-ఫేజ్ – 2 కు దరఖాస్తుల ఆహ్వానం
నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలులో ఉన్న 2025 – 26 సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ (SCAP) ఫేజ్ – I దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా మార్చి 24 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 2, 2026 వరకు పొడిగించారు. ఫేజ్ – IIలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఇందులో ఎంపికయ్యే అభ్యర్థులకు యాక్షన్ ప్లాన్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ఈవీ ఆటోలు, ఈవీ కార్లు, సోలార్ యూనిట్లు, పశుసంవర్ధక యూనిట్లు, మైనర్ ఇరిగేషన్, షాపుల స్థాపన వంటి వివిధ రంగాల్లో సహాయం అందించనున్నారు.
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా ఓబి ఎంఎంఎస్ ( OBMMS ) పోర్టల్‌లో సమర్పించాలని ఆయన సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్ (సంబంధిత పథకాలకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఫేజ్ – I, ఫేజ్ – II లకు దరఖాస్తుల తుది గడువు ఏప్రిల్ 2గా నిర్ణయించినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.



