టీజీపీఎస్సీ అప్పీళ్లపై జనవరి 22న హైకోర్టు తీర్పు
నవతెలంగాణ-హైదరాబాద్
గ్రూప్-1 పరీక్షలపై సెప్టెంబర్‌లో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్‌సీ, క్వాలిఫై అయిన అభ్యర్థులు (ఉద్యోగాల్లో చేరిన వాళ్లు) దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు 2026 జనవరి 22న తీర్పు చెప్పనుంది. అప్పటి వరకు గతంలో సింగిల్ జడ్జి ఆర్డర్‌పై విధించిన స్టే ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. ఉద్యోగాల్లో చేరిన వాళ్ల విషయం కూడా తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అప్పీళ్లపై మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరగలేదనీ, మార్కుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతోపాటు జవాబు పత్రాలను తిరిగి మూల్యాకనం చేయాలనీ, లేకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును కొనసాగించాలని అప్పీళ్లను డిస్మిస్ చేయాలని న్యాయవాదులు వాదించారు. ‘ఒక పరీక్షకు ఒకే హాల్‌టికెట్ ఉండాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు హాల్ టిక్కెట్లను టీజీపీఎస్‌సీ జారీ చేసింది. హాల్‌టికెట్ల నెంబర్లను కూడా మార్పు చేసింది. పరీక్షా కేంద్రాలనూ మార్చింది. నాలుగు పరీక్షా కేంద్రాల్లో అత్యధిక సంఖ్యలో అర్హత సాధించారు. కోఠి మహిళా కళాశాలలోని 18వ సెంటరులో 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది, అదే కళాశాలోని 19వ సెంటరులో 776 మంది పరీక్ష రాస్తే అందులో 32 మంది ఎంపికయ్యారు. మొత్తం 563 మందిలో సుమారు 12 శాతం మెయిన్స్‌కు అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య వేర్వేరుగా ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు జారీ ఎలా చేశారనే దానిపై టీజీపీఎస్‌సి వివరణ అస్పష్టంగా ఉంది. ఎంపిక చేసిన కొంత మంది అభ్యర్థులకు మేలు జరిగేలా చేసిందనే అనుమానాలకు బలమైన కారణాలున్నాయి. నాలుగు సెంటర్లలో ఏకంగా 162 మంది ఎంపికయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను టీజీపీఎస్‌సీ వెల్లడించిన లెక్కలు ఒకోసారి ఒకో విధంగా ఉన్నాయి. 2022 నోటిఫికేషన్‌ను ఏకపక్షంగా రద్దు చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మరో నోటిఫికేషన్ ఇచ్చింది. అదనంగా 563 పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదు. గవర్నమెంట్ కాలేజీలో చేసే వ్యక్తితో వాల్యుయేషన్ చేయించారు. తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు దారుణమైన అన్యాయం జరిగింది..’ అని వాదించారు. టీజీపీఎస్సీ తరపు ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. ‘రాజ్యాంగ సంస్థ టీజీపీఎస్‌సీ వ్యవహారంలో కోర్టుల జోక్యానికి ఆస్కారం తక్కువ. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై సింగిల్ జడ్జి చెప్పిన తీర్పు చట్ట వ్యతిరేకం. టీజీపీఎస్సీ నోటిషికేషన్ రూల్స్‌కు భిన్నంగా తిరిగి మూల్యాంకనం చేయాలన్న తీర్పు చెల్లదు. ఇద్దరు చేసే మూల్యాకంనంలో తేడా 15 శాతం కంటే ఎక్కువ వస్తే మూడోవ్యక్తి మూల్యాంకనం చేసే నిబంధనను పట్టించుకోలేదు. ఒకరు చేసిన మూల్యాంకనం గురించి మరొకరికి తెలియదు. పాలనా సౌలభ్యం కోసమే పరీక్షా కేంద్రాల పెంపు జరిగింది. కోఠి మహిళా కాలేజీలో 14.8 శాతం అభ్యర్థులు తొలి 500 మందిలో ఉన్నారనే వాదనకు ఆధారాలు చూపలేదు. బయోమెట్రిక్, జవాబు పత్రాలను స్కాన్ జరిగింది. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టిక్కెట్లను జారీ చేయవచ్చు. చేయకూదని చట్టంలో లేదు. సర్వీస్ కమిషన్ యాక్ట్‌లోని రూల్ 19(డి)కి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి తీర్పు ఉంది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మార్కులను తిరిగి లెక్కింపునకు మాత్రమే వీలుంది. పున్ణమూల్యాంకనానికి రూల్స్‌లో లేదు..’ అని వాదించారు.
తిరుమల ప్రసాదాలపై పిల్
తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదాలు, నైవేద్యాల్లో వినియోగించే నెయ్యి, ఇతర పదార్ధాలు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ యుగతులసీ ఫౌండేషన్ చైర్మెన్ కె.శివకుమార్ పిల్ దాఖలు చేశారు. పిల్‌కు నెంబర్ కేటాయింపునకు రిజిస్ట్రీ అభ్యంతరంపై వాదనలు పూర్తి చేసింది. ఉత్తర్వులను తర్వాత జారీ చేస్తామని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ ప్రకటించింది.
క్యాట్ ఉత్తర్వులు రద్దు
ఆలిండియా సర్వీస్ క్యాడర్ ఉద్యోగుల డిప్యూటేషన్‌పై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. గడువు ముగిసిన తర్వాత కొనసాగడానికి వీల్లేదని చెప్పింది. ఎక్కువ కాలం తెలంగాణలో పనిచేసిన తమిళనాడు క్యాడర్‌కు చెందిన డి.కల్పనానాయక్, మహేంద్రకుమార్ సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
గ్రూప్-1పై తీర్పు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



