– 13 మందికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
– విచారణ చేపట్టిన అధికారులు
నవతెలంగాణ – కూకట్‌పల్లి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్లు తాగిన 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. కూకట్‌పల్లి పరిధిలోని హైదర్‌నగర్, ఎల్లమ్మబండ, గోకుల్ ప్లాట్స్ ప్రాంతాలకు చెందిన కొందరు మంగళవారం ఓ కల్లు దుకాణంలో కల్లు తాగారు. అనంతరం 13 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై బీపీ సమస్య ఏర్పడి స్థానిక రాందేవ్ ఆస్పత్రిలో చేరారు. వైద్య సిబ్బంది వారిని పరిశీలించి కల్లు తాగడం వల్లే ఇలా అయిందని గుర్తించి వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన వారందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్‌కి తరలించనున్నామని తెలిపారు. ఈ ఘటనపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం
- Advertisement -
- Advertisement -