Thursday, January 22, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా వ్యవసాయ యంత్రాలు

ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా వ్యవసాయ యంత్రాలు

- Advertisement -

రోడ్డు ఎక్కుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్లు
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
నవతెలంగాణ – రాయికల్

రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు ప్రధాన రహదారులపై కేజీ (ఐరన్) వీల్స్‌తోనే తిరుగుతూ తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పొలం సాగు కోసం అమర్చిన కేజీ వీల్స్‌ను తొలగించకుండా అదే విధంగా రహదారులపైకి తీసుకురావడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ భూముల్లో పని చేయడానికి అనుకూలంగా రూపొందించిన కేజీ వీల్స్ రహదారులపై ప్రయాణానికి పూర్తిగా అనర్హమైనవని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ట్రాక్టర్ల యజమానులు వాటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారులు, గ్రామాల మధ్య ఉన్న బ్లాక్‌టాప్ రోడ్లపై ఈ ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి.

-రోడ్లకు తీవ్ర నష్టం
కేజీ వీల్స్ వల్ల రోడ్లపై గాట్లు పడటం, తారుమారు కావడం,బ్లాక్‌టాప్ పొర దెబ్బతినడం జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులు కొద్ది రోజులకే పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్ల సంరక్షణపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నా, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని విమర్శిస్తున్నారు.

ప్రమాదాల ముప్పు
కేజీ వీల్స్‌తో రోడ్డుపై ప్రయాణిస్తున్న ట్రాక్టర్లు ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు తీవ్ర ప్రమాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ట్రాక్టర్లు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు అంటున్నారు. ఇప్పటివరకు పెద్ద ప్రమాదాలు జరగకపోయినా,ఎప్పుడైనా ఘోర సంఘటనలు జరిగే పరిస్థితి ఉందని ప్రజలు భయపడుతున్నారు.

నిబంధనల ఉల్లంఘన
మోటారు వాహన చట్టం ప్రకారం కేజీ వీల్స్‌తో ప్రధాన రహదారులపై ట్రాక్టర్లు నడపడం నిషేధం. అయినప్పటికీ రవాణా శాఖ,పోలీసు శాఖ అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడం, జరిమానాలు విధించకపోవడం వల్లే ట్రాక్టర్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్
కేజీ వీల్స్‌తో రహదారులపై ప్రయాణించే ట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్రాక్టర్లపై జరిమానాలు విధించాలని, అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని కోరుతున్నారు. లేకపోతే రోడ్డు ప్రమాదాలు, రహదారి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న ఈ పరిస్థితిపై అధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా?లేదా ప్రమాదం జరిగాకే కదిలేనా? అన్నది వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -