ఈనెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అవకాశం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలో వేలకు వేల రూపాయల ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల మాధ్య మంలో విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలను నెలకొల్పింది. జిల్లాలో మల్హర్, కాటారం, మహముత్తారం, మొగుళ్లపల్లి, చిట్యాల, ఘణపురం మండలాలల్లో ఈ పాఠశాలలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో చదవాలను కునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరంలా మారాయి. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో మోడల్ స్కూళ్లకు ఆదరణ పెరిగింది. ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ప్రకటన వెలుబడింది.
ఆన్లైన్ దరఖాస్తులు ఇలా..
ఆదర్శ పాఠశాలలో ప్రవేశం కోసం వెబ్సైట్ ttps://telanganams.cgg.gov.in చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కాపీతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బోనఫైడ్ జిరాక్స్ పత్రాలు ఏ పాఠశాల ప్రవేశం కోసం నమోదు చేసుకున్నామో ఆ పాఠశాలలో అందజేయాలి.
ఈ నెల 28 వరకు గడువు
ఆన్లైన్ ద్వారా ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం జనరల్ కేటగిరీ విద్యార్థులకు రూ.200, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 19వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుంది.
ప్రవేశ పరీక్ష విధానం..
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. అన్నీ మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉండగా ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.ఆరో తరగ తిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ఐదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.తెలుగు,గణితం,సైన్స్,సోషల్,ఇంగ్లీష్ సబ్ఝేక్టుల నుంచి ఒక్కోదానికి 25 ప్రశ్నలు ఇస్తారు.
మోడల్ స్కూల్ ప్రత్యేకత..
ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా బోధన.ఆంగ్ల మాధ్యమంలో విద్య.పక్కా భవనంతో తరగతి గదులు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం. విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వమే పుస్తకాలను అందజేస్తుంది.8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాలకు ప్రతిభ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ. సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ తో పాటు లైబ్రరీ సదుపాయం.10వ తరగతి విద్యార్థులకు ఎన్టీఎస్ఎకు ప్రత్యేక శిక్షణ తరగతులు.
సీట్ల కేటాయింపు ఇలా..
జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 6వ తరగతిలో ఆరు వందల మంది విద్యార్థుల ప్రవేశం ఉంటుంది. దీంతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు మధ్యలో వివిధ కారణాలతో మానివే సిన ఖాళీ సీట్ల ప్రవేశం కోసం అవకాశం ఉంటుంది. ప్రవేశాలు రోస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీ విద్యార్థులకు 6 శాతం బీసీ విద్యార్థులకు బీసీ ఎ-7, బీసీ బీ-10, బీసీ సీ-1, బీసీ డీ-7, బీసీ ఈ-4 శాతం సీట్ల కేటాయిం పు ఉంటుంది. మిగితా 50 శాతం సీట్లను అలాగే ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. అన్నీ కేటగిరీలోనూ బాలికలకు 33 శాతం, దివ్యాంగు లకు 3 శాతం సీట్లు కేటాయించనున్నారు.
అడ్మిషన్లు జరుగుతున్నవి: పూర్ణచందర్ రావు ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
6 తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జనవరి 28 నుంచే ప్రారంభమైయ్యాయి.ఈ నెల 28 వరకు ఆన్లైన్లో కొనసాగుతాయి. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తాం.



