు చెప్పారు. ఎస్సెస్సీ వ్యవస్థలో మెరుగుదల రాకపోతే దాని విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని తెలిపారు. భారీ సంఖ్యలో గుమిగూడిన నిరసనకారుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీరి తాజా నిరసనతో ఎస్సెస్సీ వివాదాల గురించి ప్రజల్లో మరింత అవగాహనను పెంచిందని విశ్లేషకులు అంటున్నారు.
జవాబుదారీతనం రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES