అఫ్ఘనిస్తాన్, గత వైభవానికి, ప్రస్తుత విషాదానికి ఒక నిలువుటద్దం. ఒకప్పుడు గొప్ప నాగరికతలు వర్ధిల్లిన ఈ భూమి, గడచిన నాలుగు దశాబ్దాలుగా నిరంతర యుద్ధాలు, అంతర్గత కలహాలు, మానవతా సంక్షోభాల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈ మానవ నిర్మిత విలయానికి ప్రకృతి ఆగ్రహం తోడైనప్పుడు, అది ఒక భయంకరమైన విషాదానికి దారితీస్తున్నది. ఆగస్టు 31న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం 800 మందికి పైగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. ఇది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ వైఫల్యం, రాజకీయ నిర్లక్ష్యం, అంతర్జాతీయ సమాజ నిశ్శబ్ద వైఖరి కలగలిసి సృష్టించిన ఒక భయంకరమైన విషాదం.
భూకంపాలు అన్ని దేశాల్లోనూ సంభవిస్తాయి. కానీ అవి కలిగించే విధ్వంసం ఆయా దేశాల భౌగోళిక మానవ నిర్మిత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ భూకంపాలకు నిలయంగా ఉండటానికి ప్రధాన కారణం దాని అసాధారణ భౌగోళిక స్థానం. ఈ దేశం ప్రపంచం లోనే అత్యంత క్రియాశీలక టెక్టోనిక్ ప్రాంతాల్లో ఒకటైన భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ ప్లేట్లు నిరంతరం ఒకదానితో ఒకటి రాపిడికి గురవుతూ, భూమి లోపల తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఈఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు, భూకంపాలు సంభవిస్తాయి. ఇది ఒక శాశ్వత భౌగోళిక సత్యం. అయితే పక్టికాలో సంభవించిన భూకంప ప్రత్యేకత దాని తీవ్రత కాదు, దాని ‘షాల్లో ఫోకస్’. భూకంపం భూమి ఉపరితలం నుంచి కేవలం 8-10 కిలోమీటర్ల లోతులో సంభవించడం వల్ల, దానిశక్తి అత్యంత తీవ్రంగా ఉపరితలంపై వ్యాపించింది. లోతైన భూకంపమైతే, దాని శక్తి భూమి లోపల కొన్ని వందల కిలోమీటర్ల వరకు విస్తరించి, ఉపరితలంపై తీవ్రత తగ్గుతుంది. కానీ ఇప్పుడు సంభవించిన భూకంప ఫోకస్ తక్కువ లోతులో ఉండటం వల్ల విధ్వంసం అనూహ్యంగా పెరిగింది. ఇది కేవలం ప్రకృతి ఆగ్రహం మాత్రమే కాదు, మానవత్వపు నిస్సహాయతను కూడా వెల్లడించింది.
భూకంపాలు తరచుగా వచ్చే జపాన్, చిలీ, టర్కీ వంటి దేశాలు కూడా ఒకప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. కానీ ఆ దేశాలు గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, కఠినమైన భవన నిర్మాణ నియమా వళిని అమలు చేశాయి. సాధారణ గృహాలు కూడా భూకంపాల ఒత్తిడిని తట్టుకునేలా నిర్మించబడతాయి.
కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు సాధారణంగా మట్టి, మట్టి ఇటుకలు, సరిగా పటిష్టం చేయని రాళ్లతో కట్టబడతాయి. ఒక చిన్న ప్రకంపన వస్తే చాలు మొత్తం గోడలు కూలి నిద్రలో ఉన్న ప్రజ లను సమాధి చేస్తుంది. ఈ బలహీనమైన నిర్మాణా లకు తోడు, పటిష్టమైన విపత్తు నిర్వహణ వ్యవస్థ లేకపో వడం, సహాయక చర్యలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం. దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత, తీవ్రమైన ఆర్థిక క్షీణత దేశాన్ని కోలుకో లేని విధంగా దెబ్బతీశాయి. 2021లో తాలిబాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సమాజంతో సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా, అత్యవసర సహా యం ఆలస్యంగా చేరుకుంది. అలాగే, కొండ ప్రాంతాలు, దుర్గమమైన రహదారులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి అడ్డంకులుగా మారా యి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడానికి అత్యంత కీలకమైన మొదటి కొన్ని గంటలు వృథా అయ్యాయి, ఫలితంగా ప్రాణనష్టం ఊహించనంతగా పెరిగింది.
ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌కు కొత్తకాదు. కానీ ఇది వారి జీవితంలో ఒక భాగం కావడం బాధాకరం. ఆఫ్ఘనిస్తాన్ ఈ విషాద వలయం నుండి బయట పడాలంటే, కేవలం అత్యవసర సహాయం సరిపోదు. అంతర్జాతీయ సమాజం దీర్ఘకాలికంగా, వ్యూహాత్మకంగా సహాయం అందించాలి. ఆహారం, వస్త్రాలు, వైద్య సామాగ్రికి పరిమితం కాకుండా, దేశం మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడానికి విపత్తు నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలి. భూకంపాలను తట్టుకునేలా బలమైన నిర్మాణాలను ప్రోత్సహించాలి. స్థానిక సాంకేతికతలతో, తక్కువ ఖర్చుతో కూడిన ఇండ్లను నిర్మించడానికి వారికి సహాయం చేయాలి. అంతర్జాతీయ నిపుణులు ఆఫ్ఘనిస్తాన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతుంది. భూకంపాల గురించి ప్రజలకు ముందుగా హెచ్చరికలు జారీచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. సహాయక బృందాలకు శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం, అత్యవసర సామాగ్రిని నిల్వ చేయడం చాలా అవసరం. పాఠశాలలు, గ్రామాలు, ఇతర సంస్థల ద్వారా భూకంపాల సమయంలో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించాలి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, అంతర్జాతీయ సమాజం మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం అందించాలి. తాలిబాన్ ప్రభుత్వం కూడా ప్రపంచ దేశాలతో తిరిగి సంబంధాలను ఏర్పరచుకుని, విపత్తు నిర్వహణకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని పొందాలి.ఈ భూకంపం కేవలం ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రమే ఒక విషాదం కాదు, ఇది ప్రపంచ మానవత్వానికి ఒక పరీక్ష.
- డి.జె. మోహనరావు, 8247045230