Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్ల కోసం లెక్కల మాయాజాలం

కార్పొరేట్ల కోసం లెక్కల మాయాజాలం

- Advertisement -

– కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నేడు నిరసనలు :అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌ కార్పొరేట్ల కోసం రూపొందించిన లెక్కల మాయాజాలమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. ఆ బడ్జెట్‌ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా నిరసనలు, ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌తో మరోసారి మోడీ సర్కారు ప్రజా వ్యతిరేకతను, ధనవంతుల అనుకూలతను ప్రదర్శించిందని విమర్శించారు. 2025-26 బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లుగా ప్రకటించి, సవరించిన అంచనాల్లో రూ. 49,64,842 కోట్లకు తగ్గించి మోసగించారనీ, ఈ ఏడాది మళ్లీ రూ. 53,47,315 కోట్లు అని ప్రకటించారని తెలిపారు. గతంతో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు చూపించి, సవరించిన అంచనాలతో పోలిస్తే వాస్తవానికి 2 శాతం తగ్గించి మాయ చేశారని వివరించారు.

గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు సవరించిన అంచనాల పేరుతో రూ.1,40,000 కోట్లకు పైగా కోతలు పెట్టారని వెంకట్‌ విమర్శించారు. విద్యకు రూ.1,28,650 కోట్ల నుంచి రూ.1,21,949 కోట్లకు, వైద్యానికి రూ.98,311 కోట్ల నుంచి రూ.94,651 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,58,838 కోట్ల నుంచి రూ.1,21,949 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి రూ.2,65,817 కోట్ల నుంచి రూ.2,12,750 కోట్లు, సోషల్‌ వెల్ఫేర్‌కు రూ.60,052 కోట్ల నుంచి రూ.50,000 కోట్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు రూ.96,777 కోట్ల నుంచి రూ.57,000 కోట్లు, హౌజింగ్‌ రూ.52,000 కోట్ల నుంచి రూ.34,000 కోట్లు, జల జీవన్‌ మిషన్‌ (గ్రామీణ మంచినీరు) రూ.67,000 కోట్ల నుంచి రూ.17,000 కోట్లు తగ్గించారని వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా అంగన్‌వాడీలకు రూ.4,000 కోట్లు, ఎస్సీ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌కు రూ.1,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.2,500 కోట్లు కోత విధించారని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు పాత బకాయిలు తీర్చేందుకే సరిపోతాయని వెంకట్‌ తెలిపారు. కొత్త పనుల కోసం కాదనీ, ఇది పేదల గొంతు కోయడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 పనిదినాలు కల్పిస్తామంటూ రూ.95 వేల కోట్లు కేటాయించారనీ, కనీసం రూ.3 లక్షల కోట్లు అవసరమని వెంకట్‌ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా కేంద్రం సొంత మైనింగ్‌ ప్రస్తావన చేయలేదనీ, . పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించలేదనీ, తెలంగాణ ప్రభుత్వం కోరిన స్టీల్‌ ఫ్యాక్టరీ, జాతీయ ప్రాజెక్టు ప్రస్తావనే లేదని తెలిపారు.

బడ్జెట్‌లో 28 శాతం మొత్తం అప్పుల చెల్లింపులకే వెచ్చిస్తూ బ్యాంకులకు, పెట్టుబడిదారులకు సేవకుడిగా మోడీ సర్కార్‌ మారిందని వెంకట్‌ విమర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధి పేరుతో రూ. 50 వేల కోట్లు చూపించి, సవరించిన అంచనాల్లో ఆ పనులన్నీ రద్దు చేశారని తెలిపారు. ప్రజా రంగ సంస్థలను నాశనం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. సంక్షేమాన్ని కాదనీ, కార్పొరేట్‌ శ్రేయస్సు కోసం బడ్జెట్‌ పెట్టినందుకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తగా నిరసనలతో పాటు, ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. మోసపూరిత ఆర్థిక విధానాలకు వ్యతి రకంగా ప్రజల పోరాటం మరింత ఉధృతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -