Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంప్రకటనలే...ఒప్పందాలేవీ?

ప్రకటనలే…ఒప్పందాలేవీ?

- Advertisement -

ట్రంప్‌ సుంకాల డాంబికం
బెదరని అంతర్జాతీయ సమాజం
భారత్‌తో ఒప్పందానికి తహతహ
సంఘమిత్ర

‘లేస్తే మనిషిని కాదు’ అన్నాట్ట వెనుకటికొకడు…ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రెండోసారి అమెరికా అధ్యక్షపీఠంపై కూర్చోగానే సుంకాల పేరుతో ట్రేడ్‌వార్‌ ప్రకటించారు. ప్రపంచానికి తానే పెద్దన్నను అనే రీతిలో అంతర్జాతీయ సమాజాన్ని సుంకాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేశారు. తమ దేశంతో ఒప్పందాల కోసం ప్రపంచదేశాలు క్యూ కడుతున్నందున 90 రోజులు విరామం ప్రకటిస్తున్నానని చెప్పారు. ఆయన ప్రకటించిన గడువు ఈనెల 9తో ముగుస్తుంది. ఇప్పటి వరకు బ్రిటన్‌ తప్ప, ఏ ఒక్కదేశం కూడా అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. ట్రంప్‌ బెదిరింపుల్ని అంతర్జాతీయ సమాజం తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికాతో ఒప్పందాలకు పెద్దగా ఆసక్తి చూపలేదు. తాను విధించిన గడువు ముగిశాక ట్రంప్‌ ఏం చేస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఫక్తు వ్యాపారవేత్త అయిన ట్రంప్‌ సుంకాల విధింపునకు మళ్లీ మరికొన్ని నెలలు విరామం ప్రకటిస్తారనే చర్చా జరుగుతున్నది.

చైనాతో జెనీవా, లండన్‌లో రెండు దఫాలుగా చర్చలు జరిపిన ట్రంప్‌, ఏకపక్షంగా చైనాతో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అయితే దీనిపై చైనా మాత్రం స్పందించలేదు. చైనా రేర్‌ఎర్త్‌ ఎగుమతులు యదావిధిగా చేసేందుకు అంగీకరించిందనీ, అలాగే 55 శాతం సుంకాల విధింపునకు ఆమోదం తెలిపిందంటూ ట్రంప్‌ ప్రకటించారు. అలాగే అమెరికాలో చైనా విధ్యార్థులపై తాము ఆంక్షలు తొలగిస్తామనీ, తమ వస్తువులపై చైనాలో 10 శాతం సుంకాలు ఉంటాయని చెప్పారు. ఒప్పందం కుదిరితే అది ఉమ్మడిగా ఉండాలే తప్ప, ఏకపక్షంగా ఎలా ఉంటుందనే ప్రశ్నకు ట్రంప్‌ సమాధానం చెప్పలేదు. టెక్నాలజీ విషయంలో అమెరికా విధించిన ఆంక్షలు తొలగించకుండా, రేర్‌ఎర్త్‌ ఎగుమతులపై చైనా ఆంక్షలు తొలగించబోదని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే యూరప్‌ దేశాలు అమెరికాకు అనుకూలంగా మొగ్గుచూపినా, ఇప్పటి వరకు తుది ఒప్పందాలు జరగలేదు. కెనడాతో చర్చలు స్తంభించడంతో ‘ఇక వాళ్లతో చర్చల్లేవ్‌’ అంటూ ట్రంప్‌ ఏకపక్ష ప్రకటన చేశారు. భారతదేశంతో పెద్ద ఒప్పందానికి దగ్గర్లో ఉన్నామని ట్రంప్‌ ప్రకటించారు. జులై 9 లోపే ఒప్పందానికి రావాలని కోరారు. దీనికోసం ఈ వారంలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా వెళ్తున్నారు. సాధారణ స్థాయిలో జరిగిన చర్చల్లో భారత వ్యవసాయ మార్కెట్‌ను అమెరికాకు ‘ఓపెన్‌’ చేయాలనే అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమదేశ వ్యవసాయోత్పత్తులపై సుంకాలు ఎత్తివేయటం లేదా బాగా తగ్గించటం చేయాలని అమెరికా పట్టుబడుతోంది. ఇదే విషయాన్ని ట్రంప్‌ మీడియా ఎదుట ప్రస్తావించారు.

. అయితే గతంలోనూ ట్రంప్‌ భారతదేశం జీరో టారిఫ్‌లకు ఒప్పుకుందంటూ ప్రకటన చేశారు. దీన్ని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ సూటిగా ఖండించలేదు. ‘చర్చలు ఇంకా పూర్తి కాలేదు’ అని ముక్తసరి సమాధానం చెప్పారు. దీనితో భారతదేశం, అమెరికా వత్తిడికి తలొగ్గుతున్నట్టు కనిపిస్తున్నదనే చర్చ ప్రారంభమైంది. అదే జరిగితే భారత్‌లో అత్యధిక జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం దెబ్బతింటుంది.

ట్రంప్‌ తుంపర్లు…
సుంకాలంటూ బెదిరించినా అంతర్జాతీయ సమాజం పెద్దగా స్పందించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొత్త పల్లవి అందుకున్నారు. అన్ని దేశాలతో చర్చలకు సమయం లేదనీ, ఆ అవసరం కూడా తమకు లేదని చెప్పుకొచ్చారు. కేవలం కొన్ని పెద్ద దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామనీ, మిగిలిన వాటిపై సుంకాల విషయంలో తామే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘అంతా మా ఇష్టం. మేం ఏది చేయదల్చుకుంటే అది చేయగలం’ అనే సామ్రాజ్యవాదధోరణిని ప్రదర్శించారు. అదే సమయంలో ప్రపంచదేశాలు అమెరికాను సునిశితంగా గమనిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -