నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు, వాస్క్యులర్ సర్జరీ విభాగంలో ఎమర్జెన్సీ భవనం, ట్రామా బ్లాక్‌లో డాక్టర్ల క్యాబిన్లు, నర్సింగ్ స్టేషన్‌తో పాటు ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాలను గురువారం నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప మాట్లాడుతూ ఈ ఆధునాతన పరికరాల ద్వారా రోగి జబ్బు నిర్ధారణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల రోగులకు మెరుగైన, సకాలంలో వైద్యం అందించగలుగుతున్నట్టు చెప్పారు. ఇందుకు సహకరించిన కోటివిటీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆధునాతన పరికరాలను కోటివిటీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేదర్మల్ జీ అగర్వాల్ జ్ఞాపకార్థం, ఆయన కుమారుడు పవన్ కుమార్ జీ అగర్వాల్, కుటుంబ సభ్యుల సహకారంతో విరాళంగా అందజేశారు. రూ.17 లక్షల విలువైన మాసిమో రూట్ బిఎఫ్‌ఎమ్ మానిటర్, సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్-పల్స్ వాల్యూమ్ రికార్డింగ్, నియర్-ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ పరికరాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేసి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులను కచ్చితంగా నిర్ధారించడంలో వైద్యులకు సహకరిస్తాయి. మాసిమో రూట్ బిఎఫ్‌ఎమ్ మానిటర్ అత్యాధునిక సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించి, ప్రతి సంవత్సరం దాదాపు 2,000 మంది రోగులకు చేసే రివాస్క్యులరైజేషన్ ప్రక్రియల ప్రభావాన్ని అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదే విధంగా ప్రతి సంవత్సరం 20,000 మందికిపైగా ఔట్ పేషెంట్స్ విభాగంలో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన సేవలందించడానికి తోడ్పడుతుంది.ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరిండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్, వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సందీప్ మహాపాత్ర, అదనపు మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, డాక్టర్ రాకేష్, డాక్టర్ చరణ్ పాల్గొన్నారు.
నిమ్స్ వాస్క్యులర్ విభాగంలో అధునాతన సౌకర్యాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES