– మంత్రి పొన్నం ప్రభాకర్
– కవాడిగూడ ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలు ప్రారంభం
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రజల సౌలభ్యం కోసమే పరిపాలన వికేంద్రీకరణతో ఒకే రకమైన వ్యవస్థను తీసుకొచ్చామని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని దోమలగూడ ప్రాంతంలో రూ.10.50 కోట్లతో నిర్మించిన కవాడిగూడ సర్కిల్-40, ముషీరాబాద్ సర్కిల్ – 41 కార్యాలయాలను బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను ఒకే రకమైన వ్యవస్థ కిందకు తీసుకొచ్చామని చెప్పారు. ప్రణాళికబద్ధ అభివృద్ధి కోసం ప్రజాపాలన వ్యవస్థలనూ ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి తీసుకొస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నామన్నారు. కాలుష్యంతో హైదరాబాద్‌కు ఢిల్లీ లాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్న ఒక కార్యాచరణతో ముందుకు పోతున్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువనాయకులు ముఠా జైసింహ, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రికి నిరసన సెగ
సర్కిల్ కార్యాలయాలు ప్రారంభించడానికి వచ్చిన మంత్రికి నిరసన సెగ తగిలింది. గ్రేటర్‌లో 150 డివిజన్‌లున్నప్పుడు దళితులకు 14 శాతం అనగా 23 డివిజన్‌లు కేటాయించారని, ఇప్పుడు పెంచిన 300 డివిజన్లకుగాను 14 శాతం చొప్పున 46 డివిజన్‌లు కేటాయించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాలో చితంగా గతంలో ఇచ్చినట్టే 23 డివిజన్లే కేటాయిం చడంతో దళితులకు తీరని అన్యాయం జరుగుతుం దన్నారు. ప్రతి 10 సంవత్సరాలకు కొత్త జనగణన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ప్రజల సౌలభ్యానికే పరిపాలన వికేంద్రీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



