– అగ్రి స్పోర్ట్స్ మీట్ 2026 లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వ్యాఖ్యలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశీయంగా వ్యవసాయం అత్యంత కీలకమైన,శక్తివంతమైన వృత్తి అని,ప్రతి రైతు ఒక ఐఏఎస్ తో సమానం అని,ఐఏఎస్ అంటే ఇక్కడ ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతరకళాశాల ల విద్యార్థుల అగ్రి స్పోర్ట్స్ మీట్ – 2026 ప్రారంభోత్సవంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో వ్యవసాయంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ రంగానికి సేవలందించే అవకాశమున్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు,అధ్యాపకులు అదృష్టవంతులని పేర్కొన్నారు.క్రీడల్లో గెలుపోటములతో పాటు పాల్గొనడమే ముఖ్యమని,పోటీలను కేవలం పోటీగా కాకుండా అభ్యాసంగా తీసుకొని పరస్పరం నేర్చుకోవాలని సూచించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ చల్లా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పోటీలు విద్యార్థుల్లో క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం,క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. విశ్వవిద్యాలయ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదేనని తెలిపారు.
అగ్రి స్పోర్ట్స్ మీట్–2026 యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ ఎస్.మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతికి ఇంకా పది రోజులు ఉన్నప్పటికీ ఈ క్రీడలతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొందని హర్షం వ్యక్తం చేశారు.నాలుగు రోజులపాటు జరగనున్న క్రీడా పోటీల వివరాలను వివరించారు.
ఈ పోటీలకు విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల నుంచి 467 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.కార్యక్రమ సమన్వయాన్ని అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్, ఆఫీసర్ ఇన్‌చార్జి ఆఫ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ డాక్టర్ ఎం. రామ్ ప్రసాద్ నిర్వహించారు.
ప్రారంభ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన అనంతరం ముఖ్య అతిథులు క్రీడాకారుల నుంచి వందనం స్వీకరించారు. విశ్వవిద్యాలయ గీతం ఆలపించగా, క్రీడా పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పాటు బెలూన్లు, పావురాలను ఆకాశంలో విడిచి పోటీలను ప్రారంభించారు.



