నవతెలంగాణ-హైదరాబాద్: సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఎదుర్కొంటున్న కష్టాలపై నటుడు అల్లు అర్జున్ స్పందించారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు శాశ్వత భరోసా కల్పిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. పావలా శ్యామల, ఆమె కుమార్తె వైద్య ఖర్చులు, నిత్యవసరాల కోసం ప్రతి నెలా రూ. 10,000 అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గతంలో చిరంజీవి వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే, అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకేసి, తాత్కాలిక సాయం కాకుండా ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బు అందేలా బాధ్యత తీసుకోవడం విశేషం. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడంలో బన్నీ చూపిస్తున్న ఈ చొరవ పట్ల సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వందలాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సరైన ఆదరణ లేక, ఆర్థికంగా చితికిపోయి తన కుమార్తెతో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తల్లీకూతుళ్లిద్దరి ఆరోగ్యం క్షీణించి, కనీసం మందులు కొనుక్కోలేని దీనస్థితిలో ఉన్నారని తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే చలించిపోయారు. వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.



