Thursday, September 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'అదానీ'మయం!

‘అదానీ’మయం!

- Advertisement -

నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు క్రమంలో దేశంలో కార్పొరేట్లు, బ్యురోక్రాట్లు, రాజకీయ నాయకుల మధ్య బంధం ఏర్పడింది. ఆ బంధం గత పదకొండేళ్ల నరేంద్ర మోడీ పాలనలో మరింతగా బలపడింది. అందుకే ఈ మూడు తరగతులకు చెందిన వారు ఒకరినొకరు సమర్ధించుకోవడం రివాజుగా మారింది. తాజా విషయానికొస్తే అదానీ గ్రూప్‌ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను కృత్రిమంగా మార్చడానికి విదేశీ బినామీ, షెల్‌ కంపెనీలను వాడుకుందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసి 2023లో 106 పేజీల నివేదికను ప్రచురించించన విషయం తెలిసిందే. అయితే గత వారం ఆ ఆరోపణల్లో కొన్నింటిని సెబీ తొసిపుచ్చింది. దాని నిబంధనల ప్రకారం, అదానీ కంపెనీలు, సంబంధిత పార్టీల మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు. అందువల్ల, పెట్టుబడిదారులకు బహిర్గతం చేయవలసిన అవసరం లేదు, అవి మార్కెట్‌ మానిప్యులేషన్‌కు కారణమని పేర్కొంది. డబ్బులు దారి మళ్లించినట్లు లేదా నిధులను మళ్లించినట్లు లేదా పెట్టుబడిదారులు డబ్బును కోల్పోయినట్లు ఎటువంటి ఆరోపణలు లేవని సెబీ తెలిపింది. ఇదంతా చూస్తే అదానీతో సెబీ కుమ్మక్కయిందని అర్థమవుతోంది.

రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రకారం, సెబీ అదానీ సంస్థలపై రెండు అభియోగాలను తొలగించింది, కానీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుండి పబ్లిక్‌ ఫ్లోట్‌ ఉల్లంఘనల వరకు 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గత సంవత్సరం, షార్ట్‌-సెల్లర్‌ సెబీ మాజీ చీఫ్‌ మాధబి పూరి బుచ్‌ అదానీ గ్రూప్‌ ఉపయోగించే ఆఫ్‌షోర్‌ నిధులతో సంబంధాలు కలిగి ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మే నెలలో, భారతదేశ అవినీతి నిరోధక వాచ్‌డాగ్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల ఆధారంగా ఆమెపై మోపబడిన అన్ని అవినీతి ఆరోపణల నుంచి ఆమెను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో, హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకురాలు నేట్‌ ఆండర్సన్‌, కంపెనీని ప్రారంభించిన ఎనిమిదేండ్ల తర్వాత దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదికతో ప్రపంచం యావత్తూ గగ్గోలు పెట్టగా సెబీ ఆ కీలక ఆరోపణల్ని కొట్టి పారేయడం దారుణం. మన దేశంలోని అతి ముఖ్యమైన రెగ్యులేటరీ సంస్థ సైతం అదానీ తదితర కార్పొరేట్లకు అనుకూలంగా మారిందనడాని ఇది తాజా తార్కాణం. అదానీ గ్రూప్‌ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను కృత్రిమంగా మార్చడానికి విదేశీ బినామీ, షెల్‌ కంపెనీలను వాడుకుందని, అదానీ తీవ్ర ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. అయినా అవేవీ సెబీ విచారణలో అక్కరకు రాలేదు. లేదా వాటిని చూడ నిరాకరించినట్టుంది. ఏలినవారి మద్దతుగల శత కోటీశ్వరుడు తప్పు చేశారనీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారనీ సెబీ చెప్పగలదా? ముమ్మాటికీ అలాంటిది అసంభవమని గత పదేళ్ల చరిత్ర చెబుతోంది.

అప్పటి సెబీ చైర్‌పర్సన్‌ మాధాబి పురీ బుచ్‌కు అదానీ గ్రూపు సంస్థలతో ఉన్న అక్రమ ఆర్థిక సంబంధాన్ని సైతం హిండెన్‌బర్గ్‌ బయటపెట్టిన విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు నిరాధారం అంటూనే బెర్ముడా, మారిషస్‌ వంటి అఫ్‌ షోర్‌ కంపెనీల్లో, అందునా గౌతం అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు బుచ్‌ ఫ్యామిలీ అంగీకరించిన విషయం లోకానికెరుకే! తన భర్త బాల్య స్నేహితుడు నిర్వహిస్తున్న ఫండ్‌లోనూ పెట్టుబడులు పెట్టారని మాధాబి అప్పట్లో ధృవీకరించారు. ‘అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ చైర్‌పర్సన్‌కు వాటిల్లో వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయి. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుంది.’ అని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. అదానీ కంపెనీలతో సెబీ మాజీ చైర్‌పర్సన్‌ మాధాబి చరిత్ర ఇదే. దేశంలో కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక వ్యవహారాలను నియంత్రించవలసిన సంస్థకు అధినేతలుగా అటువంటి వ్యక్తులను నియమించడంలోనే అసలు తిరకాసు ఉంది.

గతంలో అదానీ సెకీ కుంభకోణం గురించి ఒకసారి గుర్తు తెచ్చుకున్నా ఈ విషయం అర్థం అవుతుంది. అదానీ గ్రూపు కార్పొరేట్లు, సెకీ, రాష్ట్ర విద్యుత్‌ రంగ ఉన్నతాధికారులు అప్పటి ప్రభుత్వాధినేతతో జరిపిన మంతనాలు, వేల కోట్ల రూపాయలు చేతులు మారడం, ఇవన్నీ ఒక్కసారి సినిమా రీల్‌ మాదిరి తిరుగుతాయి. ఏపీలో వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అవినీతిపట్ల ప్రస్తుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమీ చెయ్యకుండా ఎందుకు మిన్నకుండిపోయారు? రోజూ బద్ధ శత్రువుల్లా వ్యవహరించే వీరిద్దరికీ మిత్రుడు మోడీ తన అనుంగు మిత్రుడైన గౌతం అదానీని కాపాడారని లోకానికి తెలియనిది కాదు. కాబట్టి ప్రజల సొమ్మును, దేశ సంపదను కొల్లగొడుతున్న ఈ అపవిత్ర కూటమి మోసాన్ని జనం అర్థం చేసుకోవాలి.

ఎం.సురేష్‌బాబు,
9989988912

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -