Thursday, February 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివ్యవసాయ రంగం: పెట్టుబడి, సోషలిస్టు దేశాల విధానాలు!

వ్యవసాయ రంగం: పెట్టుబడి, సోషలిస్టు దేశాల విధానాలు!

- Advertisement -

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండు విభిన్న దారుల్లో పయనిస్తోంది. ఒకటి స్వేచ్ఛా మార్కెట్‌ ఆధారిత పెట్టుబడిదారి విధానం, మరొకటి ప్రభుత్వ నియంత్రణలో నడిచే సోషలిస్టు విధానం. పెట్టుబడిదారి దేశాల్లో వ్యవసాయం ప్రధానంగా ప్రయివేటు యాజమాన్యంపై ఆధారపడి, మార్కెట్‌లో డిమాండ్‌, సప్లయ్ ప్రకారం ధరలు నిర్ణయించబడతాయి. సోషలిస్టు దేశాల్లో వ్యవసాయం ప్రభుత్వ నియంత్రణ లో లేదా సమూహ యాజమాన్యంలో నడుస్తుంది. ధరలు, ఉత్పత్తి లక్ష్యాలు ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం నిర్ణయించబడతాయి. రైతులకు కనీస మద్దతు ధరలు, సబ్సిడీలు, రాష్ట్ర కొనుగోలు విధానం ఉంటాయి. లాభాల కంటే ఆహార భద్రత, సమాన పంపిణీకి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. అమెరికా వాణిజ్య సుంకాలు భారత వ్యవసాయంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారి దేశాలు, సోషలిస్టు దేశాల మధ్య తేడాలు గమనించాలి.

వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాను పరిశీలిస్తే దేశం మొత్తం 2017లో 39కోట్ల ఎకరాల పంట భూమి, 65.9 కోట్ల ఎకరాల పచ్చిక బయళ్లు ఉన్నాయి. 2024లో రైతుల సంఖ్య 11శాతం మంది రైతులు మాత్రమే ఉన్నారు. సగటున ఒక్కో కుటుంబానికి 466 ఎకరాల భూమి వున్నది. మొత్తం జనాభాలో రెండు శాతం లోపు కుటుంబాలకే భూములున్నాయి. 2015 నుండి 2024 మధ్య ఎనిమిది శాతం రైతులు తగ్గారు. 95 శాతం మంది రైతుల కుటుంబమే సాగుచేస్తుంది. ఐదు శాతం పెద్ద రైతుల వద్ద (పది లక్షల డాలర్లు అంతకు ఎక్కువ ఆదాయం) కలిగివున్నవారు. చిన్న రైతుల ఆదాయం 3.50 లక్షల డాలర్లు. వీరు 85 శాతం మంది. సగటు వయస్సు 58 సంవత్సరాలు ఉండగా 66 సంవత్సరాల వరకు వ్యవసాయం చేస్తారు. కొత్త రైతులు భూములు కొనుగోలు చేసి, పదేళ్లుగా ఉత్పత్తి చేస్తున్నారు.

వీరి సగటు వయస్సు 47 సంవత్సరాలుగా ఉన్నది. జి-7 దేశాలు మొదలుకుని అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఇంచుమించుగా భూములు ప్రయివేటు ఆస్తులుగానే ఉన్నాయి. అందువల్ల, ధనిక, పేదల మధ్య తారతమ్యం పెరిగి నిరుద్యోగం అనివార్యమైంది. నేటి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం దశాబ్దాలు గడిచినా ఈ విధానాన్ని కాపాడుకుంటారు. అన్ని పెట్టుబడిదారీ దేశాలలో పెద్దఎత్తున రాయితీలు, సబ్సిడీలు ఇచ్చినప్పటికీ వ్యవసాయ రంగంలో రైతుల సంఖ్య పెరగడం లేదు. నిరుద్యోగిత, ప్రజల మధ్యన తారతమ్యత పెరుగుతూనే ఉన్నది. దేశంలో 76 లక్షల మంది 4.4 శాతం 16-24 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారు. కోవిడ్‌ కాలంలో 14.7 శాతం నిరుద్యోగం పెరిగింది. తిరిగి 2025లో 4.4 శాతానికి తగ్గింది. ఆత్మహత్యలతోపాటు అవిద్య, అనారోగ్యం కవళ పిల్లలుగా రైతుల వెంటపడుతున్నాయి. వీటికి కూడా పాలక వర్గాలు కార్పొరేటీకరణ విధానం ముందుకు తెచ్చి లాభాలు సంపాదించుకుంటున్నారు.

సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో భూవిధానం
ప్రస్తుతం ప్రపంచంలో చైనా, వియత్నాం, క్యూబా,ఉత్తర కొరియా, లావోస్‌ సోషలిస్టు విధానం కొనసాగిస్తున్నాయి. వీటి జనాభా 160 కోట్లు, కాగా, జి-7 దేశాల 75 కోట్లు మాత్రమే. మిగిలిన మూడవ ప్రపంచ దేశాలలో 612 కోట్ల వరకు ఉన్నారు. కానీ, ఈ జనాభాలో 160 కోట్ల జనాభా ప్రత్యేక లక్షణాలతో సుఖ జీవనం సాగిస్తున్నారు. ఈ దేశాలలో వ్యవసాయ కార్మికులు, భూమి లేనివారు, పేదలు, భూస్వాముల లాంటి వర్గాలు లేవు. మొత్తం భూమి ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో, సమిష్టిగా ఉంటుంది. పట్టణ భూములపై రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ భూములపై సమిష్టి సంస్థలకు అధికారం ఉంటుంది. భూమి వినియోగ విలువ మాత్రమే వ్యక్తులు, సం స్థలు పరిమిత కాలం వరకే పొందగలరు. దీన్ని చట్టం ద్వారా క్రమబద్దీకరణ చేస్తారు. ద్వంద్వ యాజమాన్య వ్యవస్థ: పట్టణంలో రాష్ట్రం, గ్రామాలలో సమిష్టి వ్యవసాయం బాధ్యులుగా ఉంటారు.

భూ వినియోగ హక్కులు: భూమి నేరుగా కొనలేరు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని దీర్ఘకాలం వరకు కౌలుకు తీసుకోవచ్చు. నిర్భంద భూ వినియోగం: ఆహార భద్రత కోసం చైనాలో 30 కోట్ల ఎకరాలు రిజర్వు చేశారు. దీనిని రెడ్‌ లైన్‌గా నిర్ణయించారు. ఏ పరిస్థితులలోనూ ఇతర అవసరాలకు మార్చరాదని కఠినమైన నిబంధనలు నిర్ణయించారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి: భూ వినియోగం, పర్యావరణ పరిరక్షణ కోసం పేసియల్‌ ప్లానింగ్‌ ద్వారా భూమిని వ్యవసాయానికి, అడవికి, పట్టణాలకు కేటాయిస్తారు. భూమి రకాలు: ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, సాగు భూములు, పట్టణ నిర్మాణిత భూములున్నాయి. పట్టణీకరణ వేగవంతంగా పెరుగుతుంది. వ్యవసాయ భూములను పారిశ్రామిక భూములుగా మార్చడానికి కఠిన నిబంధనలుంటాయి. పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ భూ వినియోగ విధానాలు అవలంభిస్తున్నారు.

చైనాలోనే కాక, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా, లావోస్‌లలో కూడా ఆదే విధానాలు అమలు చేస్తున్నారు. భూములపై ప్రభుత్వానికి తప్ప ఎవరికి ఎలాంటి హక్కులుండవు. సాగులో ఉన్నవారికి వినియోగపు హక్కులు ఉంటాయి. భూమి సాగుచేయని వారికి ఇతర ఉపాధి సౌకర్యాలు విధిగా కల్పిస్తారు. వ్యవసాయ ఉత్పత్తిని దేశ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తారు. గతంలో క్యూబాలో చెరకు మాత్రమే పండించి పంచదారను వంద కిలోలు రష్యాకు ఎగుమతి చేస్తే రెండువందల కిలోల గోదుమలు దిగుమతి చేసుకునేవారు. ఆ విధంగా రష్యా ఆధారంగా వారి ఆహార సమస్య పరిష్కారం చేసుకున్నారు. కానీ, అమెరికా ఆంక్షల వల్ల ఎగుమతి, దిగుమతులకు ఆంక్షలు పెట్టడంతో చెరుకును తగ్గించి తమ సొంత భూముల్లో క్యూబా రైతులు నేడు తమ అవసరాల మేరకు ఆహారధాన్యాల ఉత్పత్తికి మారారు. సామ్రాజ్యవాద దేశాలు ఎన్ని ఇబ్బందులు కల్పించినా, సోషలిస్టు ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగలకుండా గత డెబ్బయి ఏళ్లుగా ఇదే విధానాలు కొనసాగిస్తున్నారు.

అమెరికాతో మూడు దశాబ్దాలు పోరాటం చేసిన వియత్నాం విముక్తి పొందిన తర్వాత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉత్తర వియత్నాం వరకే కాక దక్షిణ వియత్నాం కూడా కలుపుకొని సోషలిస్టు భూ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. నేడు ప్రపంచంలో ఏడుశాతం గ్రోత్‌ రేట్‌తో వియత్నాం తమ అవసరాలు పోగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నది. ఎలాంటి ఆస్తులు లేని వారు, కనీసం ఇల్లు లేనివారు ఈ ఐదు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ గల దేశాలలో లేరు. ప్రతి వ్యక్తికి విద్య, వైద్యం, ఆవాసం, కనీస అవసరాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే. చివరికి ఉమ్మడి వంటశాలలు పెట్టి అందరికీ శ్రమను తగ్గిస్తున్నారు. ప్రతి గ్రామానికి, పట్టణానికి, వైద్యుడు వెళ్లి సేవలు చేస్తారు. అలాంటి వ్యవస్థను నేడు అమెరికాలో కూడా కోరుకుంటున్నారు. 2026 జనవరిలో డెబ్బయి లక్షల మంది అధ్యక్షుడు ట్రంపునకు వ్యతిరేకంగా ”నో కింగ్‌” అని ప్రజలు అన్ని నగరాల్లో ఆందోళనలు చేశారు. ఇలాంటి నిరసనలు నేడు అన్ని పెట్టుబడిదారీ దేశాలలో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. నిర్భందం ప్రయోగించి ఉద్యమాలను అణచడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి.

భారత్‌లో వ్యవసాయ పరిస్థితి
దేశానికి స్వాతంత్య్రానంతరం ఎస్టేట్స్‌ రద్దు చేసినప్పటికీ భూమిని ప్రయివేటుపరంగానే అప్పటి ప్రభుత్వం మార్చింది. నేటికీ అదే విధానం కొనసాగుతున్నది. పెట్టుబడిదారీ విధానంలోని ఆర్థిక దోపిడీ, నిజ ఆదాయాల దోపిడీ వలన మెజార్టీ ప్రజలు భూములు కోల్పోయారు. దీనికితోడు కులాలు, మతాలు అడ్డుపెట్టుకుని భూముల కేంద్రీకరణ సాగించారు. తర్వాత కాలంలో ఎన్ని భూ సంస్కరణల చట్టాలు వచ్చినప్పటికీ వాస్తవ సాగుదారులకు భూములు రాలేదు. నేటికీ పేదలు పెట్టుబడిదారీ వ్యవస్థ విధానంలో భూముల కోల్పోతూనే ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పాలక వర్గాలకు అత్యంత ప్రేమపాత్రులుగా ఉద్భవించారు. ఎన్ని చట్టాలు చేసినా వాటన్నింటికీ లొసుగులు ఏర్పాటు చేసి లావునీ భూములు, ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములు, పట్టా భూములు పెద్దఎత్తున ఆక్రమణలు చేస్తున్నారు. సీలింగ్‌ చట్టాలను తుంగలో తొక్కారు.

నేడు దేశంలో డెబ్బయి శాతం మంది ప్రజలకు ఎలాంటి భూ వనరులు లేవు. ప్రస్తుతం వారి ఆదాయాన్ని బట్టి భూమి కొనగలిగిన పరిస్థితి కూడా లేదు. మెజారిటీ శ్రామికుల వద్ద భూమి లాంటి ఆస్తులు లేకపోవడంతో దేశ సంపద పెరగడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే మన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సింది పోయి కార్పొరేట్‌లకు లాభాలు చేకూర్చే విధానాలు అవలంభిస్తున్నది. తాజాగా అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం కూడా అలాంటిదే. ఇలా చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుంటే ఏమవుతుంది? దీని ద్వారా ప్రజలపై భారాలు పెరుగుతాయిగానీ తగ్గుతాయా? ఇది భారతదేశానికి సంబంధించిన చరిత్రే కాదు. ఏ దేశ పెట్టుబడిదారీ పాలన చూసినా అర్థమౌతుంది. అందుకే, మారిన పరిస్థితుల్లో సోషలిస్టు ఆర్థిక విధానాలు అన్ని దేశాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాని కోసం పోరాడాల్సిన బాధ్యత మనందరిది.

సారంపల్లి మల్లారెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -