Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ విధానాలతో వ్యవసాయ సంక్షోభం

బీజేపీ విధానాలతో వ్యవసాయ సంక్షోభం

- Advertisement -

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
నారాయణపేటలో ఎస్‌కెఎం ఆధ్వర్యంలో సదస్సు
నవతెలంగాణ – నారాయణపేట

వ్యవసాయ సంక్షోభానికి కారణం అవుతున్న బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో ‘పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాలను పునరుద్ధరించాలి” అనే అంశంపై ఏఐయూకెఎస్‌ జిల్లా అధ్యక్షులు భగవంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజలయ్య అధ్యక్షతన నారాయణపేట జిల్లా కేంద్రంలో మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ.. పత్తి సాగులో నారాయణపేట్‌ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. తానెప్పుడూ రైతుల వైపే ఉంటానని మాట ఇచ్చిన మరుసటి రోజే పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని ప్రధాని మోడీ ఎత్తేశారని తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటించిన తరువాత వంట నూనెలపై 10 శాతం సుంకాన్ని కూడా మోడీ ఎత్తేశారని చెప్పారు. అమెరికాకు తలొగ్గి.. అన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు ఎత్తేయడం ద్వారా ఇక్కడి రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మిల్లుదారులు అమెరికా పత్తిని, వంట నూనెలను దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడి రైతులు చాలా నష్టపోతారని తెలిపారు. దిగుమతి సుంకాలు అనేవి ఇప్పటి వరకు దేశానికి రక్షణ కవచంగా ఉన్నాయన్నారు. ఎప్పుడూ స్వదేశీ జపం చేసే మోడీ పరివారం.. విదేశీ దిగుమతులు పెంచి స్వదేశీ రైతులను ఆత్మహత్యల వైపు నెడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో మోడీ దేశ రైతులకు రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని వాగ్దానం చేసి.. అధికారంలోకొచ్చాక ఉన్న ఆదాయం కోల్పోయేలా చేశారని ఏఐయూకెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.ప్రభాకర్‌ అన్నారు. ఇతర దేశాల్లో వ్యవసాయ పెట్టుబడికి రెండింతల ధర ఇస్తారు కానీ దేశంలో రాను రాను సబ్సిడీలను ఎత్తేసి కార్పొరేట్‌లకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. దేశంలోకి అమెరికా పత్తి, వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న మోడీపై తమ మొక్కజొన్నలు కూడా దిగుమతి చేసుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తోందని తెలిపారు. పత్తి సాగు చేసినప్పటి నుంచి రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏఐయూకెఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రాము అన్నారు. మరోవైపు పాలకుల విధానాలతో రైతులు మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, మాస్‌లైన్‌ పార్టీ డివిజన్‌ కార్యదర్శి కాశీనాథ్‌, ఏఐయూకెఎస్‌ జిల్లా కార్యదర్శి బి.యాదగిరి, ఏఐపీకెఎస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సలీమ్‌, ప్రశాంత్‌, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -