Sunday, March 15, 2026
E-PAPER
Homeకథదుఃఖ యాతన

దుఃఖ యాతన

- Advertisement -

రష్యన్‌ మూలం: అంతోన్‌ చెహోవ్‌
”ఎవరికి చెప్పుకోవాలి నా దుఃఖాన్ని?”
సంధ్యా సమయపు మసక వెలుతురులో పెద్ద పెద్ద మంచు రేకులు అప్పుడే వెలిగించిన వీధిస్తంభాల చుట్టు బద్ధకంగా సుళ్లు తిరుగుతూ, ఇళ్ల పైకప్పుల మీదా గుర్రాల వీపుల మీదా మనుషుల బుజాల మీదా టోపీల మీదా పడుతున్నాయి. జట్కావాలా యోనా పోటపోవ్‌ మంచు పేరుకుపోయి దయ్యం లాగా కనిపిస్తున్నాడు. అతడు బగ్గీలోని డబ్బాలాంటి సీటు మీద శరీరాన్ని సాధ్యమైనంతగా లుంగచుట్టి నిశ్చలంగా కూర్చున్నాడు. తనమీద నిరంతరాయంగా మంచుసోన కురిసినా దాన్ని దులుపుకోవాలని అతనికి అనిపించదు బహుశా. అతని చిన్న గుర్రం కూడా అతనిలాగే తెల్లగా, కదలకుండా మెదలకుండా ఉంది. దాని నిశ్చలత, శరీరభాగాల కోణాకారం, కట్టెలలాంటి నిటారైన బిగుసుకుపోయిన కాళ్లు…వీటిని చూస్తే అది గుర్రం ఆకారంలో ఉన్న బిస్కెట్టా అనిపిస్తోంది. అది బహుశా దీర్ఘాలోచనలో మునిగిపోయిందేమో. తన సహజ జీవన విధానం నుండి బలవంతంగా వేరు చేయబడిన ఏ జీవి అయినా ఆలోచించక తప్పదు మరి. ఈ గుర్రం కూడా మైదానాలను వదిలి పెద్దపెద్ద విద్యుద్దీపాలు, జనసమ్మర్దం, భయంకరమైన గోల నిండిన నగరం లోకి వచ్చింది.
యోనా, అతని గుర్రం చాలా రోజులుగా రోడ్డు మీదికి రాలేదు. ఇవాళ యోనా తన గుర్రంతో పాటు మధ్యాహ్నం వేళ సత్రపు చావడి నుండి బయటికి వచ్చాడు. కానీ ఇంకా ఒక్క సవారీ కూడా దొరకలేదు. నగరం మీద సాయంత్రపు నీడలు పడుతున్నాయి. వీధిదీపాల పల్చని కాంతి స్పష్టమైన రంగును సంతరించుకుంటోంది. రణగొణ ధ్వనులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి.
”వైబోర్గ్స్కాయాకు బగ్గీ కావాలి. వస్తావా?” అని వినిపించింది యోనాకు.
యోనా బగ్గీని కదిపాడు. మంచు నిండిన కనురెప్పలలోంచి ఒక అధికారిని చూశాడు. అతడే తన కిరాయిదారు. అతడు ఒక మిలిటరీ కోటును తొడుక్కొని తలమీద టోపీ పెట్టుకుని ఉన్నాడు.
”వైబోర్గ్స్కాయాకు. నిద్ర పోతున్నావా ఏంటి?” అన్నాడు ఆ అధికారి చిరాకుగా.
సరే అన్నట్టు గుర్రపు కళ్లేన్ని లాగాడు యోనా. దాంతో గుర్రం వీపుమీంచి, బుజాలమీంచి మంచురేకులు ఎగిరి పడ్డాయి. అధికారి బగ్గీలోకి దూరాడు. యోనా గుర్రాన్ని అదిలించి, హంస లాగా మెడను చాపి, అలవాటుగా కొరడా ఝళిపించాడు. గుర్రం కూడా మెడను సాగదీసి, కట్టెలలాంటి కాళ్లను కొంచెం మడిచి, సందిగ్ధంగా కదిలింది.
”ఎటు పరుగెత్తుతున్నావు దుర్మార్గుడా? ఎటు పోతున్నావురా పిశాచమా? కుడివేపున ఉండు,” అని అరిచాడు అధికారి. ”బండి ఎలా నడపాలో తెలియదు నీకు. కుడివేపున ఉండు,” అన్నాడు మళ్లీ కోపంగా.
మరొక జట్కావాలా యెనాను తిట్టాడు. రోడ్డు దాటుతున్న ఒక పాదచారికి గుర్రం ముక్కు తగలటంతో అతడు కోపంగా చూసి మంచును దులుపుకున్నాడు. యోనా ముళ్లమీద కూచున్నట్టు కదులుతూ, మోచేతులను విదిలిస్తూ, దెయ్యం పూనినవాడి లాగా తనెక్కడున్నాడో ఎందుకున్నాడో తెలియనట్టు బగ్గీని నడుపుతున్నాడు.
”రాస్కెల్స్‌, వాళ్లందరు అకస్మాత్తుగా నీ మీద లేదా గుర్రపుకాళ్ల కింద పడిపోవాలని సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నారు. బహుశా కావాలనే,” అన్నాడు అధికారి హాస్యధోరణిలో.
యోనా ఆ అధికారి వైపు చూసి పెదవులను కదిపాడు. అతడేదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపించాడు. కానీ తుమ్ము లాంటిది తప్ప ఏదీ బయటికి రాలేదు.
”ఏమిటీ ఏమంటున్నావు?” అని అడిగాడు కిరాయిదారు.
యోనా ఒక వంకర నవ్వు నవ్వి, గొంతు సవరించుకొని, కీచుగొంతుతో ”వారం రోజుల కింద…నా కొడుకు…నా కొడుకు చనిపోయాడు సార్‌,” అన్నాడు.
”ఊష, ఏ వ్యాధితో చనిపోయాడు?”
యోనా పూర్తిగా వెనక్కి తిరిగి, ”ఎవరు చెప్పగలరు? ఏదో జ్వరం కావచ్చు. ఆస్పత్రిలో మూడు రోజులుండి చనియాడు. అంతా దేవుని ఇచ్ఛ,” అన్నాడు.
అధికారి తేరుకుని, ”మలుపు తిరుగు రాక్షసుడా. నీకు మతి గాని చలించిందా ఏమిటి? ఎటు పోతున్నావో చూసుకో ముసలి కుక్కా. పోనీ పోనీ. ఇట్లా మెల్లగా పోతే రేపు కూడా మనం అక్కడికి చేరుకోలేం,” అని అరిచాడు.
యోనా మళ్లీ ఒకసారి మెడను చాచి, కూర్చున్న స్థానం లోంచి కొంచెం లేచి, కొరడాను ఝళిపించాడు. మళ్లీ మళ్లీ వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఆ అధికారి కళ్లు మూసుకుని, వినడానికి నిరాసక్తత చూపాడు.
సవారీని దింపి ఒక రెస్టారెంటు దగ్గర జట్కాను నిలిపాడు యోనా. మళ్లీ ముడుచుకుని బగ్గీసీటు మీద కూర్చున్నాడు. తడిమంచు మళ్లీ కురవటంతో గుర్రం తెల్లగా మారింది. గంట సమయం గడిచింది. తర్వాత మరో గంట…
ముగ్గురు ఎత్తైన బక్కపలుచని యువకులు వచ్చారు. వారిలో ఒకడు పొట్టిగా గూని నడుముతో ఉన్నాడు. వాళ్లు ఒకరిమీద ఒకరు వేళాకోళంగా బిగ్గరగా అరుచుకుంటూ పొడవాటి తోలుబూట్లతో నేలమీద చప్పుడు చేస్తున్నారు.
”జట్కా, పోలీస్‌ బ్రిడ్జికి. ముగ్గురం. ఇరవై కోపెక్కులు ఇస్తాం. వస్తావా?” అని పగిలిన గొంతుతో అరిచాడు గూని యువకుడు.
యోనా కళ్లేన్ని చిన్నగా లాగి గుర్రాన్ని అదిలించాడు. ఇరవై కోపెక్కులు మంచి బేరం కాదు. కానీ దానిగురించి ఆలోచించడం లేదతడు. ఒక రూబులైనా ఐదు కోపెక్కులైనా ఒప్పుకోవాల్సిందే. సవారీ దొరకడమే అతడు కోరుకునేది. ఆ ముగ్గురు యువకులు ఒకరినొకరు తోసుకుంటూ స్నేహపూర్వకంగా దుర్భాషలాడుకుంటూ బగ్గీలోకి దూరి, ముగ్గురూ ఒకేసారి కూర్చునే ప్రయత్నం చేశారు. ఎవరు కూర్చోవాలి ఎవరు నిలబడాలి అనే ప్రశ్న తలెత్తింది. చాలాసేపు కీచులాడుకున్న తర్వాత, గూనివాడు అందరిలో పొట్టివాడు కనుక అతడు నిలబడాలని నిర్ణయించారు.
కుదురుకున్న తర్వాత, ”పోనీ” అన్నాడు గూనివాడు. తర్వాత మళ్లీ ”ఎటువంటి టోపీ పెట్టుకున్నావు మిత్రమా. అంతకన్న ఘోరమైనది పీటర్స్‌ బర్గ్‌ నగరం మొత్తంలో ఎక్కడా దొరకదు,” అన్నాడు.
”హిహి, హిహి. అది చూపించుకునేవిధంగా లేదు” నవ్వుతూ అన్నాడు యోనా.
”సరే పోనీ మరి. ఎహె, నువ్విట్లానే నిదానంగా నడుపుతావా బండిని, లేక మెడమీద ఒక్కటిచ్చుకోమంటావా?”
”నాకు తలనొప్పి వస్తోంది. నిన్న డక్మసోవ్‌ దగ్గర నేనూ వాస్కా కలిసి నాలుగు బాటిళ్ల బ్రాండీ తాగాం,” అన్నాడు కూర్చున్నవాళ్లలో ఒకడు.
”నువ్వెందుకలా ఘోరంగా అబద్ధాలాడుతావో తెలియదు నాకు,” అన్నాడు మరొకడు.
”నన్ను చంపినా సరే, ఇది వాస్తవం.”
”అవును. పేను దగ్గినంత వాస్తవం.”
”హిహి. హుషారైన దొరబాబులు,” అని నవ్వాడు యోనా.
”థూ, నిన్ను దయ్యం పట్టనీ. ముసలోడా, బండి నడుపుతావా లేదా? ఇట్లానేనా నడిపేది? కొరడాతో గుర్రానికి ఒక్కటిచ్చుకో. డామిట్‌,” అన్నాడు గూని యువకుడు.
యోనా తన వెనుక కదిలే ఇద్దరు యువకుల తిట్లనూ గూనివాడి కఠోరమైన కంఠస్వరాన్నీ విన్నాడు. రోడ్డు మీద జనాన్ని చూస్తుంటే అతనిలోని ఒంటరితనపు బాధ కొంచె కొంచెం తగ్గడం మొదలైంది. గూనివాడు యోనాను రకరకాల పేర్లతో తిడుతూనే ఉన్నాడు. బిగ్గరగా తిట్టడంతో ఆఖరుకు వాడికి దగ్గు వచ్చింది. కూర్చున్న ఇద్దరు యుకులు నాద్యెజ్దా పెట్రోవ్నా అనే వ్యక్తి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. యోనా వాళ్లను చూశాడు. వాళ్ల మాటలకు తెరిపి రాగానే, ”వారం రోజులకింద నా కొడుకు చనిపోయాడు,” అన్నాడు.
”మనమందరం చనిపోవాల్సిందే. పోనీ పోనీ. ఒరేరు దోస్తులూ, ఇలా నిలబడటం నాకు కష్టంగా ఉంది. మనం గమ్యం ఎప్పుడు చేరుతాం?” అన్నాడు గూనివాడు, పెదాలను తుడుచుకుంటూ.
”ముసలోడికి మెడమీద ఒక్కటిచ్చుకొని ఉత్సాహం కలిగించు.”
”విన్నావా ముసలోడా? పెళ్లినడక లాగా ఉంది నీ బండి ప్రయాణం. విన్నావా ముసలి పీనుగా? మేం ఎంత మొత్తుకుంటున్నా నువ్వు పట్టించుకోవా?” యోనా మెడమీద ఒక దెబ్బ పడింది.
”హిహి. హుషారైన దొరబాబులు. దేవుడు మిమ్మల్ని కాపాడాల.”
”జట్కావాడా, నీకు పెళ్లైందా?” అని అడిగాడు వాళ్లలో ఒకడు.
”నాకా? హిహి, దొరబాబులు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక భార్య పచ్చిమట్టి. అంటే సమాధి అన్నమాట. హిహి, నా కొడుకు చచ్చిపోయి నేను బతికి ఉన్నాను. చావు తప్పుతలుపును తట్టడం విచిత్రం. నన్ను తీసుకుపోయే బదులు నా కొడుకును తీసుకుపోయింది చావు.”
తన కొడుకు ఎలా చనిపోయాడో చెప్పాలని యోనా వెనుకకు తిరిగాడు. కానీ గూనివాడు చిన్నగా దగ్గి, ”బతుకు జీవుడా, మన గమ్యం వచ్చేసింది,” అన్నాడు. యోనా ఇరవై కోపెక్కులు తీసుకుని ఆ యువకులు వెళ్లిన వైపు అదేపనిగా చూస్తూ ఉండిపోయాడు. అతడు మళ్లీ ఒంటరివాడై మౌనంగా మిగిలిపోయాడు. కొంచెం తగ్గిన దుఃఖం మళ్లీ ఆవహించడంతో కన్నీళ్లు మరింత క్రూరంగా బాధించాయి అతడిని. ఆందోళన, ఆవేదన నిండిన చూపును రోడ్డు మీద నడుస్తున్న జనం మీదికి పోనిచ్చాడతడు. ఇంత మందిలో నా బాధను వినేవాడు ఒక్కడు కూడా లేడా అనుకున్నాడు. కానీ జనం అతణ్నీ అతని దుఃఖాన్నీ పట్టించుకోకుండా సాగిపోతున్నారు. అతని దుఃఖం విపరీతంగా, అనంతంగా పెరిగింది. ఒకవేళ అతని హదయం ఉధతమైన బాధతో పగిలిపోతే అది వెల్లువెత్తి మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందేమో. కానీ అది బయటికి కనిపించదు. అది ఎంత మాయదారి ప్రదేశంలో దాక్కున్నదంటే, కాగడా వేసి చూసినా కనిపించదు.
పార్సెల్‌ కట్టను మోసుకుపోతున్న ఒక ఆసామి కనపడగానే, ”టైమెంత అవుతోంది మిత్రమా,” అని అడిగాడు యోనా.
”పది గంటలు కావోస్తోంది. ఎందుకు ఆగావు ఇక్కడీ బండి నడుపు.”
యోనా బండిని కొంత దూరం నడిపి బాధగా శరీరాన్ని ముడుచుకున్నాడు. తన దుఃఖాన్ని ఇతరులకు చెప్పుకోవడం మంచి విషయం కాదనుకున్నాడతడు. ఐదు నిమిషాలు సైతం గడవకుండానే కొంచెం కోలుకొని, చాలా నొప్పి కలిగినవాడిలాగా కళ్లేన్ని చిన్నగా లాగాడు. కానీ వేదనను భరించలేకపోయాడు.
సత్రపు చావడికి తిరిగి పోవాలని నిశ్చయించుకున్నాడు.
అతని ఆలోచనను గ్రహించినదానిలాగా గుర్రం పరుగు అందుకుంది. గంటన్నర తర్వాత యోనా సత్రపు చావడిలో ఒక పెద్ద పాత మురికి స్టవ్‌ ముందర కూర్చుని ఉన్నాడు. నేల మీదా బెంచీల మీదా పడుకుని కొందరు గురక పెడుతున్నారు. గాలి రకరకాల వాసనలతో నిండి, ఊపిరాడని విధంగా ఉంది. యోనా వారిని చూసి తల గోక్కుని, తాను తొందరగా తిరిగి వచ్చినందుకు పశ్చాత్తాపపడ్డాడు.
‘ఇవాళ కనీసం గుర్రం కోసం గుగ్గిళ్లు కొనేంత డబ్బును సైతం సంపాదించలేదు నేను. అందుకే నాకింత దుఃఖం. డబ్బు సంపాదించి సరిపోయినంత తినేవాడు, తన గుర్రానికి చాలినంత తిండి పెట్టగలిగేవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు,’ అనుకున్నాడు యోనా.
ఒక మూలలో పడుకున్న ఒకనికి గొంతు ఎండుకుపోయినట్టుంది. గొంతుతో శబ్దం చేస్తూ మగతలోనే నీళ్ల కుండ వైపు నడిచాడు.
”దాహమేస్తోందా?” అని అడిగాడు యోనా.
”అవును,” అన్నాడతడు.
”నీ దాహం తీరనీ. కానీ నా కొడుకు చనిపోయాడు మిత్రమా. వింటున్నావా? వారం రోజుల కింద ఆస్పత్రిలో. అంతా విచిత్రంగా జరిగిపోయింది.”
తన మాటలు ఏదైనా ప్రభావాన్ని కలిగించాయా అని ఆ వ్యక్తి వైపు చూశాడు. కానీ ఎలాంటి ప్రభావం లేదు. ఆ మనిషి వెంటనే దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారాడు. యోనా నిట్టూర్చి తల గోక్కున్నాడు. పడుకున్న వ్యక్తికి కొంతసేపటి క్రితం నీళ్లకోసం దాహం వేసినట్టే అతనికి మాటల కోసం దాహం వేసింది. తన కొడుకు చనిపోయి వారం రోజులు కావస్తోంది. దాని గురించి తను ఇంకా ఎవరితోనూ సంతప్తికరంగా మాట్లాడలేదు. ఆ విషయాన్ని నింపాదిగా వివరంగా ఇతరులతో పంచుకోవాలని కోరుకున్నాడతడు. తన కొడుకు ఎలా జబ్బు పడిందీ, ఎంత యాతనను అనుభవించిందీ, ఎలా చనిపోయిందీ, చనపోయే ముందు తనతో ఏం మాట్లాడిందీ అంతా మాట్లాడాలని ఆశపడ్డాడు. కొడుకు శవయాత్ర ఎలా జరిగిందో, తర్వాత ఆస్పత్రికి పోయి తాను వాడి బట్టలను ఎలా తీసుకున్నాడో చెప్పాలని తాపత్రయంగా ఉంది. తన కూతురు అనిస్యా ఇంకా పల్లెలోనే ఉంది. ఆమె గురించి కూడా చెప్పాలనుకున్నాడు. తను చెప్పినదాన్ని విని ఎదుటివాడు నిట్టూర్చి దుఃఖిస్తే అతనికి ఉపశమనం దొరుకుతుంది. కానీ అలా జరగడం లేదు. ఆడవాళ్లతో చెప్పుకోవడం నయం. వాళ్లు మానసికంగా బలహీనులు కనుక మొదటిమాట వినగానే భోరుమని ఏడుస్తారు.
”గుర్రాన్ని చూసిరావాలి. నేను తర్వాత నిద్ర పోవచ్చు, చింత లేదు,” అనుకున్నాడు యోనా.
అతడు కోటు తొడుక్కొని గుర్రపుశాల లోకి పోయి తన గుర్రాన్ని సమీపించాడు. గుగ్గిళ్ల గురించీ ఎండుగడ్డి గురించీ వాతావరణం గురించీ ఆలోచిస్తున్నాడు. తను ఒంటరిగా ఉన్నప్పుడు అతడు కొడుకు గురించి ఆలోచించలేడు. ఇతరులతోనే మాట్లాడి గుండెభారాన్ని దించుకోవాలి. అంతే తప్ప కొడుకును తల్చుకుంటూ వాడి రూపాన్ని మనసులో నిలుపుకోవడం భరించలేని ఆవేదనను కలిగిస్తుంది.
గుర్రపు మెరిసే కళ్లను చూసి, ”గడ్డి మేస్తున్నావా? అదీ, అలానే గడ్డి మేయాలి నువ్వు. ఇవాళ మనం గుగ్గిళ్లు కొనేందుకు సరిపోయేంత డబ్బు సంపాదించలేదు కనుక నువ్వు గడ్డితోనే సరిపెట్టుకోవాలి. నేను చాలా ముసలివాడినైపోయాను. బగ్గీ నడపలేను. నేను కాదు, నా కొడుకు బగ్గీ నడపాల్సింది. వాడు నిజమైన జట్కావాలా. వాడు బతకాల్సింది,” అన్నాడు యోనా.
కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్లీ ఇలా అన్నాడు: ”అదీ, అలా తిను నా బంగారుకొండా. కుజ్మా యోనిచ్‌ మనకు లేడు. వాడు నాకు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. ఉత్తపుణ్యానికి చనిపోయాడు వాడు. నీకు ఒక చిన్నపిల్ల ఉందనుకో. అంటే నువ్వు దానికి తల్లివి అనుకో. అది ఎకాయెకిన చచ్చిపోయిందనుకో. అప్పుడు నువ్వు దుఃఖంలో మునిగిపోవా?”
ఆ గుర్రం తింటున్నది, వింటున్నది. తన శ్వాసగాలి యజమాని చేతులను స్పర్శించేలా ఊపిరి తీసుకుంటోంది. యోనా భావోద్వేగంతో తన కొడుకు మరణం గురించి గుర్రానికి చెప్పడం మొదలు పెట్టాడు.

ఆంగ్లనుండి అనువాదం: ఎలనాగ, 9866945424

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -