నవతెలంగాణ – భూపాలపల్లి
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువలు నిర్మాణానికి  భూసేకరణ, ఖచ్చితమైన నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో ఎంజాయ్‌మెంట్ సర్వేపై రెవెన్యూ, ఇరిగేషన్, మెగా అధికారు లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కెనాల్స్ నిర్మాణానికి మొత్తం ఎంత మంది రైతుల భూములు ప్రభావితం అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుంది అనే అంశాలపై ఖచ్చితమైన నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గతవారం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన సూచనల మేరకు, ఈ వారం నాటికి ఎంజాయ్‌మెంట్ సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…సర్వే వివరాల్లో ప్రభావిత గ్రామాలు, సర్వే నంబర్లు, రైతుల వారీగా భూమి వివరాలు, పంటల సాగుపై నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. రైతులకు న్యాయపరమైన పరిహారం అందించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎవరికి అన్యాయం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులతో చర్చలు జరిపి, భూసేకరణకు సంబంధించిన సమాచారం స్పష్టంగా వివరించాలని, నియమాలు మరియు పరిహార విధానాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. భూసేకరణ కారణంగా రెవెన్యూ రికార్డుల్లో వచ్చే మార్పులను ప్రతీ మండల స్థాయిలో సమన్వయంతో నమోదు చేయాలని కూడా సూచించారు.
కెనాల్ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా అత్యంత వేగంగా సాగేందుకు, సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏటిసి రమేష్, ఇరిగేషన్ ఇంజనీర్లు, మహదేవపూర్, కాటారం, మల్హర్, మహా ముత్తారం మండలాల తహసీల్దార్లు, మెగా కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 
                                    