Friday, September 26, 2025
E-PAPER
Homeఆటలుసూర్యసేనకు ఎదురుందా?

సూర్యసేనకు ఎదురుందా?

- Advertisement -

శ్రీలంకతో భారత్‌ పోరు నేడు
రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ-దుబాయ్
ఆసియా కప్‌ సూపర్‌4 దశ నేటితో ముగియనుంది. సూపర్‌4లో వరుస విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా నేరుగా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో శ్రీలంక ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. నేడు సూపర్‌4 ఆఖరు మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌, ఇంటిబాట పట్టిన శ్రీలంక ముఖాముఖి తలపడనున్నాయి. అజేయ రికార్డుతో టైటిల్‌ పోరులో అడుగుపెట్టాలని టీమ్‌ ఇండియా భావిస్తుండగా.. ఊరట విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలని లంకేయులు అనుకుంటున్నారు. స్పిన్‌ ప్రధాన పాత్ర పోషించే దుబారు స్టేడియంలో నేడు భారత్‌, శ్రీలంక తలపడనున్నాయి. వరుస విజయాల జోరుమీదున్న సూర్యకుమార్‌ సేనకు ఎదురుందా?.

అదే అసలు సమస్య
ఆసియా కప్‌లో భారత్‌కు ఎదురులేదు. గ్రూప్‌ దశ, సూపర్‌4లో అజేయ జోరు చూపిస్తోంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొడుతుంది. యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ధనాధన్‌ దంచికొడుతుండగా.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మాయాజాలంతో వికెట్ల జాతర సాగిస్తున్నాడు. కుల్‌దీప్‌కు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి జతకలవటంతో మిడిల్‌ ఓవర్లలో పరుగుల వేట, వికెట్లు నిలుపుకోవటం ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా మారింది. అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ జోరును అడ్డుకోవటం ప్రత్యర్థి బౌలర్ల తరం కావటం లేదు. బ్యాట్‌తో, బంతితో గొప్పగా రాణిస్తున్నా… ఫీల్డింగ్‌లో భారత్‌ పేలవంగా ఉంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో ఐదు మ్యాచుల్లో 14 క్యాచులు వదిలేసింది. దుబాయ్ స్టేడియంలో ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం సైతం క్యాచులు నేల పాలు కావటానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్‌ ముంగిట భారత్‌ ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అసవరం ఉంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌లు తమదైన ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -