Saturday, January 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితీసివేతలకు కూడికలే జవాబులు

తీసివేతలకు కూడికలే జవాబులు

- Advertisement -

దేశం ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్య వాదులంతా ఆందోళనలో ఉన్నారు. నేరమే అధికారమైనది. ప్రశ్న దేశద్రోహమైంది. శాంతి దోషమయింది, హితువు విషమైంది. ఏకచక్ర సంతలో బేర సారాలు తప్ప మానవ సంబంధాల్లేవు. దేశం, ద్వేషం, గతం పేరుతో విషం చిమ్ముతున్నారు. సకల భావజాలరంగాలపై బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. బహుళ అస్తిత్వాలకు భిన్న ఆహారపు అలవాట్లకు, ఆహార్యాలకు, భిన్న భాషా సంస్కృతులకు, విశ్వాసాలకు చోటులేకుండా పోతున్నది. వైవిధ్యంతో ప్రజలు జీవించటాన్ని సహించని ఒక వాతావరణం తీవ్రమైంది. సాంస్క తిక ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతుది.
ఈ సమయంలో తొలిసారిగా డిసెంబర్‌ 20 నుండి 23 వరకు కేరళలోని కొచ్చిలో రాజేంద్ర మైదానంలో ఇండియన్‌ కల్చరల్‌ కాంగ్రెస్‌ (ఐసిసి) కేరళ ప్రభుత్వం, ఇతర సాంస్కతిక సంస్థల సహకారంతో నిర్వహించింది. దేశ సాంస్కతిక రంగ చరిత్రలో ఇంత పెద్దఎత్తున జాతీయ సాంస్కృతిక సమావేశాలు జరిగిందిలేదు. దీనికి కారణం, ముంచుకొస్తున్న ప్రమాద సూచికలే ఈ సమావేశం ఏర్పాటుకు దారితీసింది. ఏకత్వం అనే పెద్ద విపత్తు దేశం మెడ మీద కత్తిలా వేలాడుతున్నది. ఏకరాజ్య స్థిరీకరణ దిశగా అధికారం సాగుతున్నది. అడ్డెదురు లేకుండా అడ్డుగోడల్ని కడుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షం లేదు, అంతా రామపక్షమే.
ఇలాంటి కీలకమైన వాతావరణంలో ఈ మహాసభలు జరిగాయి. పెరుగుతున్న మతతత్వం అసహన వాతావరణాన్ని ఎదుర్కోవాలి. చెరిపేస్తున్న చరిత్ర గుండెలపై దూసుకొస్తున్న బుల్డోజర్లను నిలువరించాలి, ఇండియా ఏక్తా కాదు! బహుళ స్వరాల గుండెచప్పుడు, కులం, మతం, ప్రాంతం, భాష, జెండర్‌, వర్గం వంటి భేదాలు లేకుండా పౌరులందరూ సమానులేనని చాటిచెప్పాలి. గోడల్ని ఛేదించే బహుళ స్వరాలు, ప్రతిఘటన కళలు, ఒక ప్రత్యామ్నాయ వేదికలో కలయిక, మూడు రోజులు ఎనిమిది వేదికలపై జరిగాయి. సుమారు మూడువందల మంది వాలంటీర్లు వేలాదిమంది సాంస్కృతిక ప్రదర్శకులు, అనేక సంస్థలు, కళాకారులు, సాహితీ ప్రముఖులు, విశాలత్వంగల సజనకారులు ఒకచోట కలిసి సంభాషించుకోవడం, ఒక్కొక్క రాష్ట్రాల అనుభవాలు కలబోసు కోవడం, సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి కర్తవ్యాలను రూపొందించుకోవడంలో కార్యోన్ముఖుల్ని చేసింది. దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సాంస్కతికోద్యమాలకు సానుకూల పాఠాలు నేర్పింది. ప్రత్యామ్నాయ కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చింది. కేరళ ప్రత్యామ్నాయ సాంస్కతిక ప్రత్యేకతను చాటింది. ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లు సమావేశ స్థలం కేరళ కావడం వలన ఆటంక శక్తులకు అడ్రస్‌ లేని చోటు, కనుకనే భద్రత నిచ్చింది. ఒకే సమయంలో పలు రకాల వేదికలలో ‘చర్చాగోష్టు’లు, సాహిత్య సంభాషణలు, సంగీతం శాస్త్రీయం, నాటకాలు, వీధి నాటకాలు, సాంప్రదాయ నత్యాలు, జానపద కళలు, లింగ మార్పిడి కళాకారులు, మరుగుజ్జుల కళా ప్రదర్శనలు, అంధులు, వికలాంగులు, ముస్లిం మైనారిటీల సాంస్కృతిక కళారూపాలు, పాలిస్తీనా కళాకారులు, గాజా సంఘటనపై ఫొటో ఎగ్జిబిషన్‌ ఎటుచూసినా ఒక సాంస్కృతిక తిరణాలను తలపింపజేసింది.

గోడల్ని ఛేదించే ప్రత్యామ్నాయ కలాలు, గళాలు ఒకటై బహుళ స్వరాలు ఒక సమూహ సమానత్వ గానాన్ని వినిపించాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎర్నాకులంలోని రాజేంద్ర మైదానంలో మొదటి రోజు ఇండియన్‌ కల్చరల్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించి, ప్రసంగించారు. మతోన్మాదం, ఫాసిజం, కుల వివక్ష , ఆర్థిక అణచివేతల నుంచి ప్రజలను సాంస్కృతికంగా విముక్తి చేయడమే. ఈనాటి మహాసభల కర్తవ్యమని అన్నారు. కవులు, కళాకారులు, వ్యక్తులు, శక్తులు సంస్థలను కలుపుకుని సమిష్టి ఉమ్మడి వేదికల ద్వారా సహ జీవన సంస్కతిని, సౌభ్రాతత్వ భావనను పెంపొందించడానికి ప్రజాస్వామ్య వాదులందరూ కలిసి పని చేయాలి. నూతన సంస్కృతిని పాదుకొలుపుతూ ప్రకతిని నిరంతరం కాపాడుకోవాలి. ఇలాంటి కల్చరల్‌ సమావేశాల ద్వారా సమాజాన్ని మానవీయంగా మార్చుకునే సంసిద్ధతను పెంచాలి.

కేరళ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ అధ్యక్షత వహించారు. కేరళ న్యాయశాఖ మంత్రి రాజీవ్‌ పాల్గొన్నారు. ప్రముఖ హిందీ కవి అదూర్‌ గోపాలకష్ణ, ప్రముఖ కవి అశోక్‌ వాజపేయి, తెలుగు ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, ప్రముఖ కవి సచ్చిదానంద, జావేద్‌ అఖ్తర్‌, సిద్ధార్థ వరదరాజన్‌ కనుమొళి, సినీనటి రోహిణి, టి.ఎం కష్ణ, శాంతా ధనుంజరు, రత్న పాఠక్‌, జిఎన్‌ దేవి పాల్గొన్నారు. ఒక సెమినార్‌ సెషన్స్‌లో ‘ది వైర్‌’ ఎడిటర్‌ సీమచిస్తి మాట్లాడారు. ” కేరళలో నేను ఊపిరి పీల్చుకుంటున్నాను. ఢిల్లీలో ఉక్కపోత విషపూరిత గాలివీస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్నవారు రాజకీయాలు, సంస్కృతిని మీడియాను విషపూరితం చేస్తున్నారు. చారిత్రాత్మకంగా, సాంప్రదాయమైన గోడలుండగా వాటిని బలోపేతం చేసేపని, కొత్త గోడలు నిర్మించే పని ముమ్మరంగా చేస్తున్నారు. పాత గోడలను, కొత్త గోడలను కూల్చాల్సిన బాధ్యత కళాకారులపై ఉంది” ఉందని చెప్పారు. ”కేరళ, తమిళనాడు రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువుల్ని పీల్చగలుగుతున్నాము. దేశం నిషేధం విధించిన మంచి సినిమాలు, మంచి నాటకాలు ప్రదర్శించగలుగుతున్నాం. ఇలాంటి కల్చరల్‌ మహాసభలు దేశవ్యాప్తంగా చాలా అవసరమని” మద్రాసు సంగీత కారుడు టి.ఎం.కష్ణ అభిప్రాయపడ్డారు. ఇండియన్‌ కల్చరల్‌ కాంగ్రెస్‌ ముగింపు సభలో భారతీయ సినీ నటుడు మమ్ముట్టి పాల్గొన్నారు. ‘మనిషిని జైలులో పెట్టడం, రాజ్యాలకు సులువు కానీ ఆలోచనలను, సత్యాన్ని బంధించడం ఎవరికైనా అసాధ్యమని ,ద్వేషానికి ప్రేమతోనే జవాబులివ్వాలి’ అని పేర్కొన్నారు. ”కేరళలో నాటకరంగం చాలా గొప్ప పాత్రను పోషించింది. ‘నువ్వు నన్ను కమ్యూనిస్టుని చేశావు’ అనే ఒక నాటకం 1950లో రంగస్థలం సాధించిన ఒక గొప్ప విజయం. 1957లో కమ్యూనిస్టులను కేరళలో అధికారంలోకి తెచ్చేంతగా నాటకాలు ఉపయోగపడ్డాయి. ప్రజల్ని ఎంతగానో ఆలోచింపజేశాయి. అందుకు కళలు నాటకాలు ఒక తుఫాన్‌లా ప్రజల్ని కదిలించాయని” గుర్తుచేశారు.

ఈ మహాసభల్లో ప్రముఖుల ప్రసంగాలన్నీ కూడా కొత్త ఆలోచనలకు బీజం వేశాయి. కళారంగాల్లో, పనిచేసేవారు హేతుదష్టితో, సత్యశోధనకు, స్వతంత్ర పరిశోధనలకు పూనుకోవాలి. స్వేచ్ఛగా, నిక్కచ్చిగా రాయ టానికి, తినటానికి, బతకటానికి అవకాశం రోజురోజుకూ తగ్గిపోతున్న ఈ పరిస్థితులపై తలపడాలి. మూఢత్వానికి నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి. సాంస్కతిక పోరాటాలకు సిద్ధం చేయాలి. నాటకమెప్పుడు ఆగిపోదు, నడుస్తూనే ఉంటుంది. విశ్వాసాల కన్నా విజ్ఞానం విశాలమైనది. నిరంతరం తార్కిక అన్వేషణతోనే జ్ఞానాన్ని పెంచుకోవాలి. గత చరిత్రను విశ్లేషించుకోవాలి. భవిష్యత్తును మానవీయంగా ప్రజా స్వామికంగా నిర్మించుకోవాలి. అప్పుడే మన నాగరికత వికసిస్తుంది. ఇవన్నీ సాంస్కృతిక విశాల ఐక్యవేదికల ద్వారా మాత్రమే అధిగమించగలం. పౌర సమాజంలో సహజీవన సంస్కృతిని సౌభ్రాతత్వ భావనలను పెంపొందించే ప్రజాస్వామ్య వాదులు అందరితో కలిసి పనిచేయాలి. ఒక నూతన సంస్కృతిని పాదుకొల్పాలి. ప్రకతిని నిరంతరం కాపాడుకోవాలి. సమాజంలో ”తీసివేతలకు సాంస్కృతిక కూడికలే జవాబులు”. ఈ మహాసభలు సకల కళల్ని, సాహిత్యాన్ని, సాంస్కృతిక రంగాల్లోని ప్రముఖులను ఒకచోట చేర్చాయి. భారతదేశపు బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పాయి.

భూపతి వెంకటేశ్వర్లు
9490098343

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -