లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే కోసం 600 రోవర్లు
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
అగ్ని ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ : రెవెన్యూ, విపత్తు నిర్వహణల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధరణిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన లోపాలపై చర్యలు తీసుకుంటామని, నాటి రెవెన్యూ వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలను దాచి శునకానందం పొందేలా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని రెవెన్యూ, గహ నిర్మాణ, సమాచార, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. భూభారతి వచ్చాక వేలకోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ ఆరోపణలపై నిపుణుల కమిటీతో విచారణ చేయించామన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో రూ.3.9 కోట్ల అవకతవకలు జరిగినట్టు గుర్తించి సంబంధిత మీసేవ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. శిక్షణ పూర్తయిన లైసెస్స్డ్ సర్వేయర్లకు మంత్రి పొంగులేటి ఖమ్మం ఐడీఓసీలో ఆదివారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. హైదరాబాద్‌లోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలు ఒక్కంటికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్లతో సహా కచ్చితంగా వచ్చేలా ‘రోవర్స్’ సాంకేతికతను వాడుతున్నామన్నారు. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించామని అన్నారు. ధరణిలో ఆవకతవకలపై కేరళకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ చేత ఫోరెన్సిక్‌తో విచారణ చేపట్టినట్టు చెప్పారు. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత పాలకుల హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో నాశనం చేశారని, ప్రజా ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ లను మరొకసారి గ్రామ పరిపాలన అధికారులుగా రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకొని వచ్చామని, వీరికి సపోర్ట్ గా లైసెన్స్ సర్వేయర్ లను నియమించామని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. రికార్డు సమయంలో భూ భారతి చట్టం నియమాలు కూడా రూపొందించారని, సెక్షన్ 9 ప్రకారం సర్వే సమస్యల పరిష్కారం కోసం భూదార్ జారీ చేయడం, మ్యాప్ రూపకల్పన పొందుపర్చారని, దీని కోసం మండల సర్వేయర్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్‌లు పని చేస్తారని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం 21 మండలాల సర్వేయర్లకు ల్యాప్ టాప్‌లు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ మంత్రిని కోరటంతో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, కల్లూరు సబ్ కలెక్టర్ అజరు యాదవ్, డీఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, ఆర్టీఐ మెంబర్ కోయిన వెంకన్న, వీవీ పాలెం సర్పంచ్ కాపా ఆదినారాయణ, తహసీల్దార్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ధరణి లోపాలపై చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



