- అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు నిజాల్ని అబద్ధం చేస్తున్న టెస్టింగ్ మిషన్లు
- – అక్రమ వ్యాపారులకు అధికారుల వంత
- – ధరల లాజిక్ కూడా పట్టించుకోని అధికారులు
- – డబ్బు చుట్టూ తిరుగుతున్న కల్తీ వ్యాపారం
- నవతెలంగాణ – కామారెడ్డి
- జిల్లాలో కల్తీ నూనెల వ్యాపారం రోజురోజుకీ విస్తరిస్తుండగా, అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ముప్పుగా మారింది. సాధారణ లాజిక్‌కే విరుద్ధంగా ఉన్న ధరలు, ఉత్పత్తి విధానాలు కనిపిస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ గింజలు కిలోకు సుమారు రూ.100 దొరుకుతున్నాయి. అయితే అదే గింజల నుంచి తీసిన నూనె కిలో రూ.170కు విక్రయిస్తున్నారు. ఒక కిలో గింజల నుంచి అంత నూనె ఎలా వస్తుందన్న ప్రాథమిక ప్రశ్నకు సమాధానం లేకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పల్లీల ధర కిలోకు రూ.160 నుండి రూ.180 వరకు ఉండగా, పల్లీ నూనె మాత్రం రూ.150కే విక్రయించడం అనుమానాస్పదంగా మారింది.
- ఒక కిలో పల్లీల నుంచి కిలో నూనె రావడం సాధ్యం కాదని తెలిసినా, అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. స్థానికుల ఆరోపణల ప్రకారం, కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడుతూ అధికారులకు డబ్బులు ఇచ్చి లేదా బెదిరించి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది. దీనివల్ల కల్తీ వ్యాపారం మరింత విస్తరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ విషయంపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సంప్రదించగా, గత సంవత్సరం డిసెంబర్‌లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించకపోవడం, తాజా తనిఖీలు నిర్వహించకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. పట్టణవాసులు, జిల్లా వాసులు వెంటనే కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నూనెలో కల్తీ (adulteration) అనేది చాలా ప్రమాదకరమైన విషయం. మనం ప్రతిరోజూ వాడే వంటనూనెల్లో కల్తీ జరిగితే అది నెమ్మదిగా కానీ తీవ్రంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఎలా ప్రభావం చూపుతుందో స్పష్టంగా చూద్దాం:
1. గుండె సంబంధిత సమస్యలు
కల్తీ నూనెల్లో ఎక్కువగా హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ( ఎల్డిఎల్ ) పెంచుతాయి మంచి కొలెస్ట్రాల్ ( హెచ్డిఎల్ ) తగ్గిస్తాయి ఫలితంగా హార్ట్ అటాక్, బీపీ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందనీ నిపుణులు పేర్కొంటున్నారు.
2. కాలేయం (లివర్) దెబ్బతినడం
కల్తీ నూనెల్లో ఉండే రసాయనాలు లివర్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి, లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం డిటాక్సిఫికేషన్ సామర్థ్యం తగ్గిపోవడం దీర్ఘకాలంలో లివర్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది.
3. కడుపు , జీర్ణ సమస్యలు
ఇలాంటి నూనెలతో వండిన ఆహారం తింటే:
గ్యాస్, అజీర్ణం, విరేచనాలు లేదా మలబద్ధకం
కడుపు నొప్పి లాంటి వచ్చే అవకాశం ఉండి, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
4. క్యాన్సర్ ప్రమాదం
కొన్ని కల్తీ నూనెల్లో ఇండస్ట్రియల్ ఆయిల్స్ లేదా ప్రమాదకర రసాయనాలు కలిపే అవకాశం ఉంటుంది, ఇవి శరీరంలో చేరుతూ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
5. నాడీ వ్యవస్థపై ప్రభావం
చెడు నాణ్యత గల నూనెల్లోని టాక్సిన్లు,
మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి,
అలసట, తలనొప్పి, దృష్టి లోపం దీర్ఘకాలంలో నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
6. పిల్లలపై తీవ్రమైన ప్రభావం
పిల్లలు కల్తీ నూనెలతో తయారైన ఆహారం తీసుకుంటే
ఎదుగుదల మందగిస్తుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
7. చర్మం , అలర్జీలు
చర్మ సమస్యలు, దద్దుర్లు, అలర్జీలు శరీరంలో విషపదార్థాలు పెరగడం వల్ల ఇవి వస్తాయి. వినియోగదారులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, కల్తీ నూనె వల్ల వచ్చే సమస్యలు ఒక్కరోజులో కనిపించవు. అవి నెమ్మదిగా పెరుగుతూ ఒకరోజు పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారుతాయి.
జాగ్రత్తలు..
విశ్వసనీయ బ్రాండ్ల ( గానుగ పట్టిన నూనె ) నూనెలు మాత్రమే కొనాలి, అసాధారణంగా తక్కువ ధర ఉన్న నూనెలను దూరంగా ఉంచాలి, రంగు, వాసనలో తేడా ఉంటే వాడకూడదనీ పలువురు మేధావులు పేర్కొంటున్నారు.



