నవతెలంగాణ-తూప్రాన్
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ముందున్న లేబర్ అడ్డా వద్ద ఎండ తీవ్రతతో అలసిపోయి, వడదెబ్బ తగలడంతో కూలీ దుర్గం బాలయ్య (49) మృతి చెందాడు. మాసాయిపేట మండలం పోతాన్ పల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య లేబర్ అడ్డా కూలీగా పని చేసే వాడు. రోజులాగే శనివారం ఉదయం లేబర్ అడ్డాపై కూలీగా వెళ్లి రోజంతా ఎండలో సాయంత్రం వరకు పనిచేశాడు. ఎండ తీవ్రతతో అలసిపోయి, వడదెబ్బతో అడ్డా వద్దనే స్పృహతప్పి పడిపోయాడు. శనివారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో లేబర్ అడ్డాపై ఒక వ్యక్తి పడిపోయి ఉండటాన్ని గమనించారు. అనంతరం పోలీసులు అతని దగ్గరికి వెళ్లి చూడగా, వడదెబ్బతో చనిపోయినట్టు గుర్తించి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఈ విషయాన్ని పోలీసులు వాట్సాప్‌లో పెట్టడంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం బాలయ్య భార్య, కుమారులు మల్లేశ్, శేఖర్ వచ్చి దుర్గం బాలయ్యగా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివానందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వడదెబ్బతో అడ్డా కూలీ మృతి
- Advertisement -
- Advertisement -