నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. కునార్ నాన్గర్‌హర్ ప్రాంతంలో భూమి 6.0 తీవ్రతతో కంపించింది. ఆ భూకంపం వల్ల సుమారు 800కు పైగా మృతిచెంది ఉంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కున్వార్‌లోనే 812 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రతినిధి మౌలావి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. సుమారు 3000 మందికిపైగా గాయపడ్డారు. నాన్‌గర్‌హర్ ప్రావిన్సులో ఉన్న జలాలాబాద్ సిటీకి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. పర్వత ప్రాంతాలు కావడం వల్ల మృతుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉన్నది. కొన్ని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా మాత్రమే వెళ్లే ప్రాంతాలు ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు.
ఆఫ్ఘన్ భూకంప మృతుల పట్ల భారత ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఆఫ్ఘన్‌ను ఆదుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.