– కామారెడ్డిలో వడ్డీ లేని రుణాల పంపిణీ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని 582 స్వయం సహాయక సంఘాలకు రూ.1.91 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి వెన్నెముక మహిళేనని, వారి ఆర్థిక బలోపేతంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు. వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని తెలిపారు.
ఈ నిధులను వ్యాపారాలు, పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడిగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలను సకాలంలో చెల్లిస్తే మరిన్ని నిధులు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



