మిగిలిన సోలార్ విద్యుత్తును వినియోగదారుడు అమ్ముకోవచ్చు
ఖమ్మం విద్యుత్ ఎస్ ఈ శ్రీనివాస చారి
నవతెలంగాణ – బోనకల్
సోలార్ విద్యుత్ పథకము వలన వినియోగదారులకు విద్యుత్ ఆదాతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని ఖమ్మం విద్యుత్ ఎస్ ఈ శ్రీనివాస్ ఆచారి తెలిపారు. మండల కేంద్రమైన బోనకల్ గ్రామంలో ఇళ్లకు ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు కనెక్షన్లను శ్రీనివాసచారి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహజ్యోతి లబ్ధిదారులకు సుమారు 1.40 లక్షల విలువైన సోలార్ ప్యానల్ ను ఉచితంగా పెడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద బోనకల్ మండలంలోని 22 గ్రామాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. బోనకల్లు లో ఈ నెల ఆఖరి వరకు అన్ని ఇళ్లకు కలెక్షన్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పథకము వలన లబ్ధిదారులకు విద్యుత్తు ఆదాతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలాన్ని పూర్తిగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే ఖమ్మం జిల్లాలో మిగిలిన నాలుగు నియోజకవర్గాలలోనే ఒక్కొక్క గ్రామాన్ని ఈ సోలార్ పథకం కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. బోనకల్లు మండలంలోని 22 గ్రామాలలో సోలార్ విద్యుత్ కనెక్షన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇంతకుముందు విద్యుత్ బొగ్గు ఉత్పత్తి ద్వారా మన జిల్లాలో ఎక్కువగా జరిగేదని దీనివలన కాలుష్యం పెరిగి అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. వాతావరణం కాలుష్యం కాకుండా సోలార్ విద్యుత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిలో ప్రవేశపెట్టిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి లబ్ధిదారునికి ఈ సోలార్ సిస్టం కనెక్షన్ ఇవ్వనన్నట్లు తెలిపారు.
ఈ సోలార్ సిస్టం వల్ల రెండు కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఒక్కో కిలో వాట్ నుంచి 120 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ విధంగా రెండు కిలో వాట్ల నుంచి నెలకు 240 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. వినియోగదారుడు నెలకు వినియోగించుకోగా ఒకవేళ విద్యుత్తు మిగిలితే ఆ విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వమే ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సోలార్ సిస్టం కోసం అదనంగా విద్యుత్తు లై, ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఆయన వెంట సోలార్ డివిజనల్ మేనేజర్ అజయ్ బాబు, మధిర డీఈ బండి శ్రీనివాసరావు బోనకల్ ఏఈ తోకల మనోహర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.



