Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంసహాయ, పునరావాస చర్యల్లో చురుకుగా పాల్గొనండి

సహాయ, పునరావాస చర్యల్లో చురుకుగా పాల్గొనండి

- Advertisement -

పార్టీ శాఖలకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి
కోల్‌కతా వరదల్లో మృతి చెందినవారికి సంతాపం

న్యూఢిల్లీ : కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న కోల్‌కతాలో బాధిత ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు అందించడంలో చురుకుగా పాల్గొనాల్సిందిగా రెడ్‌ వలంటీర్లకు సీపీఐ(ఎం) పిలుపిచ్చింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతా నగరంలో కురిసిన భారీ వర్షాల ఫలితంగా విద్యుద్ఘాతంతో, ఇతర ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు సిపిఎం తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేసింది. కోల్‌కతా నగర వ్యాప్తంగా తీవ్ర విధ్వంసాన్ని, నష్టాన్ని కలిగించిన ఈ వరదలు కేవలం కుండపోత వర్షాల వల్లనే సంభవించినవి కావని, తృణమూల్‌ ప్రభుత్వం ప్రజల కన్నా లాభాలకే ప్రాధాన్యతనిచ్చి, ప్రభుత్వ మౌలిక సదుపాయాలన్నింటినీ ఉద్దేశ్యపూర్వకంగా తుడిచిపెడుతూ వచ్చిందని, ఒక పద్ధతి ప్రకారం చోటు చేసుకున్న ఈ నిర్లక్ష్యం ఫలితంగానే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

మరింత అధ్వాన్నంగా మారుతున్న కోల్‌కతా వరద ముప్పును పరిష్కరించడంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాల నేరపూరిత వైఫల్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలు వేరేచోట వున్నాయి. ఒకపక్క కార్పొరేట్ల కోసం స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు, సుందరీకరణ కార్యక్రమాలకు కోట్లాది రూపాయిలు ఖర్చు పెడుతున్నారు. మరోపక్క డ్రెయిన్లు పూడుకుపోయి, ప్రకృతిసిద్ధమైన జలాశయాలు నిండిపోయి, చిత్తడి నేలలు ధ్వంసమై, విపత్తు నిర్వహణా సన్నద్ధత అనేది కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ఈ వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారం చెల్లించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. అలాగే యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని కూడా కోరింది. తక్షణమే బాధిత ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో పాల్గొనాల్సిందిగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని శాఖలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. ఇటువంటి కష్టకాలంలో చురుకుగా సేవలందించే రెడ్‌ వలంటీర్లు కూడా పాల్గొనాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -