– ముసురు నేపధ్యంలో
– సాగులో రైతులు చేపట్టాల్సిన చర్యలు
– వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
– వ్యవసాయ సంచాలకులు పెంట్యాల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత కొన్ని రోజులు గా కురుస్తున్న ముసురు వానలతో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల్లో సస్యరక్షణ చర్యలను, వాతావరణ ఆధారిత సలహాలను వ్యవసాయ శాఖ అశ్వారావుపేట డివిజన్ సహాయ సంచాలకులు పెంట్యాల రవికుమార్ రైతులకు ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు. పొలం నుండి మురుగు నీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగు నీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. నీటి ముంపుకు గురైన వర్షాధార పంటలలో వర్షాలు ఆగిన తరువాత వీలైనంత త్వరగా అంతర కృషి చేసుకోవాలి.
ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్థంబాలు,విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలు కు దూరంగా ఉండవలెను.అదే విధంగా రైతులు చెట్ల క్రింద నిలబడ రాదు మరియు పశువులు,గొర్రెలు,మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.
వరి : ప్రస్తుతం వరి పంట నారుమడి నుండి దుబ్బు చేసే దశలో ఉన్నది.నీటి ముంపుకు గురి అయిన నారు మడులు మరియు వరి పొలాల నుండి మురుగు నీటిని వెంటనే తీసివేయాలి. వర్షాలు తగ్గిన తరువాత,ఇప్పటివరకు నారు వేసుకొని రైతాంగం ఇప్పుడు కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో సిఫార్సు చేసిన నేడు కలుపు యాజమాన్య పద్ధతులు ఉపయోగించుకొని స్వల్పకాలిక (120 – 125 రోజుల) వరి రకాలను విత్తు కోవటానికి అనుకూలం.
నీటి ముంపుకు గురైన వరి పొలాలలో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించుటకు అనుకూలం.ఈ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్ల కు తగినంత గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసివేయాలి.అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకూ ఆర గట్టి మళ్లీ నీరివ్వాలి.
నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్ల కు కాలి బాటను తీయటం వలన గాలి వెలుతురూ బాగా ప్రసరించడం తో బాటు అదేవిధంగా రైతులు ఎరువులు,పురుగు మందులు పంటకు సుడి దోమ ఉదృతిని నివారించవచ్చు.అందించడానికి సులువుగా ఉంటుంది. కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు ఆశించకుండా వరి పొలం గట్లను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రత్తి: ప్రస్తుతం పంట మొలక దశ నుండి కాయ అభివృద్ధి దశలో ఉన్నది.పొలం నుండి మురుగు నీటిని త్వరగా తీసివేసి వీలైనంత త్వరగా అంతర కృషి చేసుకోవాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన ప్రత్తి లో వడలు తెగులు ఆశించుటకు అనుకూలం. వర్షాలు ఆగిన తరువాత వడలు తెగులు సోకిన మొక్కల మొదళ్ళు తడి చేలా 3 గ్రా. కాపర్ ఆక్సీ – క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి.అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువు లైన మల్టీ కే (13:0:45) లేదా 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పోషకాలను పంటపై పిచికారి చేయాలి.
మొక్క జొన్న : ప్రస్తుతం పంట మొలక దశ నుండి కంకి ఏర్పడే దశలో ఉన్నది.మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి లేనట్లయితే మొక్కలు పసుపు వర్ణంలోకి మారుతాయి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కల న్నీ ఉదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రా. 19-19-19 లేదా 20 గ్రా డీఏపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
కంది: ప్రస్తుతం పంట మొలక దశ నుండి కొమ్మలు ఏర్పడే దశలో ఉన్నది.నీటి ముంపుకు గురైన పంటలో పైటావీర ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం.తెగులు గమనించిన చో, నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు మొక్క మొదళ్ళ చుట్టూ పోయాలి.