Wednesday, April 8, 2026
E-PAPER
Homeజాతీయంరుజువుగా టెన్త్‌ క్లాస్‌పాస్‌ సర్టిఫికెట్‌తో పాటూ అడ్మిట్‌ కార్డు

రుజువుగా టెన్త్‌ క్లాస్‌పాస్‌ సర్టిఫికెట్‌తో పాటూ అడ్మిట్‌ కార్డు

- Advertisement -

బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌పై సుప్రీం వివరణ
న్యూఢిల్లీ : టెంత్‌ క్లాస్‌ (మాధ్యమిక్‌) పాస్‌ సర్టిఫికెట్‌తో పాటూ అడ్మిట్‌ కార్డును కూడా జనన ధృవీకరణకు, అలాగే తల్లిదండ్రుల ధృవీకరణకు రుజువుగా అందచేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం వివరణ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) సందర్భంగా తలెత్తే క్లెయిమ్‌లు, అభ్యంతరాల వెరిఫికేషన్‌ సమయంలో ఓటర్లు వీటిని ప్రూఫ్‌లుగా సమర్పించవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 14కన్నా ముందుగా అందుకున్న ధృవీకరణ పత్రాలను, అలాగే ఇప్పటివరకు అప్‌లోడ్‌ చేయని వెరిఫికేషన్‌ డాక్యుమెంట్లను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5గంటల కల్లా ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలు) సమర్పించాలని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో మాధ్యమిక్‌ అడ్మిట్‌ కార్డులపై జనన, తల్లిదండ్రుల వివరాలు సమగ్రంగా వున్నాయని జస్టిస్‌ జోమాల్యా బాగ్చి పేర్కొన్నారు. మౌఖిక ప్రస్తావన సందర్భంగా ఎన్నికల కమిషన్‌ అడిగిన వివరణకు బాగ్చి పై రీతిన తెలిపారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జ్యుడీషియల్‌ అధికారులను నియమించాలంటూ ఈ నెల 20న సుప్రీం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇసి, మమతా ప్రభుత్వం మధ్య పదే పదే విశ్వాసం కొరవడుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రతిష్టంభనకు దారి తీస్తోందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓల క్వాసీ జ్యుడీషియల్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నిజాయితీ, సమగ్రత కలిగిన రిటైర్డ్‌, సర్వీసులో వున్న జ్యుడీషియల్‌ అధికారులను నియమించాలని కలకత్తా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను సుప్రీం కోరింది. వీరు లక్షలాది మంది ఓటర్ల అభ్యంతరాలను విచారించాల్సి వుంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు గానూ సహాయంగా జ్యుడీషియల్‌ అధికారులను త్వరగా నియమించాలంటూ ఈ నెల 24న మళ్ళీ సుప్రీం కోరింది. అవసరమైతే పొరుగున గల ఒరిస్సా, జార్ఖండ్‌ న్యాయమూర్తులను కూడా ఉపయోగించుకోవాలని సూచించింది. బెంగాల్‌లో ఓటర్ల జాబితాను ఈ నెల 28న ప్రచు రించేందుకు కోర్టు అనుమతించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు వేసేవరకు అనుబంధ జాబితాలు నిరంతరంగా ప్రచురించుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -