మార్చి 24న ఢిల్లీలో ధర్నా
మన దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం
విద్యుత్ సవరణ చట్టంతో రైతులకు, పేదలకు సబ్సిడీలు ఉండవు
చమురు కొనుగోళ్లను ట్రంప్ నిర్ణయిస్తే ప్రధాని, ఇంధనమంత్రి ఎందుకు?
ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్న కేంద్రం
మోడీ సర్కారువి నయా ఫాసిస్టు విధానాలు
లేబర్ కోడ్‌లు అమలు చేయబోమని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది
తెలంగాణ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలూ అమలు చేయొద్దు :సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం దేశానికే ప్రమాదకరమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ హెచ్చరించారు. మన దేశ వ్యవసాయరంగంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను, విధానాలను నిరసిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మార్చి 24న ధర్నా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాతాలు జరుగుతున్నాయని తెలిపారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ప్రభావం ఒక్క వ్యవసాయ రంగానికే పరిమితం కాదనీ, అన్ని రంగాలపైనా చూపుతుందని హెచ్చరించారు. ఈ విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలను ప్రస్తావించారు.
సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ పాలనను మార్కెట్ వ్యవస్థ నడిపిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా ఏ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే విషయాన్ని ట్రంప్ నిర్ణయించడమేంటి? అలాగైతే ప్రధాని మోడీ, చమురు మంత్రి ఎందుకని ప్రశ్నించారు. నరేగా పేరును వీబీజీఆర్‌ఏఎంజీగా మార్చడం, వంద రోజుల పనిని 125 రోజులకు పెంచుతామని మోడీ సర్కారు ప్రచారం చేయడం పెద్ద మోసమని అన్నారు. అన్ని పని దినాలు కల్పించాలంటే రూ. మూడు లక్షల కోట్లకుపైగా అవసరం కాగా బడ్జెట్‌లో అంతంత మాత్రమే నిధులు కేటాయించడం దారుణమనీ, దాంతో 125 రోజుల పనికల్పన అసాధ్యమని తేల్చి చెప్పారు.
గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలనే ఉద్దేశంతో వామపక్షాలు చేసిన పోరాటాలు, 60 మంది లెఫ్ట్ పార్టీల ఎంపీల ఒత్తిడితో యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కేంద్రం నిధులతో నరేగా చట్టం రూపుదాల్చిందని వివరించారు. ఇప్పుడు మోడీ సర్కారు గ్రామీణ పేదలకు పని కల్పించాలనే చట్టాన్ని నిర్వీరం చేసిందని విమర్శించారు. ఆ చట్టానికి అవసరమయ్యే నిధుల్లో 40 శాతం రాష్ట్రాలే భరిం చాలని చెప్పడం దారుణమన్నారు. విద్యుత్ సవరణ చట్టంతో వ్యవసాయ రంగానికి, పేద వినియోగ దారులకు, ఆస్పత్రులకు, విద్యాలయాలకు సబ్సిడీ విద్యుత్ సౌకర్యం పోతుందని వివరించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 25 నుంచి 30 కోట్ల మంది పాల్గొన్నారని గుర్తుచేశారు. లేబర్ కోడ్‌లను అమలు చేయబోమని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
ఓవైపు బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నామని చెబుతూనే కర్నాటకలోని కాంగ్రెస్ సర్కారు లేబర్‌కోడ్‌లను అమలు చేసే దిశగా చర్యలు మొద లుపెట్టిందనీ, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కూడా లేబర్‌కోడ్‌ల నోటిఫికేషన్లు జారీ చేసిందని విమర్శించారు. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్ పేరుతో బెంగాల్‌లో ఈసీ పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడాన్ని తప్పుబట్టారు. బీజేపీకి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కేరళ స్థానిక ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్‌కు కాస్త సీట్లు తగ్గినప్పటికీ ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మారుతుం దనీ, మళ్లీ లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఓ సదస్సులో కేరళ కమ్యూ నిస్టుల పాలనను కొని యాడారని గుర్తుచేశారు.
పినరయి విజయన్ ప్రభుత్వంలో మత విద్వేషాలకు అవకాశం లేని శాంతియుత వాతావరణంలో కేరళ ప్రజలు నివసిస్తున్నారని ఒక ఇంటర్నేషనల్ సెమినార్‌లో అమర్త్యసేన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం) వైపు యువత పెద్ద ఎత్తున వస్తున్నదనీ, అక్కడ తమ పార్టీ క్రమంగా బలపడుతున్నదని తెలిపారు. ముస్లింలపై గన్ను పెడుతూ అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ బహిరంగంగా పోస్టు పెట్టి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. సుప్రీంకోర్టు జోక్యంతో తన పోస్టు, వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలపై మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును తప్పు బట్టారు. జాతీయ గీతం జనగణ మనతో పాటు వందేమాతరానికి సమ ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ చూస్తోందనీ, వందేమాతరం, కాళీమాతను అడ్డం పెట్టుకుని బెంగాల్‌లో రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. వాటిని అమలు చేయకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే విద్యకు 20 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీని రేవంత్‌రెడ్డి సర్కారు నెరవేర్చాలనీ, పేదలకు మెరుగైన విద్యను అందించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డకుంటున్నది బీజేపీనే అని విమర్శించారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలోనూ కేంద్రం వివక్ష చూపుతున్నదన్నారు.
అందుకే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. కమ్యూనిస్టులు ఎక్కడున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనడాన్ని తప్పుబట్టారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను బీజేపీ అనుసరిస్తున్నదని విమర్శించారు. దాన్ని మానుకోవాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలకు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఎక్కువ సీట్లలో సొంతంగా పోటీ చేయడంతో ఆశించిన స్థానాలను గెలువలేదనీ, అయితే, గతంలో 12 సీట్లు ఉండగా ఇప్పుడు 13 గెలిచామని తెలిపారు. భవిష్యత్తులో తమ పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



