నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీల మధ్య మాటల యుద్ధం కాస్తా చేతల వరకు వెళ్తోంది. సర్‌ను వ్యతిరికిస్తూ కలకత్తాలోని ఎన్నికల కార్యాలయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు భారీగా మోహరించారు. సర్ ప్రక్రియతో ఓట్ల చోరీ జరుగుతుందని, వెంటనే ఆ సర్వేను నిలిపివేయాలని నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులు కూడా ప్రతినినాదాలు చేయడంతో ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీస్ బలగాలు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోసారి ఈ తరహా సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఉన్నతాధికారులు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. ఎన్నికల కార్యాలయం ఎదుట అదనపు భద్రతను కల్పించారు.
కాగా, మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం మమతా బెనర్జీ లేఖ రాసిన విషయం తెలిసిందే. బీజేపీ ఓట్ల హాకింగ్‌కు పాల్పడుతుందని, ఢిల్లీ, హర్యానా, మాహారాష్ట్ర ఎన్నికల తరహాలో బెంగాల్లో బీజేపీ శ్రేణులు నకిలీ ఓట్ల నమోదుకు కుట్రలు పన్నుతున్నారని, ఈసీ వెంటనే ఆ చర్యలను అడ్డుకోవాలని లేఖలో డిమాండ్ చేసింది. ఈక్రమంలోనే ఒక్కసారిగా బెంగాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి.



