Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంజాతీయ ప్రయోజనాల కోసమే ఒప్పందాలు జరగాలి

జాతీయ ప్రయోజనాల కోసమే ఒప్పందాలు జరగాలి

- Advertisement -

విదేశీ ఒత్తిళ్లతో కాదు : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందాలు కుదుర్చుకోవాలే తప్ప విదేశీ ప్రభుత్వాల నుంచి లేదా కార్పొరేషన్ల నుంచి ఒత్తిళ్లువచ్చాయని కుదుర్చుకోరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ పన్ను ఒప్పందాలను కుదుర్చుకునే సమయంలో భారతదేశం తన పన్ను సార్వభౌమాధికారతను పరిరక్షించుకోవాలని స్పష్టం చేసింది. అలాగే న్యాయంగా వ్యవహరించాలనీ, ఎలాంటి దుర్వినియోగానికీ పాల్పడరాదని వివరించింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌ నుంచి అమెరికాకు చెందిన పెట్టుబడిదారీ సంస్థ టైగర్‌ గ్లోబల్‌ బయటకు రావడం వల్ల వచ్చిన క్యాపిటల్‌ గెయిన్స్‌కు భారత్‌లో పన్ను కట్టాలని భారత్‌ రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ జె.బి.పార్దివాలా ఈ వ్యాఖ్యలు చేశారు. బెంచ్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే, అంతర్జాతీయ పన్ను ఒప్పందాల్లో భారత్‌ వైఖరి ఎలా ఉండాలో మరింత విస్తృతమైన సూత్రాలు చెబుతూ జస్టిస్‌ పార్దివాలా విడిగా ఒక నోట్‌ రాశారు.

”పన్ను ఒప్పందాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌, పరిరక్షణా చర్యలు ఇవన్నీ కూడా అత్యంత ఆకర్షణీయంగా, పారదర్శకంగా ఉండాలి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరగాలి. అన్యాయం, అక్రమాలతో కూడిన ఫలితాలను రాకుండా నివారించేందుకు బలమైన ఎగ్జిట్‌ క్లాజులు ఉండాలి. అటువంటి వాటిపై సమర్ధవంతంగా చర్చలు జరిపే శక్తి సామర్ధ్యాలు ఉండాలి. దేశ వ్యూహాత్మక భద్రతను పరిరక్షించుకోవాలి. పన్ను వ్యవస్థ తుడిచిపెట్టుకుపోకుండా, నష్టపోకుండా నివారించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడకుండా చూడాలి. మొత్తంగా పన్నుల విధింపునకు సంబంధించి సార్వభౌమాధికార హక్కును పరిరక్షించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఆ నోట్‌ పేర్కొన్నది. పన్ను ఒప్పందాలన్నీ కూడా దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని, రెవెన్యూ బేస్‌ను, ప్రజా ప్రయోజనాలకు హామీ కల్పిస్తూ తీసుకోవాల్సిన కొన్ని రక్షణలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఒప్పందాలనేవి స్థూలంగా ఆర్థిక, ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించేలా ఉండాలి తప్ప అధికార యంత్రాంగ లేదా దౌత్య లక్ష్యాలకు పరిమితం కారాదని న్యాయమూర్తి జస్టిస్‌ పార్దివాలా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -