– జోగ రాంబాబు, వూకె కిషోర్ బాబు, కోండ్రు మంజు భార్గవి
– అంబరాన్ని తాకేలా ఆదివాసీల సంబురాలు
– ఘనంగా 32వ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ప్రతి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండి ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని ఏఈడబ్ల్యూసీఏ జిల్లా కార్యదర్శి జోగ రాంబాబు, అక్షర సమిధ వ్యవస్థాపకుడు వూకె కిషోర్ బాబు, మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. శనివారం మండల కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసీ 32వ దినోత్సవం పురస్కరించుకొని ఆదివాసుల సంబురాలు అంబరాన్ని తాకేలా జరిగాయి. దీనిలో భాగంగా బస్టాండ్ సెంటర్ లో మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే వేశాధారణలో నృత్య కళా బృందం చేత ప్రదర్శన, డప్పు వాయిద్యాలతో ఆదివాసీలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
తదనంతరం ఆదివాసీ కమ్యునిటీ హాల్ నిర్మాణ స్థలంలో కొమరం భీం చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఆదివాసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం స్థానిక ఏఈడబ్ల్యూసీఏ మండల అధ్యక్షుడు పాయం రమేష్ అధ్యక్షతన జరిగిన చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉన్నత చదువులు చదువుకొని ఆదివాసీ చట్టాలను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. ఎవరో వస్తారు..! ఏదో చేస్తారు..! అని ఎదురు చూడకుండా కొమరం భీం ప్రతిమలో ఉన్న ఆయుధాన్ని నేటి యువత తిరుగుబాటుకు ప్రతీకగా స్ఫూర్తి పొందాలన్నారు. నేటి సినీ రంగంలో కొందరు ఆదివాసీ మహనీయుల జీవితాలను ఆధారంగా సినిమాలు తీయడం గిరిజనులుగా గర్వపడాలన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు వూకె కిషోర్ బాబు – మంజు భార్గవి దంపతులు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేషంగా రాణిస్తున్న మండలంలోని పలువురు ఆదివాసులను బృందంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఈడబ్ల్యూసీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోడియం బాలరాజు, తెల్లం వెంకటేశ్వర్లు, కొర్స జేజే రాంబాబు, ఆళ్ళపల్లి మాజీ ప్రజా ప్రతినిధులు కొమరం హనుమంతరావు, పడిగ సమ్మయ్య, పెండెకట్ల పాపారావు, గొగ్గెల లక్ష్మి, గలిగ సమ్మక్క, పాయం నరసింహారావు, పూనెం లక్ష్మయ్య, ఈసం సాంబశివరావు, పెండెకట్ల సత్యం, కొమరం నరసింహారావు గొగ్గెల గాదెరాజు, వెంకట కృష్ణంరాజు, వినోద్, రమేష్, ఊకే ఈశ్వరి, రామనాధం, వివిధ గ్రామాల దొర, పటేల్ లు, మహిళలు, యువకులు, వివిధ శాఖల ఉద్యోగస్తులు, తదితరులు పాల్గొన్నారు.