Thursday, February 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిలేబర్‌కోడ్‌ల అనంతరం కురుక్షేత్రం మొదలైంది…

లేబర్‌కోడ్‌ల అనంతరం కురుక్షేత్రం మొదలైంది…

- Advertisement -

వేదవ్యాసుడు పద్దెనిమిది పర్వాలుగా రచించిన మహాభారతం పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ముగిసిందనే చారిత్రక ఇతివృత్తాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు కాబోలు! ఉద్యోగులు, కార్మిక సంఘాల ముందు ఎనిమిదవ వేతన సంఘం అధికారులు పద్దెనిమిది ప్రశ్నలతో సుదీర్ఘ ప్రశ్నావళిని ఆన్‌లైన్‌లో, ఇంగ్లీష్‌లో, అందుబాటులో ఉంచారు. దానిపై స్పందనలు మార్చి పదహారులోగా ఇవ్వవచ్చని గడువు విధించారు. ఆ ప్రశ్నలు పరిశీలిస్తే వాటి వెనక ఇన్ని కుతంత్రాలున్నాయా? అని దిమ్మ తిరగటం ఖాయం. ”ఆకలి తీరేలా, నాలుగు నూకలు పెంచండి” అని ఇంటి పని వాళ్లు అడిగితే, వెంటనే, ”దేశంలో వరదలొస్తున్నాయి, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు.

పండిన పంటను ప్రభుత్వ ఖజానాకు చేర్చే పనిలో కష్టపడుతున్నారు, అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి ఆసుపత్రులు కరువవుతున్నవి, రోగాలతో ప్రజలు బాధపడుతున్నారు, ఏ మాత్రం సత్తువ లేని మనుషులంతా విలవిల్లాడు తుంటే మీకు ఆకలి తీర్చడం ఎంత వరకు సబబు, ఆలోచించు” అని సమాధానమిస్తే అడిగిన వారి పరిస్థితి ఏమిటి? నియమిత ఎనిమిదవ వేతన సంఘం ద్వారా వెంటనే వేతన సవరణ జరిపించండని కోరుతున్న ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితే దాపురించింది. అందుచేత ఆ 18 ప్రశ్నలు సమాధానం కోసం సంధించినవి కావు. వారు తీసుకోబోయే నిర్ణయాల పట్ల ఉద్యోగులను సంసిద్ధ పరచటానికి ఒక ముందస్తు తంతు మాత్రమే. ఈ ప్రశ్నల ద్వారా ఉద్యోగులు తమ కన్ను తామే పొడుచుకునేలా ప్రజలే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ద్వేషాన్ని పెంచుకునేలా పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన ప్రక్రియ.

పొందుపరిచిన 18 ప్రశ్నల సారాంశం
‘వేతన సవరణ ద్వారా దేశంలోని యాభై లక్షల మంది కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా అనేక రంగాల వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుంది, నగదు సర్క్యులేషన్‌ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలో మంచి కదలిక వస్తుంది’ అంటూ ఇటువంటి పాజిటివ్‌ అంశాలను ఊటంకిస్తూనే, అన్ని ప్రశ్నల ద్వారా వేతన సవరణ కోరే వారి నోటికి తాళం వేసే ప్రయత్నం ఇందులో దాగుంది. ”వేతన సిఫారసు ”గైడింగ్‌ ప్రిన్సిపల్‌”గా ఎలా ఉండాలో చెప్పండి, ఆ ప్రిన్సిపల్‌ ద్వారా దేశానికి లాభం జరగాలి” అని ప్రస్తావించారు. ఉద్యోగుల వేతనాలకు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం ఉందా? ఒకవేళ ఉన్నా అది పూర్తిగా పరిపాలనకు బాధ్యత వహిస్తామని ఎన్నికల ద్వారా గెలిచిన పార్టీ బాధ్యత.

వేతన సవరణకు గైడింగ్‌ ప్రిన్సిపల్‌ అనేది ఉండడమంటే వేతనాల పెరుగుదలలో పారదర్శకత పాటించడమేగా! వేతనాల్లో యేటా ఇంక్రిమెంట్లు ఉండటం అవసరమా ఎందుకంటే ఫిక్స్డ్‌ టర్మ్‌, ఫ్లెక్సీ టర్మ్‌ అనే కొత్త కాన్సెప్టు ముందుకొచ్చాయి కాబట్టి, ఈ ఇంక్రిమెంట్లపై, నిర్దిష్ట వ్యవధిపై సూచనలి వ్వాలని కోరారు. అనగా ఇంక్రిమెంట్లు ఏటేటా కాకుండా పై అధికారులు నచ్చినప్పుడు గానీ లేదా పని విధానాన్ని సమీక్షించినప్పుడు గాని ఉంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక్కడ ఒకటి స్పష్టమైంది లేబర్‌కోడ్‌లలో పొందుపర్చినట్టుగానే ఇకముందు పర్మనెంట్‌ ఎంప్లాయ్ మెంట్‌ ఉండదు, ఫిక్స్డ్‌ టర్మ్‌ లేదా ఇష్టమొచ్చిన పనిని చేయించుకునే అవకాశంముండే ఫ్లెక్సీ టర్మ్‌ వంటివన్నీ అమలు జరిపితే అప్పుడు ఇంక్రిమెంట్లు ఏటేటా అవసరం రాదు.

అందుకని, ఇప్పుడే ఇంక్రిమెంట్లపై వాటి వ్యవధిపై అభిప్రాయాలు సేకరిస్తున్నారన్నమాట. ”బోనస్‌ చెల్లింపులు ఏ విధంగా ఉండాలి, అనగా పూర్తిగా ప్రొడక్టివిటీకి లింక్‌ చేసి ఉండాలా లేక సెక్టర్‌ వైజ్‌ ఉండాలా లేదా సంబంధిత క్యాడర్‌ను బట్టి ఉండాలా”అన్న మీమాంసకు ఈ ప్రశ్నని వదిలేశారు. అయినా జీతాలపెరుగుదల కొంత వ్యవధి తర్వాత అప్పటికీ జమ కాబడిన డీఏ బేసిక్‌లో విలీనం చేసి కొత్త బేసిక్‌ని నిర్ణయించడం కన్నా, వేతన సవరణ గడువు కాలంలో ఉన్న ద్రవ్యోల్బణంతో పోల్చి ఇస్తే సరిపోదా! అని మరో ప్రశ్న సంధించారు. అనగా దీనిద్వారా ధరల పెరుగుదల దాని ఆధారంగా లెక్కించబడే కన్స్యూమర్‌ ప్రైస్‌ఇండెక్స్‌ అన్న సాంకేతిక అంశాలకు చరమగీతం పాడి, రాజకీయ పలుకుబడికి భంగం వాటిల్లకుండా అధికార పార్టీ అనుయాయులు లెక్కించే ద్రవ్యోల్బణం రేట్‌తో ఉద్యోగుల వేతన సవరణను ముడి పెట్టడానికి చూస్తున్నారు.

సంక్షేమ పథకాలకు, వేతనజీవులకు ముడిపెట్టే కుట్ర!
”ఉద్యోగుల జీతాలు బాగా పెరిగిపోతే ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడి ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమ పథకాలు దెబ్బతినే అవకాశం ఉందా అనే అంశాల్ని పరిశీలించండి” అని మరో ప్రశ్న వేశారు. అనగా సంక్షేమ పథకాలకి ప్రభుత్వ నడిపే యంత్రాంగ వేతన జీవుల వేతనాలకు ముడిపెట్టి అంతర్గత తిరుగుబాటుకు ఆజ్యం పోస్తున్నారా!. ”ఒక రకంగా చెప్పాలంటే స్థిరమైన, దీర్ఘకాలం కొనసాగే మీ వేతనాలు అదే ప్రయివేటు రంగంలో పనిచేసేవారి వేతనాలతో పోల్చి చూసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో గమనించి సూచనలివ్వండి” అని ఇంకో ప్రశ్న. ఇది ఆక్రోశంతో ప్రభుత్వం చేసే దెప్పిపొడిచే ప్రయత్నమే.

ఒకే రంగంలో కూడా అన్ని కేడర్లకు సమాన వేతనాలుంటాయా? మరి రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల విలాసాలను ప్రజలందరికి ఎందుకు కల్పించరాదు! ”ప్రతి సంవత్సరం లేదా కాలపరిమితులను అనుసరించి ఇంక్రిమెంట్లు, కరువు భత్యాలు, ప్రమోషన్లు తీసుకునే ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ అవసరమా అంటూ మరో ప్రశ్న? ఇకనుంచి ప్రమోషన్‌తో క్యాడర్‌ మారినప్పుడు ఫిట్‌మెంట్‌ అడగకూడదని హెచ్చరిక చేసినట్లే ఇది. ”అలవెన్సులన్నీ కేఫటేరియా పద్ధతిలో ఇస్తే ఎలా ఉంటుంది” అని మరో ప్రశ్న. కెఫటేరియా పద్ధతి అనగా ఉద్యోగులకిచ్చే అలవెన్స్‌లు, ఉదాహరణకు, ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌, మెడికల్‌ బెనిఫిట్‌, లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, మెడిక్లెయిమ్‌, ఇతర పర్క్విజిట్స్‌ సాధారణంగా క్యాడర్‌ను బట్టి అమలవుతుంటాయి. ఇవన్నీ అన్ని రకాల ఏజ్‌ గ్రూప్‌ వాళ్లకి ఒకే రకంగా ఉపయోగపడకపోవచ్చు. అందుచేత కెఫెటేరియా పద్ధతి ద్వారా ఎవరికి ఏ అలవెన్సు కావాలో దాన్ని ఎంచుకోవచ్చు. మొత్తం అలవెన్స్‌లకు గరిష్ట పరిమితి ఉంటుంది. దానికి లోబడే ఎంచుకోవాల్సి ఉంటుంది.

దీనిద్వారా ఒక క్యాడర్‌ ఆధారంగా నిర్ణయించబడిన వేతనాలు అలవెన్సుల విధానానికి స్వస్తి పలకడానికి రంగం సిద్ధమైందన్న మాట. ఈరోజు అలవెన్సులకు మాత్రమే పరిమితమైన కెఫెటేరియా పద్ధతి రేపు వేతనాలకు ఆ తర్వాత సామూహిక వేతన స్కేళ్లకు వర్తిస్తుందన్నమాట! ”ప్రస్తుతం కరువు భత్యం కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సిపిఐ) ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక సారిస్తారు దాన్ని అసంఘటిత రంగంలో అందరికి వర్తించడం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పద్ధతి ఏమైనా ఉందా” అని సమాధానాన్ని కోరారు. దీని గురించి, డిఏ ఎత్తి వేయాలన్న ఆలోచన ఉన్నదని, వివరించాల్సిన అవసరం లేదనుకుంటా. ”అనేక డిపార్ట్మెంట్‌లో నియామకాలు ఎంట్రీ లెవల్‌లోనే జరుగుతాయి. అలా కాకుండా ఎంట్రీ లెవల్‌లో, మిడిల్‌ లెవల్‌లో, టాప్‌ లెవల్‌లో కూడా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా అర్హులైన వారిని తగిన పారితోషికమిస్తూ ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది” అంటూ సమాధానాన్ని కోరారు. దీనిద్వారా తమ అనుయాయులను, అవసరం అనుకున్నప్పుడు, అవసరమైన స్థానాలు నింపుకునే అవకాశానికి బాట వేసుకుంటున్నారా!

ప్రయివేటు సెక్టార్‌తో అనాలోచిత పోలిక
ఈ మధ్యకాలంలో బ్యాంకులు ఇన్సూరెన్స్‌ రంగాలలో డైరెక్టర్‌ స్థాయిలో సరాసరి కార్పొరేట్‌ సెక్టర్‌ నుండి నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను కేంద్రం జారీ చేసింది. ఇకనుండి అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి నియామకాలు చేపడు తున్నారన్నమాట! అనగా రాజ్యాంగం ప్రకారం అర్హులైన వారందరికీ ఆకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసి ప్రతిభావంతులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారిని తగు వృత్తిలో నియమించే ప్రక్రియకు చరమగీతం పాడి దొడ్డిదారిన కొందరిని ఎక్కువ మొత్తాలకు నియమించుకునే ప్రక్రియకు ఇది అవకాశం ఇస్తోంది. మరోప్రశ్న ఏమంటే ‘ప్రయివేట్‌ సెక్టార్‌తో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జాబ్‌ సెక్యూరిటీ ఎక్కువ కదా? దాన్ని దృష్టిలో పెట్టుకొని వేతన సవరణ ఎలా ఉండాలో చెప్పండి’ అని! ప్రయివేటు సెక్టారెందుకు, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో ఐఏఎస్‌ మొదలు అందరికీ సమానంగా వేతనాలున్నాయా! ఈ పోలిక ఆనాలోచితమైనది.

”దేశంలో 50 లక్షల మంది ఇన్‌ సర్విస్‌ ఉద్యోగులు ఉంటే డెబ్బయి లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు, పెన్షన్‌ కాస్ట్‌ పెరుగుతుంది. అందుచేత పెన్షన్‌ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వేతన సవరణ ఎలా ఉండాలో కూడా చెప్పండంటూ” మరో ప్రశ్న వేశారు. డిఫెన్స్‌ సెక్టార్‌లో మరింత ఎక్కువ మంది పెన్షనర్లు ఉండడంవల్ల వ్యయం పెరిగిపోతుందని కూడా ఇందులో పొందుపరిచారు. వీటి వెనుక సారాన్ని గమనించలేనంత అమాయకులెవరు? ఇలా అడిగిన ప్రశ్నలన్ని ప్రభుత్వ ఉద్యోగుల స్వతంత్రతను, చిత్తశుద్ధిని శంకించడమే కాకుండా వారీ కంట్రిబ్యూషన్‌ను విస్మరించడమే. ప్రభుత్వ లేదా, ఆ రంగం ఉద్యోగుల ప్రత్యేకత ఏమిటి? ప్రభుత్వ లేదా ప్రభుత్వరంగ ఉద్యోగులు యాజమాన్యానికి ఒక రకమైన బానిసలే. వారు ఏ వృత్తిని చేపట్టడానికి వీలులేదు. 24 గంటలు అందుబాటులో ఉండాలి. తమ కుటుంబ సభ్యులు చేపట్టే ప్రతి వృత్తినీ యాజమాన్యానికి తెలియజేస్తూ ప్రతియేటా ఆస్తిపాస్తుల వివరాలను తప్పకుండా సమర్పించాలి. లేదంటే శిక్షార్హులు.

ఇలాంటి ఉద్యోగులందరికీ సామూహిక బాధ్యత ఉంటుంది. వ్యక్తిగత బాధ్యత కన్నా ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రజలకు సర్వీసును అందించే విభాగం.పార్లమెంట్‌ చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు రూపకల్పన జరిగి, ఏ రకమైన ఇతర లావాదేవీలు జరపకుండా ఉండేందుకు సిద్ధమైన వారిని ఎంపిక చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ప్రభుత్వంలో భాగమై పరిపాలన చేయాలి గానీ ప్రొడక్టివిటీ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ కోసం పాకులాడే అపేక్ష ఉండరాదన్నది అందులోని మర్మం. డిఫెన్స్‌ సెక్టార్‌లో పనిచేసేవారి ప్రొడక్టివిటీ ఎలా కొలుస్తాం? లాంగ్‌ వీటి పెరిగింది కాబట్టి రిటైర్‌ అయిన తర్వాత ఎక్కువ రోజులు బతుకుతున్నారు. మిలటరీలో పనిచేసిన వాళ్లు నలభై ఏళ్లకే రిటైర్‌ అవుతారు. గనుక సహజంగా ఇన్‌ సర్విస్‌ వాళ్లకన్నా ఎక్స్‌ సర్విస్‌ వాళ్లు ఎక్కువమందే ఉండే అవకాశం ఉంది.

”దేశ సరిహద్దుల్లో ఉండే జీవన్‌కు సహకరించాలంటే మీరు వెంటనే ఆదాయపన్ను కట్టండి” అంటూ జవాన్ల పేరు చెప్పి రేడియోలో ఆదాయపన్ను కట్టించుకోవడానికి పన్నులు వసూలు చేసే ప్రభు త్వం పదవీ విరమణ పొందిన జవాన్లకు పెన్షన్‌ చెల్లించడానికి మాత్రం తెగ బాధపడిపోతున్నది. దేశంలో ఉన్న యాభై లక్షల ఉద్యోగులకు అరవై లక్షల పైబడి ఉన్న పెన్షనర్లకు కలిపి చెల్లించే మొత్తం రమారమి ఐదు లక్షల కోట్ల రూపాయలే. మరి కోటీ యాభై లక్షల జనాభా కలిగిన దేశాన్ని నడిపించే ప్రక్రియలో నాలుగు వందల లక్షల కోట్ల జీడీపీ కలిగిన దేశంలో ఐదు లక్షల కోట్ల వార్షిక వేతనం ఎక్కువెలా అవుతుంది? వెరసి, ఈ ప్రశ్నల ద్వారా ఉద్యోగులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ప్రయివేట్‌ సెక్టార్‌తో పోల్చి అవమానపరిచే ప్రయత్నం ఇది. ప్రయివేట్‌ సెక్టార్‌ యాజమాన్యాలు దోచుకుంటున్నది కళ్లకు కనపడటం లేదా? అక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టే ప్రయత్నాలు చేయకుండా ఆర్థిక వ్యవస్థకు అండాగా నిలిచే వారి భవిష్యత్తుపై నీలినీడలు కమ్మే ప్రశ్నావళిని ముందుకు తీసుకురావడం ద్రోహపూరితం కాక మరేమిటి?

జి.తిరుపతయ్య 9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -