Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్తులో తక్కువ ఖర్చుతో స్టెమ్‌సెల్‌ థెరపీ

భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో స్టెమ్‌సెల్‌ థెరపీ

- Advertisement -

– నిమ్స్‌లో స్టెమ్‌సెల్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో స్టెమ్‌సెల్‌ థెరపీ సేవలు అందించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన నిమ్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్టెమ్‌సెల్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందించే లక్ష్యంతో అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ తులసి థెరప్యుటిక్స్‌ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక పెద్ద వృక్షానికి విత్తనం ఎంత ముఖ్యమో, మన శరీరానికి ఈ స్టెమ్‌ సెల్స్‌ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. విత్తనం నుంచి మహా వృక్షం తయారు అయినట్టే, స్టెమ్‌ సెల్స్‌ నుంచి కొత్త కణాలను, అవయవాలను తయారు చేయొచ్చని వివరించారు. మనిషి శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు లేదా జబ్బు చేసినప్పుడు, ఆ భాగాన్ని రిపేర్‌ చేసే అద్భుతమైన శక్తి ఈ కణాలకు ఉంటుందని చెప్పారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి ఈ స్టెమ్‌ సెల్స్‌కు ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడేవారికి ఈ చికిత్స సంజీవని లాంటిదని మంత్రి అభివర్ణించారు. ఆయా వ్యాధుల వల్ల శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించేందుకు ఈ చికిత్స ఉపయోగపడుతుందని వెల్లడించారు. రూ.లక్షల ఖర్చయ్యే స్టెమ్‌ సెల్‌ చికిత్స కొన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లోనే అందుబాటులో ఉందన్నారు. ఈ చికిత్సను సామాన్యులకు అందించాలని ఉద్దేశంతో ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ల్యాబ్‌లో మూల కణాలపై తులసి థెరప్యుటిక్స్‌, నిమ్స్‌ డాక్టర్లు పరిశోధనలు చేస్తారన్నారు. పరిశోధనా ఫలితాలతో పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో థెరపీ అందించగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప తదితరులు పాల్గొన్నారు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -