Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోర్టర్‌ మేనేజేమెంట్‌పై చర్యలు తీసుకోవాలి

పోర్టర్‌ మేనేజేమెంట్‌పై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఎంవీ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ యాక్ట్‌-25 నిబంధనలను తుంగలో తొక్కిన సంస్థ
డ్రైవర్‌ పార్ట్‌నర్స్‌ సమస్యలు పరిష్కరించకుంటే 6 నుంచి సమ్మె
ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఆఫీస్‌ వద్ద ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ) ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో

మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ యాక్ట్‌-2025 నిబంధనలను పక్కనపెట్టి, డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్న ఆన్‌లైన్‌ బిజినెస్‌ యాప్‌ ‘పోర్టర్‌’ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ) స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.అజయ్ బాబు డిమాండ్‌ చేశారు. పోర్టర్‌లో పనిచేస్తున్న 30 వేల మంది డ్రైవర్‌ పార్టనర్స్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ‘చలో ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌’ పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోర్టర్‌ కమిటీ జనరల్‌ సెక్రెటరీ మహమ్మద్‌ సాజిద్‌ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా అజయ్ బాబు మాట్లాడుతూ.. డ్రైవర్‌ పార్టనర్ల పేరుతో యాజమాన్యం 12 నుంచి 19 శాతం వరకు భారీగా కమీషన్‌ వసూలు చేస్తూ దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్రైవర్లను సస్పెండ్‌ చేయడం, తిరిగి విధుల్లోకి చేర్చుకోవడానికి డబ్బులు వసూలు చేయడం దారుణమని అన్నారు. యాక్సిడెంట్‌ అయినప్పుడుగానీ, కస్టమర్లతో సమస్యలు వచ్చినప్పుడుగానీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించడం లేదని విమర్శించారు. అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాల్సి ఉన్నా, యాజమాన్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నా.. కనీసం చార్జీలు పెంచకపోగా, యాప్‌ నిర్వహణ పేరుతో రేట్లు తగ్గించి డ్రైవర్ల పొట్టకొడుతున్నారని తెలిపారు. యాజమాన్యం లాభాలను భారీగా పెంచుకుంటూ, డ్రైవర్లను కూలీలుగా చూస్తోందన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు..
తమ 16 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఇప్పటికే యాజమాన్యానికి అందజేశామని, వచ్చేనెల 5వ తేదీలోపు సమస్యలను పరిష్కరించకుంటే.. 6వ తేదీ నుంచి 30 వేల మంది డ్రైవర్‌ పార్టనర్లు రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతారని అజరు బాబు స్పష్టం చేశారు. పోర్టర్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.ఉమేష్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ బి.మహేష్‌ మాట్లాడుతూ.. నిబంధనలను పాటించని యాజమాన్యంపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు విష్ణు, నరేష్‌, హరిదాసు, తుకారం, దేవా, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -