Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉద్యమాలతోనే హక్కుల సాధన

ఉద్యమాలతోనే హక్కుల సాధన

- Advertisement -

వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల సంక్షేమమే తమ లక్ష్యం
వ్యకాసం జాతీయ నేతలు

కడప : వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల సంక్షేమమే తమ లక్ష్యమని, హక్కుల సాధనకు అండగా ఉంటామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) జాతీయ నేతలు చెప్పారు. కడపలో ఈ నెల ఎనిమిది నుంచి పది వరకు జరిగిన ఎఐఎడబ్ల్యుయు జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు 20 రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గత కౌన్సిల్లో రూపకల్పన చేసిన పోరాటాలపై సమీక్షించి, భవిష్యత్‌ ఉద్యమాలపై కార్యాచరణ రూపొందించారు. గ్రామీణ వ్యవసాయ కార్మికులు, పట్టణ నగర వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ పోరాట అనుభవ, ఫలితాలను మీడియాతో పంచుకున్నారు.

‘ఉపాధి’ వేతనం రూ.600 : లలితాబాలన్‌, కేరళ ఉమెన్‌ సబ్‌కమిటీ కన్వీనర్‌
మా రాష్ట్రంలో మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వేతనదారులకు రోజుకు రూ.600 అమలు చేస్తున్నాం. మరే రాష్ట్రంలో ఇంత ఇవ్వడం లేదు. ఈ విషయంలో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిచింది.1985లోనే వ్యవసాయ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును రాష్ట్రంలో అధికారికంగా ఏర్పాటు చేశాం. ఈ బోర్డు ద్వారా వ్యవసాయ కార్మిక సంఘం పిల్లలకు స్కాలర్‌షిప్పులు, వివాహ సమయంలో రూ.25వేలు, వయస్సు మళ్లిన కార్మికులకు పింఛన్లు అందిస్తున్నాం. కేరళలో 27.62 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 62 శాతం మహిళలే ఉన్నారు. మహిళలు ఎక్కువగా ఉండడంతో సంఘం తరపున కేరళ కన్వెన్షన్‌ ఏర్పాటు చేశాం. ఉమెన్స్‌ సబ్‌కమిటీ ఏర్పాటయ్యింది. కేంద్రం అమలు చేయాల్సిన భూ పంపిణీ, కనీస వేతనాల పెంపు, పింఛన్ల అమలు, రేషన్‌ పంపిణీ తదితర డిమాండ్లపై తిరువనంతపురంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించి విజయం సాధించాం. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేరళ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

అంబలి కేంద్రాలు నిర్వహించాం :సరితా శర్మ, మహారాష్ట్ర మహిళా సబ్‌కమిటీ కన్వీనర్‌
మహారాష్ట్రలో 2014లో తీవ్ర కరువు తాండవించినప్పుడు రాష్ట్ర సర్కారు కానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఆదుకోలేదు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ 2017 జూన్‌లో సమ్మెలోకి వెళ్లి మద్దతు ధర సాధించుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రూ.30 వేల కోట్ల రుణమాఫీ పథకాన్ని ప్రకటించారు. ఇది రైతులు, వ్యవసాయ కార్మికుల సంఘటిత విజయం. 2018లో కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ పేరుతో 70 వేల మందితో నాసిక్‌ నుంచి ముంబైకి 180 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు పూర్తి రుణమాఫీ, అటవీ హక్కు చట్టం అమలు, నష్టపరిహారం ప్రకటించాయి. వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 2018 ఆగస్టులో దాదాపు రెండు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. నాసిక్‌లో దాదాపు 800 మంది చిన్న రైతులు కలిసి స్థాపించిన ఈప్రొడ్యూసర్‌ కంపెనీ ద్రాక్షను ఎగుమతి చేసి రూ.800 కోట్ల ఆదాయాన్ని సమకూర్చడం పెద్ద విజయం.

భూమి కోసం ఉద్యమాలు :ముని వెంకటప్ప, కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షులు
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో ఉన్న భూములను పేదలకు పంచాలనే ఏకైక డిమాండ్‌తో భవిష్యత్‌ ఉద్యమాలు చేపట్టనున్నాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరంతరంగా ఉండకపోవడంతో మైక్రో ఫైనాన్స్‌ వలలో చిక్కుకున్న కార్మికులు దినసరి కూలీలుగా మారిపోతున్నారు. రేషన్‌లో బియ్యం తప్ప ఇతర ఏ వస్తువులూ ఇవ్వడం లేదు. కొప్పాలలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలివ్వాలని పోరాడి సాధించుకున్నాం.

‘చలో ఢిల్లీ’ పోరాటం మహత్తర ఘట్టం :బుపేంద్రసింగ్‌, జాతీయ ఉపాధ్యక్షులు, పంజాబ్‌
దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశాం. వేతనాల పెంపు, కనీస వేతనాల అమలు, భూమిలేని వ్యవసాయ కార్మికులకు గృహస్థలాలు, సాగుభూమి వంటి డిమాండ్లపై నిరంతర ఉద్యమాలు చేపట్టాం. 2020-21లో జరిగిన ‘చలో ఢిల్లీ’ ఉద్యమంలో ఎఐఎడబ్ల్యుయు ముందుండి వ్యవసాయ కార్మికుల గళాన్ని వినిపించింది. రుణమాఫీ, గ్రామీణ గృహ హక్కులు, భూ హక్కులు, ఎంఎస్‌పికు చట్టబద్ద హామీ, నరేగా పనిదినాల పెంపు, వేతనాల చెల్లింపుల కోసం 2023-24లో వేలాది మంది కార్మికులతో ఆందోళనలు నిర్వహించాం. కార్మికుల చెమట చుక్కకు గౌరవం దక్కే వరకూ, ఎంఎస్‌పికి చట్టబద్ద హామీ లభించే వరకూ మా పోరాటం కొనసాగుతోంది. సామాజిక అణచివేతకు వ్యతిరేకంగానూ 2016, 2018, 2020లో సంగ్రూర్‌, బర్నాలా, మలేర్‌కోట్‌లా జిల్లాల్లో ఉద్యమాలు చేశాం.

పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ అమలు :అమృతలింగం, తమిళనాడు రాష్ట్ర అఖిల భారత కౌలు కార్మికుల సంఘం
పట్టణ, నగర ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు చేయడం అనేది మా సంఘం పోరాట విజయం. ఈ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలయ్యేలా ఉద్యమాలను నిర్వహించాల్సి ఉంది. 2015లో పట్టాలేని ఇళ్లపై ప్రభుత్వం విధించిన హౌస్‌ట్యాక్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. ఈ పోరాటం ముఖ్యంగా చెన్నై, మధురై, తంజావూరు, కడలూరు వంటి జిల్లాల్లో కదలికలు సృష్టించింది. ఆందోళనల తీవ్రతతో చివరకు ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. కార్మికులకు జీవన భరోసాకు ప్రత్యేక నిరుద్యోగ పథకాలు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేకంగా మైక్రో ఫైనాన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలి. దీనిద్వారా కార్మికులకు తక్షణ ఆర్థిక సాయం, అప్పుల బారిన పడకుండా జీవనోపాధి కొనసాగుతుంది.

ఇండ్లస్థలాలకే ప్రాధాన్యత : నాగయ్య, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
పట్టణ వ్యవసాయ కార్మికులకు జానెడు ఇంటి స్థలం కోసం ఉద్యమాలు చేపట్టాం. 2022లో చేపట్టి భూ పోరాటం ఫలితంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరువేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 200 ఎకరాలు గిరిజనులకు దక్కాయి. తెలంగాణ వ్యాప్తంగా 11 లక్షల సభ్యత్వం ఉంది. రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటింటి సర్వే చేసి 31లక్షల మందికి ఇండ్లు లేవని తేల్చారు. డబుల్‌బెడ్‌ రూము ఇండఅళను నిర్మించి లక్ష మందికే ఇచ్చారు. ఇండ్లస్థలాల సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘంగా సర్వే నిర్వహించి సీలింగ్‌, భూదాన, అసైన్డ్‌, దేవాదాయ భూములు పది లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. 19 జిల్లాల్లోని పేదలకు వీటిని పంచాలన్న ప్రధాన డిమాండ్‌తో ఉద్యమాలు చేపట్టనున్నాం. జగిత్యాల జిల్లాలో 200 ఎకరాల్లో ఎర్రజెండా పాతి పేదలకు ఇంటి స్థలాలు దక్కేలా చేశాం. తెలంగాణాలో ఎక్కువమంది మహిళలే సంఘానికి నాయకత్వం వహించేలా ముందుకు వస్తున్నారు. ఇది శుభపరిణామం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad