Friday, January 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ ఎదురీత

ట్రంప్‌ ఎదురీత

- Advertisement -

ముమ్మరంగా ‘నో కింగ్‌’, ‘మాగా’ ఉద్యమాలు
పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
ఇండియానాలో రిపబ్లికన్ల తిరుగుబాటు
విదేశీ వ్యవహారాలలో అభాసుపాలు
మసకబారుతున్న ప్రతిష్ట

వాషింగ్టన్‌ : డోనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో గత సంవత్సరం అమెరికా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవి రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను కుదిపేశాయి. అంతర్జాతీయంగా అగ్రరాజ్యం ప్రాభవం మసకబారుతోంది. అధ్యక్ష భవనం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రైమరీల నుంచి బెదిరింపులు వస్తున్నప్పటికీ, తోటీ జీఓపీ చట్టసభ సభ్యులపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ గత డిసెంబర్‌ 11న ఇండియానా రిపబ్లిక్‌ సెనెట్‌ ట్రంప్‌ ప్రణాళికను తోసిపుచ్చింది. దీనిని బట్టి ప్రభుత్వ హెచ్చరికలు అన్ని వేళలా సత్ఫలితాలు ఇవ్వవని, వాటికీ పరిమితులు ఉంటాయని తేలిపోయింది.

రానున్నది గడ్డు కాలమే
మొత్తంగా చూస్తే విస్తృత ప్రతిఘటనకు ఇండియానాలో జరిగిన తిరుగుబాటు ఓ శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. వ్యక్తిగత బెదిరింపులు, రాజకీయ హెచ్చరికలు ఎదుర్కొంటున్న సెనెటర్లు గళం విప్పారు. ఇండియానాలో ఎదురైన పరాభవంతో ఇతర రాష్ట్రాలలో అలాంటి దుస్సాహసాలకు పాల్పడేందుకు ట్రంప్‌ సాహసించకపోవచ్చు. మరోవైపు దేశంలో ‘నో కింగ్స్‌’ ఉద్యమం ముమ్మరంగా సాగుతోంది. జూన్‌లో లక్ష మంది కవాతుతో ప్రారంభమై అక్టోబర్‌ నాటికి 70 లక్షల మంది మద్దతు పొందింది. అభ్యుదయవాదులు, కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నాయి.

అదే సమయంలో ‘మాగా’ ఉద్యమకారుల అసమ్మతి ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరులో దేశంలో జరగబోయే మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌కు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. ద్రవ్యోల్బణం, సరఫరాలలో అంతరాయాలు, డోగ్‌ ద్వారా ప్రభుత్వ నిధులలో కోతలు కార్మికులు, ఉద్యోగులను ఆర్థిక పరమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. కార్మిక నేతలు, కమ్యూనిటీ నిర్వాహకులు ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలను విస్తృతం చేస్తూ ఏకతాటి పైకి వస్తున్నారు. వలసదారులు, బాహ్య శతృవులను బలిపశువులను చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికలలో ట్రంప్‌కు ఓటేసిన వారు సైతం ఇప్పుడు ఆయన విధానాలపై విమర్శలు కురిపిస్తున్నారు.

పెరుగుతున్న వ్యతిరేకత
రిపబ్లికన్లకు పూర్తి మెజారిటీ ఉన్న రాష్ట్రంలో ఎదురు దెబ్బ తగలడం ట్రంప్‌కు మింగుడు పడడం లేదు. ఆ రాష్ట్రానికి చెందిన 21 మంది రిపబ్లికన్‌ సెనెటర్లు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం డెమొక్రాట్లలో చేరిపోయారు. మరోవైపు దేశంలో ‘నో కింగ్స్‌’ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి లక్షలాది మందిని సమీకరిస్తున్నాయి. అదుపులేని అధికారాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి ఇది ఉదాహరణ. రాజ్యాంగ, ప్రజాస్వామ్య నిబంధనలను ట్రంప్‌ సవాలు చేస్తున్నప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ యొక్క రక్షణ కవచాలు… అంటే న్యాయస్థానాలు, మీడియా, ప్రజలు… చాలా బలంగా ఉన్నాయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

విదేశాల్లోనూ వైఫల్యమే
ఇక విదేశీ వ్యవహారాలలో జోక్యం ట్రంప్‌ను నవ్వులపాలు చేస్తోంది. ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్‌ వైఫల్యాలను మాత్రం అంగీకరించడం లేదు. కాల్పుల విరమణ ప్రతిపాదనలు చేసినప్పటికీ ఉక్రెయిన్‌ చర్చల్లో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా అక్కడ యుద్ధ వాతావరణమే కన్పిస్తోంది. ఆంక్షలు, స్వాధీనాలు, సైనిక హింస ద్వారా అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ వెనిజులా అదరడం లేదు. బెదరడం లేదు. ఈ ఘర్షణల కారణంగా దేశీయ వనరులు తరిగిపోతున్నాయి.

నలభై శాతమే మద్దతు
ఉన్న సమస్యలు చాలకపోగా మరికొన్ని ట్రంప్‌ మెడకు చుట్టుకున్నాయి. వీటిలో లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ వ్యవహారం ఒకటి. తగుదునమ్మా అంటూ అంతర్జాతీయ వ్యవహారాలలో తలదూరుస్తూ అప్రదిష్టను మూటకట్టుకుంటున్నారు. వెనిజులా నుంచి గ్రీన్‌లాండ్‌, గాజా వరకూ దురాక్రమణలు, బెదిరింపులకు మద్ద్దతు ఇస్తూ నవ్వులపాలయ్యారు. అమెరికాలోని మెజారిటీ ఓటర్లు ట్రంప్‌ను తిరస్కరించారన్నది నిజం. అధ్యక్ష ఎన్నికలలో ఆయనకు వచ్చిన ఓటు షేరింగ్‌ యాభై శాతం కంటే కొంచెం ఎక్కువ. అయితే విస్తృతమైన సెంటిమెంట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే ఆయనకు లభించిన ప్రజా మద్దతు 40 శాతం కంటే తక్కువే. ట్రంప్‌ యొక్క కీలక మద్దతుదారులు కూడా ఆయనను వ్యతిరేకించారు. అందుకు ఉదాహరణే ఎలన్‌ మస్క్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -