అక్కడి అధ్యాపకులు ఇక్కడి అధికారులకు శిక్షణ ఇస్తారు
హార్డ్‌వర్క్‌ను స్మార్ట్‌గా చేస్తేనే సత్ఫలితాలు : గ్రూప్-1,2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హార్వర్డ్ యూనివర్సిటీతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీ) త్వరలో ఒప్పందం చేసుకోనుందని సీఎం ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. హార్వర్డ్ నుంచి అనుభజ్ఞులైన అధ్యాపకులు ఇక్కడకు వచ్చి సుపరిపాలనపై శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని అధికారుల్లో హార్డ్‌వర్క్‌ను స్మార్ట్‌వర్క్‌గా మార్చుకొని ఎలా పనిచేయాలో తెలుస్తుందని వివరించారు. ప్రతి మనిషి నిత్య విద్యార్థే అనీ, ప్రపంచంలో తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయని అన్నారు. గ్రూప్-1,2 పరీక్షల్లో ఉత్తీర్ణులై, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమం గురువారంనాడిక్కడి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో జరిగింది. దీనికి సీఎం ముఖ్యఅతిధిగా హాజరై నూతన అధికారులకు దిశానిర్దేశం చేశారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు. మొన్నటి వరకు విద్యార్థులుగా, నిన్నటి వరకు నిరుద్యోగులుగా, ఇప్పుడు అధికారులుగా మారుతున్నారని గుర్తుచేశారు.
ప్రజాపాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరంగా సేవలు అందించబోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరనీ, రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదనీ, అధిపత్యం చెలాయిస్తున్న వారిపై తిరుగుబాటు చేశారని వివరించారు. కాకతీయ సామ్రాజ్యంపై సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేసి, వనదేవతలుగా గౌరవించబడుతున్నారని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసమే వారంతా అమరవీరులు అయ్యారని తెలిపారు. అధికారులుగా బాధ్యతలు నిర్వహించేటప్పుడు ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. 6 లక్షల మంది పోటీపడితే, 582 మంది గ్రూప్ 1లో, 775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారని చెప్పారు. 15 ఏండ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదనీ, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఆకాంక్షలను నెరవేర్చిందని చెప్పారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామనీ, గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్న వాళ్ళనే చైర్మెన్, సభ్యులుగా నియమించామన్నారు. గతంలో మాదిరి ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశామని చెప్పారు. గ్రూప్-1 కి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా చేస్తూ, గిట్టని వాళ్ళు కోర్ట్ కు వెళ్లారనీ, అభ్యర్థులు ఒక్క తప్పు కూడా చేయలేదనీ, మెరిట్ మీద ఎంపిక అయ్యారని భావించే ప్రభుత్వం సుప్రీంకోర్టు వరుకు వెళ్లి కొట్లాడిందని తెలిపారు. వివిధ హోదాల్లో అధికారులుగా మారిన తర్వాత బాధ్యతలు మర్చిపోయి మనిషిగా పతనం కావద్దని హితవు పలికారు.
సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత అధికారులదేననీ, ప్రభుత్వానికి వారే కండ్లు, చెవులు అని విశ్లేషించారు. ప్రతిఒక్కరూ తమ కార్యాలయాలకు వెళ్లేముందు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్‌ను తలచుకోవాలనీ, పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టు కోవాలని చెప్పారు. తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుండి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నామని తెలిపారు. కార్యక్రమానికి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం అధికారుల శిక్షణకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. శిక్షణలో మెరిట్ సాధించిన వారికి మెడల్స్ బహూకరించారు.



