Saturday, March 21, 2026
E-PAPER
Homeమానవిపెండ్లి తర్వాత...

పెండ్లి తర్వాత…

- Advertisement -

మహిళల జీవితంలో పెండ్లి తర్వాత ఎన్నో మార్పులు జరుగుతాయి. భర్త, అత్తింటి వాళ్ల ఒత్తిడితో కొన్ని, గొడవలెందుకన్న ఉద్దేశంతో తమకు తామే మరికొన్ని త్యాగాలు చేయడం, సర్దుకుపోవడం.. ఇలాంటి వాటి వల్ల కొంతమంది మహిళలు తమ సొంత గుర్తింపును కోల్పోతుంటారు. అయితే ఇలా ప్రతి విషయంలో సర్దుకుపోవడం, మార్పులు చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తగ్గే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే పెండ్లి తర్వాత కూడా అమ్మాయిలు కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోకపోవడమే మేలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం…

సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టే అంశాల్లో ఉద్యోగానిది కీలకపాత్ర. అయితే పెండ్లి తర్వాత అత్తింటి వారికి ఇష్టం లేదనో, వీలుకాకనో.. ఇలా కారణాలు ఏమైనా కొంత మంది అమ్మాయిలు వీటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అది కూడా అయిష్టంగానే. అయితే ఇతరుల ఇష్టాలకు విలువిచ్చి, మన ఇష్టాలను త్యాగం చేయడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకే ఈ విషయంలో మిమ్మల్ని మీరు బాధపెట్టుకునే బదులు ఉద్యోగం కొనసాగించే విషయంలో మీ భర్త, అత్తింటి వారి అభిప్రాయం పెండ్లికి ముందే తెలుసుకోండి. వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయండి. అదీ కుదరకపోతే ఆ సంబంధం విషయంలో మరోసారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే కెరీర్‌ విషయంలో మీ ఇష్టాలకు విలువివ్వని వారు.. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ మిమ్మల్ని, మీ అభిప్రాయాల్ని గౌరవిస్తారన్న గ్యారంటీ ఉండదు.

వస్త్రధారణ
తమకు నచ్చినా, నచ్చకపోయినా పెండ్లయిన తర్వాత కొందరు అమ్మాయిలు కొన్ని అభిరుచుల్ని మార్చుకుంటారు. డ్రెస్సింగ్‌తో పాటు ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటారు. నిజానికి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామేమోనన్న భావనే మనల్ని ఎక్కువగా వేధిస్తుంటుంది. కాబట్టి అభ్యంతరకరంగా లేనంత వరకు అది ట్రెడిషనల్‌ అయినా, మోడ్రన్‌ అయినా చక్కటి డ్రెస్సింగ్‌ సెన్స్‌ను కొనసాగించడం మంచిది. అంతగా అవసరమనిపిస్తే మీ అభిప్రాయాన్ని మీ భాగస్వామితో పంచుకొని వారిని ఒప్పించండి. అలాగే ఆయా విషయాల్లో మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా విలువివ్వడం వల్ల ఇద్దరి మధ్య అమరికల్లేకుండా ముందుకెళ్లచ్చు.

స్నేహితులు…
పెండ్లికి ముందు మనకంటూ ఓ స్నేహితుల బృందం ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో సమయం గడుపుతూ బోలెడన్ని మధుర జ్ఞాపకాలు మూటగట్టుకుంటుంటాం. అయితే పెండ్లి తర్వాత ఒక్కసారిగా దీన్ని మార్చుకోవాలని చెప్పే హక్కు గానీ, అవతలి వారి కోసం మనకు మనమే మన స్నేహాన్ని త్యాగం చేసే అవసరం గానీ లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికైనా, శారీరక, మానసిక ఉల్లాసానికైనా మనకంటూ కొంత సమయం కేటాయించుకోవడం, నచ్చిన వారితో గడపడం ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి.

బాధ్యత మారదు
పెండ్లి తర్వాత అమ్మాయి పుట్టింటి వారి గురించి పట్టించుకోనక్కర్లేదనే భావన ఇప్పటికీ కొంతమందిలో చూస్తుంటాం. నిజానికి ఇలాంటి ఆంక్షల వల్ల కొడుకులు లేని తల్లిదండ్రుల బాగోగులు చూసే వారే కరువవుతుంటారు. కానీ ఇలా ఆలోచించే సమాజాన్ని పక్కన పెట్టి… పెండ్లి తర్వాత కూడా అమ్మాయిలు తమ గత బాధ్యతల్ని కొనసాగించడమే మంచిదంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులను చూసుకోవడం, వృద్ధాప్యంలో వారిని చేరదీయడం, ఆర్థికంగా మీకున్న బాధ్యతల్ని కొనసాగించడం వంటి విషయాల్లో ఎలాంటి మార్పులూ చేసుకోవల్సిన అవసరం లేదు. ఈ విషయాల్లో పెండ్లి తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే మీ బాధ్యతల గురించి మీ భాగస్వామితో ముందే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఆ విషయంలోనూ…
పెండ్లి తర్వాత చాలా మంది అమ్మాయిల ఇంటి పేరు మారుతుంటుంది. ఇది పాత పద్ధతే అయినా ఈ రోజుల్లో కొంతమంది పెండ్లి అయినా తమ తల్లిదండ్రుల ఇంటి పేరునే ప్రతి చోటా ఉపయోగిస్తున్నారు. ఇక మరికొందరు తమ పూర్తి పేరు వెనుక తమ భర్త పేరు లేదంటే అత్తింటి వారి ఇంటి పేరును చేర్చుకుంటున్నారు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించడం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలోనూ గొడవలు రాకుండా పెండ్లికి ముందే కాబోయే దంపతులు ఓ నిర్ణయానికి రావడం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -