ప్రజలతో మమేకం..వర్గపోరాటాలకు నాయకత్వం
ఆయన జీవితం అందరికీ ఆదర్శం
సంస్మరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ అసాధారణ కమ్యూనిస్టు అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ఆయన ఏడో తరగతి వరకే చదివినా పార్టీ పొలిట్‌బ్యూరో స్థాయికి ఎదిగారనీ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని అన్నారు. ప్రజలను చదవడంలో, వారి సమస్యను అర్థం చేసుకోవడంలో, పోరాటాలను నిర్మించడంలో కీలక భూమిక పోషించారని వివరించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విఎస్ అచ్యుతానందన్ సంస్మరణ సభ సోమవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రాఘవులు సహా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ప్రజల పట్ల, ఉద్యమం పట్ల అంకుఠిత దీక్షతో పనిచేశారని చెప్పారు. కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆశయం పట్ల ఆయన జీవితాంతం నిరాశకు గురికాలేదన్నారు. పోరాటం ఆయన జీవితంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు.
ప్రజల్లో మమేకమై పనిచేశారనీ, వర్గ పోరాటాలకు నాయకత్వం వహించారనీ, అందుకే ఆయన మరణించినపుడు అన్ని వర్గాల వారూ నివాళులర్పించేందుకు వచ్చారని గుర్తు చేశారు. కుట్టనాడులో వ్యవసాయ కార్మికులను ఐక్యం చేయడంలో విశేష కృషి చేశారని చెప్పారు. ఆయన సీఎంగా ఉన్నపుడు అధికార వికేంద్రీకరణను ప్రణాళికా బద్ధంగా చేపట్టారని అన్నారు. గ్రామాలను స్వతంత్ర ప్రభుత్వాలుగా మార్చారని వివరించారు. ఇది దేశానికే ఆదర్శమని చెప్పారు. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను అన్ని పాఠశాలల్లో అమలు చేశారన్నారు. కంప్యూటర్ విజ్ఞానాన్ని ప్రజలంతా వినియోగించుకుంటున్నారని వివరించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పోరాటమే చేశారని అన్నారు. డ్రగ్స్ మాఫియా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ప్రజల కష్టాలను తొందరగా పసిగట్టి అక్కడికి వెళ్లేవారని చెప్పారు. ఏ నిర్ణయమైనా కష్టజీవులకు ఉపయోగమా?, దోపిడీదారులకు ఉపయోగమా?అనే కోణంలో ఆలోచించే వారని అన్నారు.
మార్క్సిస్టు దృక్పథంతో ఆలోచించే వారనీ, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని వివరించారు. ఇప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. దేశంలో హిందూత్వ రాజ్య స్థాపన కోసం బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాలన సాగిస్తున్నదని విమర్శించారు. ప్రతికూల పరిస్థితులున్నా నిరుత్సాహపడొద్దని కోరారు. అమెరికా అల్లకల్లోలం అవుతుందనే ట్రంప్ బాధపడుతున్నారనీ, అందుకే వివిధ దేశాలపై సుంకాలు విధిస్తున్నారని విమర్శించారు. నిరాశ వాతావరణాన్ని అధిగమించాలనీ, అచ్యుతానందన్ స్ఫూర్తితో పోరాడాలని కోరారు.అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ కేరళలో ఎంతో ప్రజాభిమానం చూరగొన్నారని చెప్పారు. ఆయన జీవితం పోరాట వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. ప్రజల కోసమే పనిచేశారనీ, అందుకే వారి హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. ఆ ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతానందన్ అసాధారణ కమ్యూనిస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES