వందేండ్లు వచ్చినా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ
ఆయన అనుభవాలను రికార్డు చేయాలి : అచ్యుతరామయ్య వందో పుట్టిన రోజు వేడుకల్లో బీవీ.రాఘవులు
ఎన్టీఆర్ మంచి స్నేహితుడు.. ఒత్తిడి చేసినా టీడీపీలోకి వెళ్లలేదు : అచ్యుతరామయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అచ్యుతరామయ్య జీవితం ఆదర్శనీయమనీ, వందేండ్లు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం ఇంకా కట్టుబడి ఉన్న అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు కొనియాడారు. వందేండ్ల వయస్సులో రోజువారీ రాజకీయ అంశాలను తెలుసుకోవాలనే జిజ్ఞాన ఆయనలో ఎక్కువ అని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుటుంబసభ్యులు, సీపీఐ(ఎం) నేతలమధ్య అచ్యుతరామయ్య వందో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత రామయ్యతో కేక్ కట్ చేయించారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. నిరంతరం పనిచేయడం వల్ల ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుందని తెలిపారు. అచ్యుత రామయ్యకు పనిమీద ధ్యాస ఎక్కువనీ, అప్పగించిన బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదని గుర్తుచేశారు.
భారతదేశంలో తొలి కమ్యూనిస్టు సమావేశం జరిగిందనీ, అదే ఏడాది అచ్యుత రామయ్య పుట్టారని తెలిపారు. యుక్తవయస్సులో స్వాతంత్య్రపోరాటంలో కమ్యూనిస్టుగా పాల్గొన్నారనీ, ఆ తర్వాత తిరువూరు కేంద్రంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ పాలుపంచుకున్నారనీ, ఆ తర్వాత ఆంధ్రా, తెలంగాణ ఉద్యమాలను దగ్గర నుంచి చూశారని వివరించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఒత్తిళ్లు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న గొప్పవ్యక్తి అన్నారు. కేరళ, తమిళనాడు, తదితర రాష్ట్రాలతో పోలిస్తే ఉద్యమ సాహిత్యాన్ని సంగ్రహించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయనీ, అందుకే ఉద్యమ చరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని తెలిపారు. ప్రతి ఒక్కరి ఉద్యమ అనుభవాలను పుస్తరరూపంలో లిఖిస్తేనే భవిష్యత్ తరాలకు చరిత్ర అందుతుందని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదు రైనా నమ్మిన సిద్ధాంతం పట్ల అచ్యుతరామయ్య విశ్వాసం కలిగి ఉండటం చిన్న విషయం కాదని చెప్పారు. వందేండ్ల వయస్సులో పార్టీ అభివృద్ధి కోసం తపన పడే ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఆయన రోజూ పత్రికల వార్తలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారనీ, అందులో సీపీఐ(ఎం) వైఖరిని పరిశీలిస్తారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ ఆడిటింగ్ కమిటీ సభ్యులుగా అందించిన సేవలను గుర్తుచేశారు. రామారావు హత్య కేసు విషయం లో ఒకటెండ్రు సార్లు తనను అడిగారని గుర్తు చేశారు. అచ్యుతరామయ్య జీవితాన్ని లిఖిస్తే వచ్చే తరానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.
సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. రైతు సంఘంలో అచ్యుతరామయ్యతో కలిసి పనిచేసిన కాలాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన్ను కలిసిన ప్రతిసారీ ఉత్తేజం వచ్చేదన్నారు. అంకితభావం, కష్టపడే తత్వాన్ని నేటి యువనాయకులు ఆయన నుంచి నేర్చుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం బలంగా పుంజుకునే రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషలిస్టు వ్యవస్థ పట్ల యువతలో ఆసక్తి పెరుగుతున్నదని చెప్పారు. నేటి యువ నాయ కులు అచ్యుతరామయ్యను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అధ్యక్షత వహిం చిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ..అచ్యుత రామయ్య తన ఇంటికి ఒక్కరోజు నవతెలంగాణ, ప్రజాశక్తి పేపర్లు రాకపోయినా ఫోన్ చేసి మరీ అడుగుతారని గుర్తుచేశారు.
అచ్యుతరామయ్య మాట్లాడుతూ… 1945 నుంచి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నాననీ, వ్యవసాయం, పిల్లలు, పార్టీ తప్ప తనకు వేరే ఆలోచన ఉండేదికాదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు మంచి స్నేహితుడనీ, టీడీపీలోకి రావాలని ఆయన ఎంత ఒత్తిడి చేసినా సీపీఐ(ఎం)ని వీడలేదని చెప్పారు. పార్టీలో చేరడం వల్లనే ఎలాంటి చెడు అలవాట్లు అబ్బలేదనీ, దాని ఫలితంగానే ఇంత కాలం బతికి ఉన్నానని తెలిపారు. అచ్యుతరామయ్య మనువడు విశ్వనాథ్ సాయి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, టి.సాగర్, పి.ప్రభాకర్, పాలడుగు భాస్కర్, ఎమ్‌డీ అబ్బాస్, కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డీజీ.నర్సింహారావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, అచ్యుతరామయ్య కుమార్తెలు వనజ, శారద, ఉమ, అల్లుళ్లు చంద్రశేఖర్, హరి, మనువరాలు సౌమ్య, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.



